బాలరాముని సేవలో భారత రాష్ట్రపతి ముర్ము

FacebookTwitter

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్య బాలరాముడిని బుధవారం వ్యక్తిగత హోదాలో దర్శించుకున్నారు. రాష్ట్రపతి ముర్ము ఆలయంలోకి ప్రవేశించగానే స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆ తర్వాత హారతి ఇచ్చారు. అంతకు ముందుకు సరయూ నది వద్ద జరిగిన హారతి కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి పాల్గొన్నారు. అనంతరం దేవాలయ ప్రతినిధులు ఆమెకు రామాలయ ప్రతిమను జ్ఞాపికగా అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి ట్విట్టర్లో షేర్‌ చేశారు. అంతకు ముందు అయోధ్యలోని వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు ఉత్తరప్రదేశ్ గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌, మంత్రి సూర్య ప్రతాప్‌ స్వాగతం పలికారు. అనంతరం అయోధ్యలోని హనుమాన్‌ గడీ దేవాలయాన్ని సందర్శించి, ఆంజనేయుడిని దర్శించుకున్నారు. అయోధ్యను దర్శించిన రాష్ట్రపతుల్లో ముర్ము మూడోవారు.

నిజానికి రాష్ట్రపతి ముర్ము బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా రావాల్సింది. కానీ ప్రోటోకాల్‌ కారణంగా ఆమె ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇప్పుడు ముర్ము రామాలయ దర్శనంతో ప్రాణ ప్రతిష్ఠకు ఆమెకు ఆహ్వానం అందలేదని రాహుల్‌ గాంధీతో సహా విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టినట్లైంది. వ్యక్తిగత హోదాలో ముర్ము అయోధ్య రాముడ్ని దర్శించుకున్న నేపథ్యంలో ఆ విమర్శలు పూర్తిగా తప్పని నిరూపితమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కాబట్టే ఆమెను అయోధ్యకు ఆహ్వానించలేదని కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్‌ విమర్శలు చేశారు. ఈ విమర్శలకు అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ దీటుగా సమాధానమిచ్చారు. రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని, ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని తేల్చి చెప్పారు. అవి నిరాధారమైన ఆరోపణలని, హిందూ సమాజాన్ని తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని చంపత్ రాయ్ మండిపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఇద్దరినీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకి ఆహ్వానించామని తెలిపారు. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అత్యంత నిరుపేద వర్గాలను కూడా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానించామని, వారందరూ వచ్చారని చంపత్‌ రాయ్‌ వివరించారు.

FacebookTwitter