సోషల్ మీడియా సంగమం 2026: యువతే సామాజిక చైతన్య శక్తి

FacebookTwitter

తెలంగాణ కేంద్రంగా సామాజిక, సాంస్కృతిక చైతన్యం కోసం పనిచేస్తున్న సమాచార భారతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక మాధ్యమ సంగమం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, భారతీయ విలువలను ప్రచారం చేయడం, జాతీయ భావజాలాన్ని విస్తరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకులు శ్రీ సురేష్ హెచ్. కొచ్చాటిల్ దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పెద్ద పెద్ద పనులు మాత్రమే కాకుండా చిన్న చిన్న బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించినా సమాజంలో మార్పు తీసుకురావచ్చని ఆయన పేర్కొన్నారు. యువతకు నేడు డిగ్రీల కంటే వృత్తిపరమైన నైపుణ్యాలు (Skills) అత్యంత ముఖ్యమని ఆయన సూచించారు. ఏ వృత్తినైనా తక్కువగా చూడకూడదని, కష్టపడి పనిచేసే వారిని గౌరవించడం నేర్చుకోవాలని చెప్పారు. ఉదాహరణగా ఒక పానీపూరి అమ్మే వ్యక్తి సంపాదన కూడా గౌరవప్రదమేనని పేర్కొన్నారు. అలాగే విద్యా వ్యవస్థలో క్రమశిక్షణ (Discipline) విజయానికి పునాది అని వివరించారు.

మాతృత్వ శక్తితోనే సామాజిక సవాళ్లకు పరిష్కారం

కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ మాంగళ్య సభ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలోని అనేక సమస్యలకు మూలం కుటుంబ వ్యవస్థలోని లోపాలేనని తెలిపారు. వాటికి పరిష్కారం మాతృత్వాన్ని బలోపేతం చేయడమే అని పేర్కొన్నారు. మాతృత్వం కేవలం శారీరకమైనది మాత్రమే కాకుండా ఒక పవిత్ర సంస్కారం అని చెప్పారు.  5–16 ఏళ్ల పిల్లల కోసం బాల సభ, కాలేజీ విద్యార్థుల కోసం ఛాత్ర సభ కార్యక్రమాల ద్వారా పిల్లలకు సంస్కారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఆధునిక కాలంలో తల్లులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తూ సమాజానికి ఉత్తమ పౌరులను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

దేశాభివృద్ధికి సవాళ్లు

కార్యక్రమంలో పాల్గొన్న RSS క్షేత్ర ప్రచార్ ప్రముఖ్ ఆయుష్ నడింపల్లి మాట్లాడుతూ దేశాభివృద్ధిని అడ్డుకోవడానికి అంతర్జాతీయంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని హెచ్చరించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సుమారు 16,000 NGOలను భారత ప్రభుత్వం నిషేధించింది అని తెలిపారు. గ్లోబల్ మార్కెట్ శక్తులు, నిధులు అందజేసే కొన్ని మీడియా సంస్థలు దేశ మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

చైనా ప్రతి 10–20 ఏళ్లకోసారి కొత్త అంశాలను తెరపైకి తెచ్చి మన సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే “Less of I – More of We” (తక్కువ నేను, ఎక్కువ మనం) అనే భావనతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సామాజిక మాధ్యమాల్లో భౌగోళిక రాజకీయం (Geopolitics), అంతర్జాతీయ పరిణామాలు, సంప్రదాయ భారతీయ ఆహారం, యోగా, యువత నిరుద్యోగం, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక అంశాలు మరియు మధ్యతరగతి మహిళలు, యువతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.

FacebookTwitter