మార్గదర్శి `కళాతపస్వి’

FacebookTwitter

దర్శకులు శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ గారు వెండితెరకు ఇటీవలి ఋషి. ఉదాత్త, ఉన్నత సందేశాలు కలిగిన చలనచిత్రాలను హృదయాలకు హత్తుకునే విధంగా ప్రేక్షక లోకానికి అందించిన అరుదైన తార.

విశ్వనాథుని తపస్సుతో వెండితెరకు దిగివచ్చిన `శంకరాభరణం’, `సాగర సంగమం’, `స్వాతిముత్యం’, `స్వయంకృషి’ మొదలైన చిత్రాలు ప్రేక్షకులలో భారతీయ ఆత్మను ప్రకాశింపజేస్తూనే ఉంటాయి.
ఘనవిజయాలు, విశిష్ట అవార్డులు వరించినప్పటికీ, వాటన్నింటినీ పరమేశ్వరానుగ్రహంగా తలదాల్చి, తనను శివసేవకునిగా ప్రకటించుకున్న విశ్వనాథ్ వినయం ఆయనలోని ఔన్నత్యం.

మానవీయతను ఉద్ధరించే కళలు దెబ్బతింటున్న దయనీయమైన స్థితితో ఆ కళాదీపానికి తిరిగి ఇంత చమురు పోసి, ఒత్తిని సరిచేసి, కళామతల్లికి నీరాజనం అర్పించిన ధన్యజీవి విశ్వనాథ్.
దర్శకులు కె. విశ్వనాథ్ లేని లోటు పూడ్చలేనిది. సంగీత, నృత్య ప్రధాన చిత్రాల ద్వారా కళ కళకోసం, సమాజంకోసం, సంస్కృతికోసం, తరతరాల సంస్కారవంతమైన భావితకోసం అనే బాధ్యతాయుత ధోరణిని ఇంత ప్రతిభావంతంగా ప్రపంచానికి తెలియజెప్పే కళావారసులేవని భరతమాత ఇక ఎదురుచూస్తుంది.

– డా. జి. గోపాల్ రెడ్డి, అధ్యక్షులు, సమాచారభారతి

FacebookTwitter