భాగ్యనగర్ సోషల్ మీడియా సంగమం – సంఘటనా స్ఫూర్తికి ప్రతిబింబం

FacebookTwitter

సోషల్ మీడియా వేదికగా దేశం కోసం ధర్మం కోసం జాతి సంఘటనకు పిలుపునిస్తూ హైదరాబాదులోని సైదాబాద్ వెస్ట్ సరూర్‌నగర్‌లో ఉన్న సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో మార్చి 2 ఆదివారం నాడు జరిగిన సోషల్ మీడియా సంగమం 7 ఎడిషన్ కార్యక్రమం ఆసాంతం స్ఫూర్తిదాయకంగా జరిగింది. సమాచార భారతి ఆధ్వర్యంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యహ్నం 1 గం. వరకూ జరిగిన ఈ సంగమంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, కంటెంట్ డెవలపర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విశేష స్పందనను తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలలో ‘సేవ’ లక్ష్యం, ప్రాధాన్యతల గురించి సేవాభారతి తెలంగాణ సోషల్ మీడియా డైరక్టర్ శ్రీ సుయోధన్ రెడ్డి, సోషల్ మీడియా ఆయుధంగా దేశంపై ఇన్‌ఫ్లుయెన్సర్లను ప్రయోగిస్తున్న తీరు గురించి సీబీఎఫ్‌సీ మాజీ సభ్యురాలు – ఐటీ లీడర్ శ్రీమతి సుష్మ ముదిగొండ, చరిత్ర వక్రీకరణల గురించి ఆర్ఎస్ఎస్ దక్షిణమధ్యక్షేత్ర ప్రచారప్రముఖ్ శ్రీ నడింపల్లి ఆయుష్ తమ ప్రసంగాలతో వీక్షకులను ఉత్తేజితుల్ని చేశారు. ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారప్రముఖ్ శ్రీ కట్టా రాజగోపాల్ పర్యవేక్షణ, భాగ్యనగర్ విభాగ్ ప్రచార ప్రముఖ్ దొంతి సంతోష్ కుమార్ సమన్వయ కర్తగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రధానాంశాలు మీ కోసం…

 

జ్యోతి ప్రజ్వలన అనంతరం సమాచార భారతి ఉపాధ్యక్షులు శ్రీ జి వల్లీశ్వర్ ప్రారంభోపన్యాసం చేస్తూ సంస్థ కార్యపద్ధతిని తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా కంటెంట్ అందించేవారంతా ఆ కంటెంట్ ప్రభావం సమాజంపై ఏ విధంగా ఉంటుందనేది ఆలోచించి, దేశానికి మేలు చేసే రీతిలో ప్రధాన స్రవంతి మీడియాని సైతం ప్రభావితం చేసేలా పనిచెయ్యాలని సూచించారు. సమాజం పట్ల బాధ్యతను గుర్తెరిగేలా మీడియాను నడిపించగలగాలన్నారు. ప్రతి ఒక్కరూ మన దేశం, మన సమాజం, మన సంస్కృతి అనే దృష్టికోణంతో శక్తిమంతమైన కథనాలు ఇవ్వాలని తెలియజేస్తూ రజాకార్ల దాడులకు సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందించిన ఒక కథనానికి వచ్చిన స్పందన గురించి చెప్పారు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్లు కథనాన్ని ఆసక్తి కలిగించేలా మొదలుపెట్టడం, వీలైనంత క్లుప్తతను పాటించడం, అసభ్యత లేని భాషను ఉపయోగించడం వంటి మూడు ప్రధానంగా అంశాలపై దృష్టి సారించాలని తన అనుభవాన్ని వల్లీశ్వర్ వెల్లడించారు.

అనంతరం సోషల్ మీడియా ప్రచార ప్రముఖ్ ప్రదీప్ మాట్లాడుతూ సోషల్ మీడియా యాక్టివిస్టుల కలయికే ఈ సోషల్ మీడియా సంగమం ముఖ్యోద్దేశమని తెలిపారు. నెట్‌వర్కింగ్, ట్రెండ్ సెట్టింగ్ లక్ష్యంగా నిత్య శక్తితో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా కంటెంట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ రచయితలు, వాయిస్ ఓవర్ నిపుణులు, షూటింగ్, ఎడిటింగ్ ఇలా భిన్న విభాగాలుకు చెందినవారు కలసి సమష్టి కార్యనిర్వహణతో ముందడుగు వెయ్యాలని అకాంక్షించారు.

సోషల్ మీడియా సంగమంలో భాగంగా Amplifying impact: Seva in the digital age అంశంపై మొదటి కాలాంశం జరిగింది. సేవాభారతి తెలంగాణ సోషల్ మీడియా డైరక్టర్ శ్రీ సుయోధన్ రెడ్డి ఇచ్చిన PPT ప్రజెంటేషన్ సేవారంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలను తెలియజేస్తూ ఆసక్తికరంగా సాగింది. ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థమైనదిగా సేవ జరగాలని, సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తూ సామాజిక అసమానతలను రూపుమాపేలా బలమైన సమూహాలను తయారు చేసేలా ఉండాలన్నారు. విపత్తు నిర్వహణ, విద్య, ఆరోగ్యం, పర్యావరణం, వృద్ధులు సంరక్షణ వంటి రంగాలకు సేవ విస్తరించాలని, ఈ క్రమంలో వనరుల పరిమితి, ఆవగాహన, వ్యూహాత్మక సవాళ్లు, వలంటీర్ల అందుబాటు, విశ్వసనీయత, రాజకీయ – అధికారపరమైన సమస్యలు, నిధి సమీకరణ ఇబ్బందులు వంటి వాటిని దృష్టిలో ఉంచుకోవాలంటూ పలు అంశాలను సుయోధన్ రెడ్డి వివరంగా తెలియజేశారు. సేవారంగానికి సంబంధించిన వివిధ అంశాలపై పలువురు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.

అనంతరం మన దేశంపై సోషల్ మీడియాని ఆయుధంగా ప్రయోగిస్తూ సెలబ్రిటీలను, ఇన్‌ఫ్లుయెన్సర్లను అసాంఘిక శక్తులు, భారత వ్యతిరేక అంతర్జాతీయ శక్తులు ఎలా ఉసిగొలుపుతున్నాయో CBFC మాజీ సభ్యురాలు – ఐటీ లీడర్ శ్రీమతి సుష్మ ముదిగొండ Hindu Wisdom for Modern Crisis అంశం ద్వారా సవివరంగా పలు ఉదాహరణలతో తెలియజేశారు. భారతదేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాల కోసం 21 మిలియన్ డాలర్ల అందజేత, CAAకి వ్యతిరేకంగా స్పందించేందుకు అంతర్జాతీయ పాప్ సింగర్ రిహానాకు డబ్బిచ్చి మరీ ఆమె ట్విటర్ (X platform) అకౌంట్‌లో పోస్టింగ్ పెట్టించడం, ఉచిత టూర్లకు ఆశపడి మాల్దీవుల టూరిజంకి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వత్తాసు పలికిన తీరును శ్రీమతి సుష్మ వివరిస్తూ ఎండగట్టారు. సమాజ నిర్మాణానికి అత్యంత కీలకమైన కుటుంబ వ్యవస్థపై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దాడి గురించి అప్రమత్తం చేస్తూ ఇస్లామిక్ శరణార్ధులతో నానాటికీ ఆక్రమణకు గురవుతున్న జర్మనీ పరిస్థితులను ఉదహరించారు. భారతదేశానికి అత్యంత బలంగా, వెన్నుదన్నుగా నిలిచిన స్త్రీ శక్తి, ఆలయాలు, పూర్వవిద్యా వైభవం, కుటుంబ వ్యవస్థలపై తీవ్ర స్థాయిలో దాడి జరుగుతోందని హెచ్చరించారు. కాస్తయినా ధర్మాన్ని పాటించాలన్న భగవద్గీతా హితోక్తిని ఉదహరిస్తూ చివరికి పెళ్లి మంత్రాలలో సైతం వివాహ లక్ష్యం “దేశం కోసం” అని తెలిపిన ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి, ధ్రువంత ఇంద్రాగ్నిశ్చ రాష్ట్రం ధారాయతాం ధ్రువం, అన్న మంత్రాన్ని శ్రీమతి సుష్మ ప్రస్తావించారు. మన సంస్కృతిపై డబ్బుతో జరిగే దుష్ప్రచారంపై దాడికి సోషల్ మీడియా ద్వారానే మహాసైన్యాన్ని కూడగట్టాలని పిలుపునిచ్చారు. తరువాత కార్యక్రమానికి విచ్చేసిన కొందరు ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు సుష్మ తన అవగాహన మేరకు బదులిస్తానంటూ స్పందించారు.

చివరి కాలాంశంగా చరిత్ర వక్రీకరణ ప్రమాదం, దిద్దుబాటు ఆవశ్యకత (History Tampering & Correction) గురించి, భారతదేశపు నిజమైన చరిత్రపై తరతరాలుగా దేశంలో కొనసాగుతున్న దుష్ప్రచారం గురించి ఆర్ఎస్ఎస్ దక్షిణమధ్యక్షేత్ర ప్రచారప్రముఖ్ శ్రీ నడింపల్లి ఆయుష్ అప్రమత్తం చేశారు. జాతి ఆలోచనను సరైన దిశకు మార్చి, సమాజంలోని ఉత్తమ కార్యాలకు వెలుగునిచ్చేలా అడుగులు వేయడమే సోషల్ మీడియా సంగమం ఆశయం కావాలన్నారు. ఆలోచన (చింతన) కోసం ఈ కార్యక్రమం అంటూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చావా చిత్రాన్ని ప్రస్తావించారు. ఈ చిత్రాన్ని చూసి వేదనకు గురైన విద్యార్థులు, యువతరం రోదిస్తూ తమకు అసలైన చరిత్రను ఎందుకు చెప్పలేదని సమాజాన్ని నిలదీస్తున్నారని… దీన్ని బట్టి నిజాన్ని తెలుసుకోవాలన్న దాహం, కోరిక ప్రజల్లో ఉందని అర్థమవుతోందని, దేశంలో పరివర్తన జరుగుతోందని గ్రహించాలని ఆయుష్ విశ్లేషించారు. మన దేశంపై గ్రీకులు, హూణులు, ముస్లింలు దాడులు చేసినప్పటికీ అవన్నీ బౌతిక ఆక్రమణలు కాగా, బ్రిటిషర్లు మాత్రం మన విద్యావిధానం, సంస్కృతిపై దాడి చేసి సమగ్ర ఆక్రమణకు పాల్పడ్డారని తెలిపారు. ఈ క్రమంలోనే దశాబ్దాల కిందట కల్పిత ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని రుద్ది నేటి హిందూ వ్యతిరేక, సంస్కృత వ్యతిరేక, హిందీ వ్యతిరేక ఉద్యమాలకు నాడే బీజం వేశారని వివరించారు.

మన స్వాతంత్య్ర పోరాటయోధుడైన వీర సావర్కార్ Six glorious epochs of Indian history రచన ద్వారాను, భారతీయులందరూ అమృతపుత్రులని (అమృతస్య పుత్రాః) మన నిజ తత్వాన్ని మేల్కొలిపిన స్వామి వివేకానంద మనలో ‘స్వ’ భావనను తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారని వారి తపను ఆయుష్ గుర్తుచేశారు. మన పూర్వీకులను మూఢులుగా చిత్రీకరించిన బ్రిటిష్ వారి కుట్రను ఎండగట్టి వివేకానందుని స్ఫూర్తితో మన చరిత్రను దిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్యుల దాడి సిద్ధాంతాన్ని (Aryan Invasion theory) విదేశాలలోనూ అమలు చేసిన బ్రిటిష్ వారు మన దేశంలో “ఆదివాసీ” అనే పదాన్ని సృష్టించి ఉత్తర, దక్షిణ భారతీయులను వేరు చేసేందుకు పథకం వేశారంటూ ఈ సిద్ధాంతం కేంద్రంగానే నేడు యూనివర్శిటీలలో నరకాసుర, మహిషాసుర, రావణాసుల పూజలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోక్‌మంథన్ కార్యక్రమంలో వనవాసి, గ్రామవాసి, నగరవాసి… అందరూ భారతవాసులేనన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యలను గుర్తు చేశారు. అయితే, ఈ పరిణామం అంతటితో ఆగక అమెరికాలోని సిస్కో (Cisco) కంపెనీలో ఒక ఉద్యోగి పట్ల కులం పేరిట వివక్ష జరిగిందంటూ రచ్చ రాజేసి ఆ దేశంలో జాతి వివక్షకు భారతదేశంలోని కుల వ్యవస్థే మూలమనే ఆధారరహితమైన తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చారని వెల్లడించారు.

భారతదేశంలో స్త్రీలకు సమాన స్థాయి లేదనే దుష్ప్రచారం గురించి చెబుతూ.. హిందువేతర మతాలు కొన్ని స్త్రీని పురుషుల్లో సగం అని, మహిళలు అసలు మనుషులే కాదని, వారిలో ఆత్మ లేదని, మహిళలకు చివరికి ఓటింగ్ హక్కు కూడా ఇవ్వని పరిస్థితిని వివరించారు. అలాగే సతిపై కూడా తీవ్ర దుష్ప్రచారం జరిగిందని, దశరథ మహారాజు మరణించినప్పుడు సతి జరగలేదని, మహాభారతంలో పాండు రాజు రెండవ భార్య మాత్రమే ఇష్టపూర్వకంగా సతి అయ్యారని తెలియజేస్తూ సతిని భారతీయ సమాజమే నిరోధించింది తప్ప విలియం బెంటింక్ కాదన్నారు.

ఇక భారతదేశపు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి Angus Maddison రచించిన పుస్తకాన్ని ఉటంకిస్తూ బ్రిటిష్ వారు రాకమునుపు, వారి కాలంలోను అంటే దాదాపు 2 వేల ఏళ్లుగా మన దేశం నుంచి ప్రపంచ వాణిజ్యంలో 26 శాతం ఎగుమతులు మనదేశం నుంచే జరిగిన విషయాన్ని ఆయుష్ సోదాహరణంగా తెలియజేశారు. తోలు పరిశ్రమ, వస్త్రాలు, స్టీలు, ఔషధాలు తదితర రంగాలలో మనదే పైచేయి అని, చివరికి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ సైతం మూతపడే స్థితికి వచ్చిందని తెలిపారు. దాంతో బ్రిటిషర్లు కుట్రపన్ని మన ఆర్ధిక వ్యవస్థను సైతం ఛిన్నాభిన్నం చేశారన్నారు. మన ఆర్ధిక – పారిశ్రామిక వ్యవస్థతో ముడిపడి సామాజికంగా జరిగే కుల మార్పు (Caste Mobility) పరిణామానికి కూడా బ్రిటిషర్లు అడ్డుకట్ట వేసి తీవ్ర ద్రోహం చేశారన్నారు. ఇందుకు సంబంధించి ఆనాటి రిజ్లే సర్వేలను చూడవచ్చని, మన దేశానికి చెందిన పలు కులాలని వెనుకబడిన కులాలుగా పేర్కొన్న బ్రిటిషర్ల తీరును నాడు ఆయా కులస్తులు తీవ్రంగా వ్యతిరేకించిన పరిణామాలను ఆయుష్ గుర్తు చేశారు. భారతదేశపు జ్ఞానవైభవాన్ని తెలుసుకునేందుకు వందల, వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన హ్యూయత్సాంగ్, మెగస్తనీస్ వంటి అంతర్జాతీయ పర్యాటకుల రచనలు చూస్తే నిజాలు తెలుస్తాయన్నారు. చివరిగా కార్యక్రమానికి విచ్చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రశ్నలకు ఆయుష్ జవాబులిచ్చి ముగించారు.

FacebookTwitter