నాడు పారిశుద్ధ్య కార్మికుడు… నేడు నగర మేయర్…

'స్వచ్ఛ సర్వేక్షణ' ప్రకారం ప్రస్తుతం చండీగఢ్‌ దేశంలో మూడవ పరిశుభ్రమైన నగరం.
FacebookTwitter
రాజేష్‌ కాలియా..  తాను పొట్టకూటి కోసం ఏ నగర వీధుల వెంట చెత్త ఏరుకుని జీవనం సాగించారొ ఇప్పుడు అదే నగరాన్ని మేయర్‌ హోదాలో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

చండీగఢ్‌ నగరానకి చెందిన రాజేష్‌ కాలియా వీధుల వెంట ఉన్న చెత్తను సేకరించి, దాని విక్రయం ద్వారా వచ్చిన చిరు సంపాదనతో జీవనం సాగించే వారు. వాల్మీకి వర్గానికి చెందిన వీరి కుటుంబం 1977లో చండీగఢ్‌ వచ్చి స్థిరపడింది. తండ్రి కుందన్‌ లాల్‌ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసేవారు. చాలీచాలని సంపాదనవల్ల వారి ఇల్లు గడవటమే కష్టంగా మారింది. దీంతో రాజేష్‌ ప్రతిరోజూ పాఠశాల నుండి వచ్చీరాగానే తన ఇద్దరు సోదరులు, నలుగురు సోదరీమణులతో కలిసి వీధుల్లోని చెత్త సేకరించి విక్రయిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచేవారు. ఈ క్రమంలో రాజేష్‌ 12వ తరగతిలో ఉండగా అతడికి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌తో ఏర్పడిన అనుబంధం జీవితాన్ని మలుపు తిప్పింది. సంఘ్‌ నేర్పిన నిబద్ధత, సంస్కారం, క్రమశిక్షణలను తప్పనిసరిగా పాటిస్తూ ఉండేవారు.
గత సంవత్సరం చండీగఢ్‌ నగరంలో చెత్తను సేకరించే కాంట్రాక్టుని అప్పటి కలెక్టర్‌ ఒక ప్రయివేటు సంస్థకు అప్పగించడం పట్ల స్వచ్ఛ కార్మికుల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ సందర్భంగా జరిపిన ఆందోళనలకు రాజేష్‌ నేతృత్వం వహించారు. దీని ద్వారా అతనిలోని నాయకత్వ లక్షణాలు వెలుగుచూశాయి. తాజాగా నగరంలోని 7వ వార్డు నుండి  పోటీ చేసిన రాజేష్‌ కాలియా 27 ఓట్లకు గాను 16 ఓట్లు సాధించి చండీగఢ్‌ మేయర్‌ పీఠాన్ని అధిష్టించారు.
రాజేష్‌ కాలియాకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో ఒకరైన బీబీఏ విద్యార్థిని నిషా తన తండ్రి గురించి చెబుతూ కుటుంబాన్ని పోషించడానికి తన తండ్రి  ఎంతో కష్టపడ్డాడని, ఆయన కుటుంబం కోసం అవసరమైన సందర్భాల్లో ఆటో రిక్షా కూడా నడిపేవారని గర్వంగా చెబుతుంది.

12వ తరగతికి మించి చదువుకోలేకపోయిన రాజేష్‌ తన ముగ్గురు కుమార్తెలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి కృషి చేస్తున్నారు.

మేయరుగా తన ముందున్న సవాల్‌

తన కొడుకు సాధించిన ఘన విజయం గురించి వివరిస్తూ రాజేష్‌ తండ్రి కుందన్‌ లాల్‌ ”నా కొడుకు కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలవాడు. మేయర్‌ ఎన్నికల విజయం ద్వారా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని సామాన్యుల కోసం కష్టపడమని చెప్పాను. ఇందులో భాగంగా తమ కుటుంబానికి ఆశ్రయమిచ్చిన చండీగఢ్‌ నగరాన్ని దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా తీర్చిసిద్ధేందుకు కృషి చేయమని తన నా కొడుకుకి చెప్పాను” అంటారాయన.

తండ్రి నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు  కృషి చేస్తానని రాజేష్‌ ప్రకటించారు. దాన్ని ఒక సవాలుగా తీసుకుని చండీగఢ్‌ నగరాన్ని దేశంలోనే పరిశుభ్రమైనదిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు.

‘స్వచ్ఛ సర్వేక్షణ’ ప్రకారం ప్రస్తుతం చండీగఢ్‌ దేశంలో మూడవ పరిశుభ్రమైన నగరం.

FacebookTwitter