హెడ్గేవార్ వైద్య విద్యను పూర్తి చేసుకున్నా… ధన సముపార్జన గురించి ఆలోచించకుండా దేశానికి స్వాతంత్రం ఎలా సిద్ధింపజేయాలన్న ఆలోచనలోనే వుండేవారని రాష్ట్రీయ స్వయంసేవక్ అఖిల భారత కార్యకారిణీ సదస్యులు డాక్టర్ మన్మోహన్ వైద్య అన్నారు. ‘‘మ్యాన్ ఆఫ్ ది మిల్లేనియా డాక్టర్ హెడ్గేవార్’’ అన్న పుస్తక ఆవిష్కరణ సభ కూకట్‌పల్లిలోని వివేకానంద సేవాసమితిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత కార్యకారిణీ సదస్యులు డాక్టర్ మన్మోహన్ వైద్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రోద్యమంలో డాక్టర్జీ అత్యంత క్రియాశీలకంగా పనిచేశారన్నారు. దేశం ఎప్పటి వరకైతే బానిసత్వంలో వుంటుందో అప్పటి వరకు వైద్య వృత్తిని చేయనని, ధన సముపార్జన చేయనని, వివాహం కూడా చేసుకోనని డాక్టర్జీ నిర్ణయించుకున్నారన్నారు. స్వాతంత్రం సముపార్జించడానికి ఎన్ని పద్ధతులైతే వున్నాయో.. ఆ మార్గాలన్నింటిలోనూ డాక్టర్జీ పాల్గొన్నారని, కలకత్తా కేంద్రంగా జరిగిన విప్లవోద్యమంలో, లోకమాన్య తిలక్ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ ఆందోళనలో, హిందూ మహాసభ.. ఇలా అన్నింటిలోనూ సక్రియంగా పాల్గొన్నారని వివరించారు. ఇంత చేస్తున్నా.. అసలు భారత్ ఆంగ్లేయుల చేతిలో ఎందుకు బందీ అయ్యిందో అన్న ప్రశ్న ఆయన్ను వేధించేదని అన్నారు. దీని మూలమేమిటో తెలుసుకోవాలన్న తపన నిత్యం డాక్టర్జీ మనసులో రగులుతూనే వుండేదని పేర్కొన్నారు.
1921 ఖిలాఫత్ ఉద్యమం విఫలమైన తర్వాత దేశంలోని చాలా ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయని, మరీ ముఖ్యంగా కేరళలోని మలబార్ లో అల్లర్లు జరిగాయని, వీటి ప్రతిస్పందనగానే హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను స్థాపించారన్న ధోరణిలో వుండేవారని.. అది శుద్ధతప్పు అని మన్మోహన్ వైద్య స్పష్టం చేశారు. ఆరెస్సెస్ స్థాపన అనేది ఏదో సంఘటనకు ప్రతిస్పందనగా స్థాపించలేదన్నారు. డాక్టర్జీ తన చిన్నతనం నుంచే హిందూ సమాజ సంఘటన కోసం ఏదో చేయాలన్న స్పష్టమైన ఆలోచన వుండేదని, ఈ విషయాన్ని ఆయన తన స్నేహితులతో అనేవారని, ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్జీ చిన్ననాటి స్నేహితులే తమతో పంచుకున్నారని వెల్లడిరచారు. అయితే.. ఈ అల్లర్ల తర్వాత సంఘ స్థాపన జరిగింది నిజమే కానీ.. వాటి కారణంగానే సంఘ స్థాపన జరగలేదని తేల్చి చెప్పారు.
సమాజంలో అప్పటి నుంచే అనేక సామాజిక, ధార్మిక సంస్థలు వుండేవని, అవి ఇప్పటికీ వున్నాయని, సమాజం కోసం చాలా చేస్తున్నాయన్నారు. ఆరెస్సెస్ కూడా ఇలాగే పనిచేస్తుందన్న సామాన్య ఆలోచన అందరిలో వుండేదన్నారు. కానీ.. డాక్టర్జీ ఈ ఆలోచనలన్నింటికీ భిన్నంగానే ఆలోచించారని, చాలా దూరదృష్టితో ఆలోచించేవారన్నారు. నాగపూర్‌లో సంఘ ప్రారంభమైన తొలినాళ్ల నుంచే సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారని తెలిపారు. ముందు నుంచి కూడా సమాజానికి ఉపయోగపడే కార్యాలను ఆర్థికంగా సహాయం చేసే వ్యక్తులున్నారని, కానీ.. డాక్టర్జీ వారి నుంచి ఆశించకుండా.. ప్రతి స్వయంసేవక్ కూడా ఈ సంఘ కార్యం తనదని, ఈ కార్యం కోసం మొత్తం శక్తిని ఇవ్వాలని, త్యాగ నిరతిని అలవర్చుకోవాలని, ఈ హిందూ సంఘటన అన్న కార్యం కోసం తామే స్వయంగా ఆర్థిక వ్యవస్థను సృష్టించుకోవాలన్న భిన్నమైన ఆలోచన డాక్టర్జీకి వుండేదని వివరించారు.
‘‘గురు దక్షిణ’’ అన్న పద్ధతి ధార్మిక పరంపరలో వుందని, కానీ.. సామాజిక క్షేత్రంలో లేదన్నారు. కానీ.. డాక్టర్జీ ‘‘గురు దక్షిణ’’ అన్న మాధ్యమం ద్వారా స్వయంసేవకులు సమర్పణ చేయాలన్న విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అయితే.. అప్పుడు విద్యార్థి స్వయంసేవకులకు ఇప్పటి లాగా పాకెట్ మనీ వుండేది కాదని, దీంతో కట్టెలు కొట్టే పని చేసుకుంటూ.. దాని ద్వారా వచ్చిన డబ్బును గురు సమర్పణగా చేసేవారని వెల్లడించారు. సంఘం ఆర్థికంగా పూర్తిగా స్వావలంబన కావాలన్నది డాక్టర్జీ ఆలోచన అని వివరించారు.
ఇక.. అప్పట్లో సంఘ ప్రార్థన చివర్లో సమర్థ రామదాసు స్వామి మహారాజ్ కీ జై అని అనేవారమని.. దీంతో సమర్థ రామదాస్‌నే గురువుగా భావించే వీలుండేదని, అలాగే చాలా మంది డాక్టర్జీయే గురువు అని అనుకునేవారని, కానీ..సంఘ్ గురువుని ఎంచుకునే ప్రక్రియలోనూ డాక్టర్జీ అత్యంత భిన్నమైన శైలిని ఎంచుకున్నారన్నారు. ఎందుకంటే సంఘ్ పని మొత్తం హిందూ సమాజాన్ని సంఘటితం చేసే పని అని, ఈ సమాజం అత్యంత ప్రాచీన సమాజం అని, అలాగే గురువు కూడా అత్యంత ప్రాచీనతను సూచించేదిగా వుండాలని భావించి, భగవాధ్వజాన్ని గురువుగా స్వీకరించారన్నారు. అయితే.. సంఘానికి సంబంధించిన ధ్వజంపై ఎలాంటి గుర్తూ లేదని, ఎందుకంటే.. మొత్తం సమాజాన్ని సంఘటితం చేస్తుందని, ఇదేదో సమాజంలో ఓ సంస్థ కాదన్నారు. వీటన్నింటినీ చూస్తే.. హెడ్గేవార్‌ది ఎంత దూరాలోచనో అర్థమవుతుందన్నారు. ఆత్మ విస్మృతిలో వున్న సమాజాన్ని మొత్తం సంఘటితం చేయాలన్న ఆలోచనే వుండేదన్నారు. మామూలుగా నిత్య, అనిత్య కార్యాలు అని రెండు వుంటాయని, సంఘం నిత్య కార్యమని, నిరంతరం నడుస్తూనే వుండాలన్నారు. అనిత్య కార్యంవైపు కూడా దృష్టిపెట్టాలన్నది డాక్టర్జీ ఆలోచనగా వుండేదన్నారు. ఓ వైపు సంఘం కార్యమన్న నిత్య కార్యం, మరోవైపు స్వాతంత్య్ర కాంక్ష అన్న కార్యం కూడా నడవాలన్న వివేకతతో డాక్టర్జీ ఆలోచించేవారని, ఇదే వారి విశేషత అని తెలిపారు.
తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి డాక్టర్జీ ఆధునికంగా కూడా ఆలోచించేవారని, అసలు యూనిఫారమ్ (గణవేష) అన్న పద్ధతే హిందూ సమాజంలో వుండేది కాదని, కానీ.. సమానత, ఏకత కోసం యూనిఫారమ్ అవసరమని డాక్టర్జీ ఆలోచించారన్నారు. దీని కోసం ధోవతి, కుర్తా లాంటివి కూడా తీసుకురావచ్చు గానీ.. హెడ్గేవార్ సంఘానికి అత్యంత ఆధునికమైన మిలటరీ యూనిఫారాన్ని సంఘానికి తీసుకొచ్చారన్నారు. అదేవిధంగా పరేడ్ అనేది కూడా హిందూ సమాజానికి కొత్తదని, భారతీయ రాజుల సేనలు కూడా ఈ పరేడ్‌ను చేసేవారు కాదన్నారు. కానీ… సమాజంలో ఓ అనుశాసనత (క్రమశిక్షణ) తీసుకురావడానికి ఈ పరేడ్ అవసరమని డాక్టర్జీ ఆలోచించారని, ఇప్పుడు దానిని సంఘంలో సమత అంటున్నారన్నారు.అలాగే బ్యాండ్‌తో సహా పరేడ్ చేయడం హిందూ సమాజంలో లేదని, శౌర్య భావన తీసుకురావడానికి సంఘానికి డాక్టర్జీ పరిచయం చేశారన్నారు. వీటన్నింటినీ చూస్తే… ఆధునికత అన్న అంశాన్ని డాక్టర్జీ అసహ్యించుకునేవారు కాదని అర్థమవుతోందని, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి దానిని స్వీకరిస్తూనే… మూలాన్ని మాత్రం విడిచిపెట్టలేదన్నారు.
1945 లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిందని, అప్పుడు ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, ఇజ్రాయిల్ చాలా దెబ్బతిన్నాయని, తిరిగి తమ దేశాలను పునర్నిర్మించుకోవాలని పనిని ప్రారంభించారన్నారు. తమకున్న అతి తక్కువ వనరులతో ప్రారంభించారన్నారు. 1947 లో భారత్‌కి స్వాతంత్రం వచ్చిందన్నారు. అయితే.. పై దేశాల్లాగా మన దేశం అంతలా దెబ్బతినలేదన్నారు. అయితే.. గత 70 ఏళ్లలో ఈ దేశాలు ఎంతగా అభివృద్ధి చెందాయో భారత్ అంతలా అభివృద్ధి చెందలేదన్నారు. ఎందుకు? ఏ లోపంతో ఇబ్బంది పడుతున్నాం? అయితే.. మన మూలాలను మనం తెలుసుకోకపోవడమే అసలు ఇబ్బందన్నారు. ఈ నాలుగు దేశాలు కూడా తామెవరో తెలుసుకున్నారని, వారి పూర్వజుల గురించి, వారి మూలాలు తెలుసుకోవడం వల్లే తిరిగి వేగంగా పుంజుకున్నారని వివరించారు.
కానీ.. భారత్‌కి స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్య, రక్షణ, ఆర్థిక రంగాలు మన మూలాల మీద నడవడం లేదని, పశ్చిమ దేశాలను అనుసరించడం వల్లే ఈ దుర్గతి అని ఆయన అన్నారు. భారత్ ఇతిహాసం కొన్నివేల సంవత్సరాలదని, కానీ.. కొత్త కొత్త దేశాలను అనుసరించడం వల్లే ఈ ఇబ్బందులన్నారు. యూరోపియన్ దేశాల్లో అన్ని పనులు ప్రభుత్వాలే చేస్తుంటాయని, ఇది భారత్ పద్ధతి కాదని ప్రముఖ కవి రవీంద్ర నాథ్ ఠాగోర్ అనేవారని, రాజ్యం మీద అతి తక్కువ ఆధారపడే సమాజమే ‘‘స్వదేశీ సమాజ’’ లక్షణమని ఆయన అనేవారని మన్మోహన్ వైద్య గుర్తు చేశారు.
రుగ్వేద కాలం నుంచి భారత్‌లో రాష్ట్ర శబ్దం వుందని, కానీ.. అది రాజు కేంద్రంగా కాకుండా, సమాజం కేంద్రీతంగా వుండేదన్నారు. ఒకే భాష, ఒకే ఉపాసన వుండేది కాదని… ధార్మికత అన్నది అందరీ కలిపి వుంచేదన్నారు. డాక్టర్జీ కాలంలో తమల్ని మూర్ఖులనండి.. కానీ.. హిందువు అని మాత్రం అనకండి అనే వారుండేవారని, తాము అనుకోకుండా హిందువులం అయ్యామని అనేవారని… కానీ.. డాక్టర్జీ అప్పుడే ఢంకా భజాయించి భారత్ హిందూ రాష్ట్రమని చెప్పారని గుర్తు చేశారు. అసలు భారత్ హిందూ రాష్ట్రమని ఎవరంటున్నారు? అని పూణె సభలో ప్రశ్నిస్తే… ‘‘నేను కేశవ్ హెడ్గేవార్ చెబుతున్నాను భారత్ హిందూ రాష్ట్రమే’’ అని స్పష్టం చేశారన్నారు. ఎలాగైతే స్వామి వివేకానంద ఎవరైనా దేవుడ్ని దర్శించారా? అని అడిగితే.. అవును.. నేను దేవుడ్ని దర్శించాను అని పరమహంస ఎంత నిస్సంకోచంగా చెప్పారో… అలాగే డాక్టర్జీ కూడా ఇది హిందూ రాష్ట్రం అని అంత నిస్సంకోచంగా చెప్పారన్నారు. ఇది డాక్టర్జీ సొంత అనుభూతి అని, ఇది పుస్తకాలు చదివి డాక్టర్జీ చెప్పలేదన్నారు.
భారత్ ఎప్పుడూ ఏకం సత్ విప్ర బహుధా వదంతి’’ అన్న దానిని విశ్వసించిందని, అందరూ సమానులే అన్న ధర్మాన్ని నమ్మిందన్నారు. భారత్ ఎప్పుడూ ఇతర దేశాలకు వెళ్లి మత మార్పిళ్లు చేయలేదని, దోపిడీ చేయలేదని, అసలు ఇతర దేశాల వార్ని ఇతరులుగా ఎన్నడూ చూడలేదన్నారు. భారత ధర్మంలో ఓర్పు పాలు ఎక్కువ అని అన్నారు. ఏకత అన్న దృష్టికోణంలోనే ధర్మం సాగుతోందని, దీనిక ఆధారం ఆధ్యాత్మికత అని వివరించారు. కర్మ యోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం అన్న పథంలో నడుస్తామని, దీనిలో ఏ పథాన్నైనా ఎంచుకునే స్వేచ్ఛ హిందూ ధర్మంలో వుందని తెలిపారు. ఎవరి ఉపాసన పద్ధతులను ఎంచుకునే స్వేచ్ఛ భారత్‌లో వుందని, ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం భారత్‌లోనే వుందన్నారు. హిందుత్వ అన్నదే భారత్ విశేషత అని అన్నారు. వైవిధ్యత అన్న దానిని భారత్ ఎన్నడూ తప్పుగా చూడదని, అందులో వున్న విశేషతనే తీసుకుంటుందన్నారు.
ఈ సమాజంలో రాజకీయంగా, సామాజికంగా ఎన్ని మార్పులు వచ్చినా… వాటి కంటే ముందే ఆధ్యాత్మికత విప్లవం రావాలని, డాకర్జీ ఈ ఆధ్యాత్మిక విప్లవం మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టారన్నారు. దేశంలోని మూల విషయాలపైనే ఎక్కువ శ్రద్ధ వహించారన్నారు. 2014 ఎన్నికల తర్వాత మన దేశ విదేశాంగ, విద్యా, రక్షణ రంగాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు. ఇప్పుడు ‘‘స్వ’’ అన్నది బాగా పెరుగుతోందన్నారు. 2014 లో కేవలం కాంగ్రెస్ ఓడి, బీజేపీ వచ్చిందన్న కోణంలోనే చూడొద్దని… దీన్ని ఓ విశేషతతోనే చూడాలన్నారు. భారతీయ సమాజంలో వచ్చిన పరివర్తన వల్లే కేంద్రంలో మోదీ వచ్చారని, ఈ పరివర్తన ద్వారానే అన్ని జరుగుతున్నాయన్నారు. స్వయంసేవకులందరూ వివిధ క్షేత్రాల్లో పనిచేస్తూ… ఈ భావజాలాన్ని విస్తరించాలన్నారు. డాక్టర్జీ ఆలోచన ధార కేవలం భారత్‌కే పరిమితం కాదని, మొత్తం ప్రపంచంలో విస్తరిస్తుందని మన్మోహన్ వైద్య అన్నారు.
ఇక.. దేశంలో విచ్ఛిన్నకర శక్తులు విజృంభిస్తున్న సమయంలో అలాగే తెలంగాణ అంతటా నక్సలిజం వున్న సమయంలో జాతీయ భావాలతో సమాజాన్ని జాగృతం చేయాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో సమాచార భారతి ప్రారంభమైందని అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సమాచార భారతి అనేక కార్యక్రమాలు చేస్తూనే.. విశ్వసంవాద్ కేంద్రతో కలిసి నడవాలని కూడా నిర్ణయించుకుందని తెలిపారు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల వారి కోసం లోకహితం అనే పత్రిక ప్రారంభించామని, తెలంగాణ ప్రాంతంలో చాలా గ్రామాలకు వెళుతోందన్నారు. దీంతో పాటు షార్ట్ ఫిల్మ్ తీసే.. చిన్న చిన్న నిర్మాతలను ప్రోత్సహించడానికి కాకతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా సమాజంలో వున్న అసమానతలను తొలగించే విధంగా చిత్రాలు వుండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. వీటితో పాటు మీడియా వర్క్‌షాపులను కూడా సమాచార భారతి కింద నిర్వహిస్తున్నామని, అలాగే గోలకొండ లిటరరీ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటి ద్వారా సమాజంలో జాతీయ భావాలను నెలకొల్పడానికి సమాచార భారతి పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగానే డాక్టర్జీపై వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మిలీనియా అన్న పుస్తక ఆవిష్కరణ సభ జరుగుతోందని వేణుగోపాల్ రెడ్డి వివరించారు.
క్షేత్ర ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్ పుస్తక పరిచయం చేశారు. ఈ పుస్తకం 572 పేజీలతో వుందని, ఇందులో 32 అధ్యాయాలున్నాయన్నారు. ఈ పుస్తకం తొలుత మరాఠీలో 1966 లో పబ్లిష్ అయ్యిందన్నారు. ఒకవేళ ప్రభుత్వం సంఘ్ ను రద్దు చేయాలని భావించినా.. అసలు సంఘ్ ఎలా రద్దవుతుందని డాక్టర్జీ ప్రశ్నించేవారని, ప్రతి ఒక్కరి మనసులో సంఫ్‌ు స్పష్టంగా వుందని అనేవారని తెలిపారు. డాక్టర్జీ సంఘ్ కార్యపద్ధతిపై నోట్స్ రాసుకున్నారని, అందులో చేసిందే చెప్పాలని రాసుకున్నారని ఇదంతా పుస్తకంలో వుందన్నారు. వివిధ సందర్భాలలో డాక్టర్జీ ప్రతిస్పందనలు, రకరకాల ప్రముఖులతో డాక్టర్జీ సమావేశమైనప్పుడు ఏం మాట్లాడారో కూడా ఈ పుస్తకంలో వున్నాయని తెలిపారు. ప్రస్తుత యువకుల్లో సంఫ్‌ుపై, దాని స్థాపకులు డాక్టర్జీపై అమితాసక్తి నెలకొందని, అందుకే ఓ సాధికారతతో కూడిన పుస్తకం రావాలన్న ఉద్దేశంతోనే ఈ పుస్తకం తీసుకొచ్చామని ఆయుష్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ డా. జ్ఞానేశ్వర్ రావ్ నిట్టా మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వల్లే నేడు హిందువులు ఆత్మ గౌరవంతో తాను హిందువునని చెప్పుకుంటున్నారని, నుదుటిపై ధైర్యంగా తిలక ధారణ చేస్తున్నారని తెలిపారు. చాలా మంది దేశ స్వాతంత్రం సముపార్జన గురించే ఆలోచించారని, కానీ.. డాక్టర్జీ మాత్రం స్వాతంత్రం తర్వాత భారత దేశం గురించి ఆలోచించారని పేర్కొన్నారు. డాక్టర్జీ చరిత్రను అందరూ అధ్యయనం చేయాల్సిన అవసరం వుందని, దూరదృష్టితో ఆయన ఈ సమాజం గురించి ఆలోచించారన్నారు. చాలా మందికి నిజమైన భారత దేశ చరిత్ర తెలియదని, పుస్తకాలు కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించేవిగానే వున్నాయన్నారు. నిజమైన చరిత్రను తెలుసుకునే పుస్తకాలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు.
More Stories
స్ఫూర్తిదాయకంగా గాజుల లక్ష్మీ నరసు చెట్టి పుస్తకావిష్కరణ
గాజుల లక్ష్మీ నరసు చెట్టి పుస్తకావిష్కరణకు వేదిక సిద్ధం
సమాజంలో జాతీయవాద జర్నలిజం.. పాత్రికేయులకు నారదుడు ఆదర్శం