Inspiration

చిరు వ్యాపారం చేస్తూ.. కొడుకుని బంగారు పతక విజేతను చేసిన తల్లి

Posted
FacebookTwitter

ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనే నానుడి మనందరికీ తెలిసిందే. ఇటీవల జాకార్తాలో జరిగిన ఆసియన్ పారా-గేమ్స్-2018 పురుషుల 100 మీటర్ల పరుగుపందెం టి-35 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నారాయణ్ ఠాకూర్ విషయంలోనూ ఇది నిజమైంది. తన విజయం వెనుక తనను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన మాతృమూర్తి పడిన శ్రమ దాగివుందని నారాయణ్ ఠాకూర్ ఉద్వేగంగా తెలియజేశాడు.

ఆసియన్ పారా-గేమ్స్-2018 పురుషుల 100 మీటర్ల పరుగుపందెం టి-35 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మొట్టమొదటి భారత క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పిన నారాయణ్ ఠాకూర్ ప్రధాని చేతుల మీదుగా సన్మానం పొందాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం మా అమ్మ. చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. మా అమ్మ నాకు అన్ని విషయాల్లోనూ ఎంతో ప్రోత్సహించింది” అని తెలిపాడు.
ఈ సందర్భంగా నారాయణ్ ఠాకూర్ ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. తనను పెంచి ప్రయోజకుడిని చేసేందుకు తన తల్లి సమయాపూర్ బడ్లీ మెట్రో స్టేషన్ వద్ద పాన్ మసాలా దుకాణం నిర్వహిస్తున్నట్టు తెలియజేశాడు.

ఠాకుర్ తల్లి రీమాదేవి మాట్లాడుతూ, “కుటుంబ పోషణ కోసం గత 17 సంవత్సరాలుగా నేను ఈ పాన్ మసాలా దుకాణం నడుపుతున్నాను. ఒక మహిళ,
అందులోనూ వితంతువు ఇలా బయటకి వచ్చి దుకాణం నిర్వహించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. కానీ నీకు వేరే దారి లేదు.  మొదట్లో ఎంతో ఇబ్బందిపడ్డాను. కానీ నా పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వటం కోసం న్యాయమార్గంలో ఎలాంటి కష్టాన్నైనా భరిస్తాను” అని తెలిపారు.

తన కొడుకు దేశ ప్రధాని నుండి సత్కారం పొందడంపై ఆమె స్పందిస్తూ.. “నారాయణ్ ఠాకూర్ వంటి కొడుకు తనకు కలిగినందుకు ఈరోజు నేను ఎంతో గర్విస్తున్నాను. అతడి విజయం నాకు మాత్రమే కాదు, ఈ దేశానికి కూడా ఎంతో గర్వకారణం. నేను చెప్పదలచుకున్నదల్లా ఒకటే. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు. దేవుడు మన కోసం ఉంటాడు. మనం చేయాల్సిందల్లా.. మనం సాధించాలన్న దాని కోసం కష్టపడి ప్రయత్నించడమే” అని  అన్నారు.

27 ఏళ్ల నారాయణ్ ఠాకూర్ బీహార్లోని దర్భంగా పట్టణంలో జన్మించాడు. చిన్నతనంలోనే బ్రతుకుతెరువు కోసం అతడి కుటుంబం ఢిల్లీకి పయనమైంది.

హోటల్ వెయిటర్, బస్ క్లీనరుగా జీవితం ప్రారంభం:
నారాయణ ఠాకూర్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. పుట్టుకతోనే అతడు ఎడమ భాగంలో సగం పక్షపాతం (hemiparesis) సోకింది. బ్రతుకుతెరువు కోసం ఎన్నో ఆశలతో దేశ రాజధాని చేరుకున్నారు. కానీ అప్పుడే ఊహించని విధంగా విధి వారి ఆశలను తలక్రిందులు చేసింది. అతనికి 8ఏళ్ల వయసులోనే బ్రెయిన్ ట్యూమర్ కారణంగా తండ్రి మరణించారు. దీంతో వారి ప్రపంచమే పూర్తిగా మారిపోయింది. అతడి తల్లి నిస్సహాయురాలైంది. ముగ్గురు పిల్లల పెంపకం, పోషణ ఆమెకు ఎంతో కష్టంగా మారింది. కానీ ఆమె ఆ కష్టాలన్నీ భరించింది.

అదే సమయంలో పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఆలోచిందేది. పిల్లలకు మంచి చదువు, వసతి, ఆహరం అందుతాయనే ఉద్దేశంతో వారిని సమీపంలోని ‘రాణి దత్త ఆర్య విద్యాలయం’లో చేర్పించాలనుకుంది.

ఎనిమిది సంవత్సరాల పాటు ఆ అనాథాశ్రమంలో గడిపిన నారాయణ ఠాకూర్ 2010లో ఆశ్రమాన్ని వీడి బయటకు వచ్చాడు. తిరిగి తన కుటుంబంతో కలిసి సమాయాపూర్ బడ్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలానికి ఆ ప్రాంతంలోని తాత్కాలిక నివాసాలు కూల్చివేతకు గురయ్యాయి. అందులో వీరి నివాసం కూడా ఉంది. దీంతో వారు సమీపంలోని మరో ప్రాంతానికి వెళ్లారు.

అదే సమయంలో ఆర్ధిక సమస్యలను అధిగమించడం కోసం నారాయణ్ ఠాకూర్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంస్థలో బస్సుల క్లీనర్ గా చేరాడు. ఈ పని వల్ల తన క్రీడలపై దృష్టి పెట్టడం ఇబ్బందిగా మారడంతో రోజుకి 250 రూపాయల సంపాదనతో హోటల్ వెయిటరుగా రెండు సంవత్సరాల పాటు పనిచేశాడు.

రోజూ రన్నింగ్ ప్రాక్టీస్ కోసం తాను ఉంటున్న ప్రాంతం నుండి రోజూ జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి వెళ్లాల్సి వచ్చేది. అందుకోసం 40-50 రూపాయల ఖర్చుతో మూడు బస్సులు మారాల్సి వచ్చేది. ఈ ఆర్ధిక ఇబ్బంది అధిగమించేందుకు తన ప్రాక్టీస్ వేదికను  సమీపంలోని త్యాగరాజ స్టేడియానికి మార్చుకున్నాడు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎంపిక అయ్యే క్రమంలో ఎదురైన సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు అంటారు నారాయణ్ ఠాకూర్.

2015 పారా-ఒలింపిక్స్ క్రీడల్లో నారాయణ్ ఠాకూర్ రజత పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. అప్పటినుండి  అతడి విజయ పరంపర అప్రతిహతంగా కొనసాగుతున్నాయి.

“దేశానికి పతకం తీసుకురావడం ఎంతో గొప్ప అనుభూతి. ఆసియన్ పారా-గేమ్స్ లో బంగారు పతకం సాధించడం ఎంతో ఆనందాన్నిస్తోంది. 2020లో టోక్యోలో జరిగే పారాలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకం సాధించడం నా లక్ష్యం అంటాడు నారాయణ్ ఠాకూర్.

Source: Organiser

FacebookTwitter