Inspiration

కృషి తో నాస్తి దుర్భిక్షం

Posted
FacebookTwitter

ఇది ఒక ఆదర్శవంతమైన కథ.

వీధులను శుభ్రపరిచే ఒక మహిళ తన పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దిందో తెలియజేసే కథ.

సుమిత్ర దేవి గత 30 సంవత్సరాలుగా జార్ఖండ్ ప్రాంతం లోని CCL టౌన్ షిప్ లో వీధులను శుభ్రపరిచే పని చేసింది. చివరికి ఉద్యోగవిరమణ సమయంలో ఆమె ఎంతో గౌరవ మన్ననలు అందుకుంటుందని ఈ ప్రాంతంలో ఎవరు ఊహించలేదు.

ఆమె పదవీ విరమణ సందర్బంగా ఆమె సహోద్యోగులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది సాధారణంగా అందరికి జరిగేదే అయినా ఆ సమయంలో అక్కడకు మూడు కార్లు వచ్చి ఆగడంతో అంతా ఆశ్చర్యపోయారు.
మొట్టమొదట నీలి రంగు కారులో వచ్చిన వ్యక్తి అందరిని ఆకర్షించాడు . ఆయన శివాన్ జిల్లా కలెక్టర్ . అతను నేరుగా వచ్చి సుమిత్ర దేవి పాదాలకు నమస్కరించాడు. అతడు ఆమె కొడుకు.

మిగిలిన రెండు కార్లలో వచ్చిన వ్యక్తులిద్దరు కూడా అతన్ని అనుసరించారు. వాళ్ళిద్దరూ కూడా ఆమె కుమారులే. సుమిత్ర దేవి పెద్ద కుమారుడు వీరేంద్ర కుమార్. అతడు రైల్వేలో ఇంజనీర్. రెండవ కుమారుడు డాక్టర్. మూడవ కుమారుడి పేరు మహేంద్ర కుమార్. అతనే కలెక్టర్.

ముగ్గురు కొడుకులు వచ్చి పాదాలకు నమస్కరించగానే సుమిత్రాదేవి కంటివెంట ఆనందబాష్పాలు వచ్చాయి. పదవి విరమణ సమయంలో కొడుకులు రాక ఆమెకు ఎంతో ఆనందాన్ని కలుగచేసింది .
తన పై అధికారులకు కుమారులను పరిచయం చేస్తూ “నేను 30 సంవత్సరాలుగా ఈ వీధులను ఉడ్చాను కానీ నా పిల్లలు మీలాగే ఉన్నత స్థానాల్లో ఉన్నారు ” గర్వంగా చెప్పింది.
తల్లి గురించి మాట్లాడుతూ ” మా అమ్మ మా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఎక్కడా మాకు తక్కువ చెయ్యకుండా, అనుక్షణం చదువు అవసరాన్ని, ఆవశ్యకతను మాకు చెబుతూనే ఉండేది. అప్పుడు ఆమె నేర్పిన పాఠాలే ఈ రోజు

మమల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయి. ఇటువంటి తల్లి లభించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం ” అన్నారు మహేంద్ర కుమార్.

మిగిలిన ఇద్దరు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. తమ తల్లి జీవితాన్ని చూసిన వారు ముగ్గురూ ఇతరులకు ఎంతో కొంత మంచి చేయాలనీ నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
తన కొడుకులు ఉన్నత స్థాయికి చేరినా , తన ఉద్యోగాన్ని వదలకుండా విరమణ వరకు త్రికరణ శుద్ధితో అంకితభావం తో కొనసాగించడం చెప్పుకోవాల్సిన విషయం.

తన కలలు సాకారం చేసి తన బిడ్డలు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి కారణమైన తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలనే భావన తనకు ఏనాడు కలుగలేదని ఆమె అన్నారు. శివాన్ జిల్లా కలెక్టరైన మహేంద్ర కుమార్ ఆ కార్యక్రమం చూసి చాలా బాధకు లోనయ్యారు . ఆమె సహచరులు ఆమె కన్నీటిని చూసి గర్వించారు.

మహేంద్ర కుమార్ భావోద్వేగంతో ” ఏ పని తక్కువ కాదు, కష్టం కాదు. నిజాయితీగా కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధ్యమే. మేము, మా అమ్మ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా నిలబడ్డామే కానీ కృంగిపోలేదు. మా అమ్మ కష్టానికి ప్రతిఫలంగా ఆమె కలలు సాకారం అయ్యే విధంగా మా జీవితాలలో మేము స్థిరపడినందుకు నేను చాల గర్విస్తున్నాను” అన్నారు.

FacebookTwitter