
సమాచారభారతి ఆధ్వర్యంలో “తొట్ట తొలి ఆదర్శనీయ పాత్రికేయుడు” నారద మహర్షి జయంతిని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం వలె ఈ ఏడాది కూడా పాత్రికేయులకు ప్రతిభా పురస్కారాలు సన్మాన సత్కారాలు జరిగాయి. ఏప్రిల్ 30న భాగ్యనగరంలోని రెడ్ హిల్స్ లోని FTCCI ఆడిటోరియంలో లబ్ద ప్రతిష్టులైన పాత్రికేయుల సమక్షంలో వైభవోపేతంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలన తర్వాత వందేమాతర గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. అంతకుముందు ఇటీవల స్వర్గస్తులయిన సీనియర్ పాత్రికేయులు కీ.శే కృష్ణవర్మ నివాళిగా రెండు నిముషాలు మౌనం పాటించారు.
అనంతరం సమాచారభారతి అధ్యక్షులు డా. జి గోపాలరెడ్డి గారు సమాచారభారతి ఆవిర్భావం ఎందుకు జరిగింది, జాతీయ భావ ఆలోచనా స్రవంతిని నిలబెట్టాల్సిన అవసరం గురించి వివరించారు. పాత్రికేయుల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఒక దినపత్రిక ‘సారా నిషేధం‘ చేయటానికి ఎలా కారణమైందో, మళ్ళా అదే దినపత్రిక ‘నిషేధం ఎత్తివేయటానికి‘ ఎలా కారణమైందో సభికులకు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే సమాచారభారతి అవసరం ఏమిటో తెలుస్తుందని చెప్పారు. యువ పాత్రికేయులకు విలువలతో కూడిన పాత్రికేయతపై తర్ఫీదు ఇవ్వటం, సామాజిక మాధ్యమంలో పనిచేస్తున్న పౌర పాత్రికేయుల సదస్సులు నిర్వహించడం, చిత్రభారతి ఆధ్వర్యంలో film festival వంటి కార్యక్రమాలు సమాచారభారతి నిర్వహిస్తోందని తెలిపారు. నారద జయంతి విశిష్టతను వివరించిన క్రాంతి దేవ మిత్ర గారు. నారద మహర్షి వైశాఖ బహుళ పాడ్యమిన జన్మించారని, మానవజాతికి ఉపయోగపడే జ్ఞానం అందించే మాధ్యమంగా నారద మహర్షి పనిచేశారని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులకు పురస్కారాలను అందజేసి నగదు బహుమతి అందజేశారు. “వడ్లమూడి స్మారక పురస్కారం” సీనియర్ పాత్రికేయులు శ్రీ రమా విశ్వనాథ్ గారికి అందిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారదుల వారిని ఎలా అపార్ధం చేసుకున్నారో అలాగే జాతీయ వాద పాత్రికేయులను కూడా అపార్ధం చేసుకుంటున్నారని అయినప్పటికీ దేనికీ వెరవక పాత్రికేయం చేస్తున్నామని, ఈ విషయాన్ని గుర్తించి ఈ పురస్కారాన్ని అందించడం చాలా ఆనందంగా వున్నదన్నారు. ‘ భండారు సదాశివ రావు స్మారక’ పురస్కారం గ్రహీత సీనియర్ పాత్రికేయులు శ్రీ సామవేదం జానకీరామశర్మ గారు మాట్లాడుతూ, నారదుల వారి వలె, మహాభారతం లోని సంజయుల వారు పాత్రికేయులకు ఉదాహరణ అని గుర్తు చేశారు. పాత్రికేయులు ఆ నియమాలతో ఇరువైపు వాదనను వినిపించాలని కోరారు. సమాచారభారతి కాలమిస్ట్’ పురస్కారం అందుకున్న కాలమిస్ట్ శ్యామసుందర్ వరయొగి గారు మాట్లాడుతూ తన సిద్దాంతం పట్ల నమ్మకాన్ని గుర్తించకపోతే అవతలి వ్యక్తి విలువ ఏమి వుంటుందనే నిర్ణయంతో జాతీయవాద సిద్దాంతానికి ప్రాముఖ్యతనిచ్చానని, ఆ విలువలే ఇప్పటిక నడిపిస్తున్నాయని ఈ విషయాన్ని గుర్తించిన సమాచారభారతికి కృతజ్ఞతలు తెలిపారు. ‘సమాచారభారతి యువపురస్కారం’ యువ పాత్రికేయులు శ్రీ కొంటు మల్లేశం గారు మాట్లాడుతూ సాందీపని పత్రికలో వ్రాసిన చిన్న చిన్న వ్యాసాలు, నూతన విద్యార్థులను స్వాగతిస్తూ వ్రాసిన ఒక కరపత్రం దాదాపు పది సంవత్సరాలు వాడారని ఆ ధైర్యంతో నే పాత్రికేయ రంగంలోకి వచ్చానని అన్నారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ పత్రిక ‘ఆర్గనైజర్’ సంపాదకులు శ్రీ ప్రఫుల్ల కేత్కర్ గారు మాట్లాడుతూ నారద మహర్షి ని గురించిన అపార్థ ప్రచారం చేయడం తో వారి లోకకళ్యాణ దృష్టి ని గమనించక పోవడం జరిగిందన్నారు. 30 మే 1826వ సంవత్సరం కలకత్తాలో ప్రారంభమైన ఉద్దండ్ మార్తాండ్ పత్రిక ‘నారద మహర్షి’ ముఖచిత్రంతో ప్రచురితం అయ్యిందనీ, ఆ తర్వాత అనేక పర్యాయాలు నారద మహర్షిని పత్రికా రంగ ఆద్యునిగా గుర్తించినా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కనుమరుగు చేశారని వాపోయారు. పత్రికల పై ఆంక్షలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మా పత్రిక ఎదుర్కొందని, నెహ్రూ ప్రభుత్వం విచిత్రమైన ఆంక్షలు విధించిందనీ, దేశవిభజన సమయంలో దాడికి గురైన పాకిస్థాన్, తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) హిందువుల పరిస్థితిని గురించి రాయొద్దన్నారని గుర్తు చేశారు. సమాజం ఎప్పుడు మార్పునకు గురవుతుందని, పత్రికలు లేదా పాత్రికేయత కూడా అలాంటి మార్పునకు గురవుతుందనడానికి తగ్గట్టుగా మార్పులు సహజమైన మౌలిక విలువలను వదిలేయకూడదని హితవు చెప్పారు. పాత్రికేయులు నారద సూత్రాలలోని 75,76,77 వ సూత్రాలను ఆదర్శంగా తీసుకొని సరైన ప్రశ్నలు అడగటం, సరైన వ్యక్తి ని అడగటం, సరైన సమయంలో వార్తను ఇవ్వటం ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. Barkha dutt వంటి పాత్రికేయులు 26/11 దాడి సందర్భంగా ఇచ్చిన లైవ్ కవరేజ్ వల్ల ఎంత మంది కమెండో ల ప్రాణాలు బలి గొన్నాడో గుర్తు చేశారు. అలాంటి పాత్రికేయత మనకు వద్దని చెప్పారు. సామాజిక మాధ్యమాలు, ఈ మధ్య లో వచ్చిన చాట్ gpt వంటి విప్లవాత్మక మైన మార్పులు వచ్చినా కేవలం విలువలు మాత్రమే నిలుస్తాయన్నారు. లోక కళ్యాణం ధ్యేయంగా పని జరగాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పురస్కార గ్రహీతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మహతి గారు కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించారు. సమాచారభారతి సభ్యులు వేదుల నరసింహం గారు, రాంపల్లి మల్లికార్జున గారు, దుర్గారెడ్డిగారు, రాజగోపాల్ గారు, సమాచారభారతి కార్యదర్శి ఆయుష్ నడింపల్లి తదితరులు కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకొన్నారు. రమేష్ గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. దాదాపు 125 మంది కి పైగా పాత్రికేయులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
For full program video Click Here.
More Stories
An Interaction with Prafulla JI Ketkar
Narada Jayanti Invitation in English & Registration Link
Narada Jayanti Invitation in Telugu & Registration Link