నారద జయంతి ఉత్సవాలు

“వేగంగా మార్పు చెందుతున్న ప్రస్తుత మీడియా రంగం లో సామజిక విలువలు, విశ్వాసం, నిబద్దత తో ఉన్న పాత్రికేయులకు సమాచార వ్యవస్థలకు, సంస్థలకు, భవిషత్తులో ప్రాధాన్యం ఉంటుంది.  దానితో పాటు దేశ హితం కోరే వార్తలకు ప్రాధాన్యం ఉంటుంది’’ అని రిలయన్స్ సంస్థల మీడియా విభాగం డైరెక్టర్  శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ తెలిపారు.
FacebookTwitter
భాగ్యనగర్ :  Bhagyanagar

నారద జయంతి , మేకాస్టార్ ఆడిటోరియం, హైదరాబాద్.  తేది 29-ఏప్రిల్ -18

“వేగంగా మార్పు చెందుతున్న ప్రస్తుత మీడియా రంగం లో సామజిక విలువలు, విశ్వాసం, నిబద్దత తో ఉన్న పాత్రికేయులకు సమాచార వ్యవస్థలకు, సంస్థలకు, భవిషత్తులో ప్రాధాన్యం ఉంటుంది.  దానితో పాటు దేశ హితం కోరే వార్తలకు ప్రాధాన్యం ఉంటుంది’’ అని రిలయన్స్ సంస్థల మీడియా విభాగం డైరెక్టర్  శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ తెలిపారు.

సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్, అధ్వర్యంలో హైదరాబాద్ లోని మేకాస్టార్ ఆడిటోరియంలో నిర్వహించిన దేవర్షి నారద జయంతి మరియు పాత్రికేయ సన్మాన సభలో శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ ముఖ్య వక్తగా పాల్గొని “ది ఫ్యూచర్ అఫ్ మీడియా” అనే అంశం పై ప్రసంగించారు.

శరీరంలోని ఒక అవయవం చెడిపోతే వైద్యుడు కత్తితో శస్త్ర చికిత్స చేసి ఆ అవయవాన్ని తొలగించి శరీర ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడతారని, అదేవిధంగా పాత్రికేయులు తమ కలం ద్వారా సమాజంలో ఉన్న అనర్థాలను దూరం చేసేందుకు తోడ్పాటునందించాలని సూచించారు.

వార్తలు ప్రజల వద్దకు చేర్చడమే మీడియా లక్ష్యం. ప్రింట్ /ఎలక్ట్రానిక్/సోషల్ మీడియా అనేవి కేవలం మాధ్యమాలు. జరిగిన సంఘటన ఆధారంగా వార్తను ఈ మాధ్యమాలు ప్రజలకు అందించాలితప్ప వీటి కోసం వార్తలను నిర్మాణం చేయడం తగదన్నారు. 15 సంవత్సరాల క్రితం ఏదైనా ఒక వార్త గ్రామీణ ప్రాంతానికి చేరడానికి సుమారు 24 నుండి 32 గంటల సమయం పట్టేది, కాని నేడు సాంకేతిక అభివృద్ధి కారణంగా క్షణాల్లో ప్రజల దగ్గరకి విషయం తెలిసి పోతోందన్నారు.  ఇకముందు నుంచి వార్తలకు ఎలాంటి వ్యాఖ్యానం చేస్తున్నామనేది  కొలమానంగా మరే అవకాశం ఉంటుందని అన్నారు.

రాబోయేకాలంలో వార్త కేవలం అక్షరాలలోనే కాకుండా, వీడియోతోపాటు  స్థానిక భారతీయ భాషలలో ఉన్నప్పుడే దానికి ప్రాధాన్యత  ఉంటుందని, అదికూడా స్మార్ట్ ఫోన్ లో ప్రజల చేతికి అందించినపుడే మీడియా రంగపు లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.

ఒక చిన్న ట్వీట్  అనేక మార్పులకు దారితీస్తుందని చెప్పారు. ప్రతి పౌరుడు పాత్రికేయునిగా మారిపోయి కలం శక్తిని ప్రదర్శిస్తున్నారని తెలిపారు.  పాత్రికేయులకు విశ్వసనీయత చాలా అవసరమని ఉమేశ్ ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. మొబైల్ ఫోన్లు సమాచార కేంద్రాలుగా మారాయని చెబుతూ అనేక  ఉదాహరణలు వివరించారు.

ఏ కాలంలోనైనా పక్షపాతం, స్వప్రయోజనం లేకుండా ప్రజలకు సమాచారాన్ని అందించాలనే  తపన ఉండి, ఆత్మ విశ్వాసంతో పని చేసే పాత్రికేయులకు సమాజంలో గౌరవమర్యాదలు ఉంటాయని, లోక కళ్యాణం కోసమే పనిచేసిన నారదుడిని పాత్రికేయులు  స్ఫూర్తి గా తీసుకొని పని చేయాలనీ కోరారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ శ్రీ టి పాపిరెడ్డి  మాట్లాడుతూ ఆధునిక సమాజంలో సమాచార రంగం కీలకంగా మారిందని,  ఈ నేపథ్యంలో సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రజలకు వాస్తవాలు తెలియచేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సమాజానికి సంక్షోభాలు ఎదురైనప్పుడు, అందరి మేలు కోరి నారదుడు పని చేశారని , అదేవిధంగా పాత్రికేయులు పని చేయాలని హితవు పలికారు. ఆధునిక సమాజంలో పత్రికలు, మీడియా అనుసరిస్తున్న పాత్ర బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను రాయలేని పరిస్థితులు నెలకొన్నాయని, పాత్రికేయులకు స్వేచ్చ లేని పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు మారాల్సిన అవసరముందని పాపిరెడ్డి అభిప్రాయపడ్డారు. సమాజంలో మీడియా రాజకీయ పార్టీల, లేదా ఒక వర్గపు కొమ్ముకాయడం బాధాకరమని, ఈ స్థితి  నుండి బయటకి వచ్చి స్వేచ్చగా ప్రజల హితం కోసం ప్రజల పక్షంలో నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

మీడియా సంస్థల అధిపతుల భావాలు ఆయా సంస్థలలో పని చేసే పాత్రికేయులపై  ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయని, ఒకప్పుడు ప్రభుత్వ ప్రభావానికి లోనుకాకుండా పాత్రికేయులు వ్యవహరించడంవల్ల  మీడియాకు ప్రభుత్వానికి మధ్య తరచూ ఘర్షణ వాతావరణం ఏర్పడుతూ ఉండేదిని గుర్తు చేసారు. పాత్రికేయులు నిజాలను నిర్భయంగా చెప్పగలగాలని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ, శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం  మాట్లాడుతూ భారత దేశం కేవలం ఆద్యాత్మిక రంగంతోపాటు అన్నిరంగాలలో ప్రపంచానికి దిశా నిర్దేశం చేసిందని , సమాచారాన్ని పాలకుల నుండి ప్రజలకు, ప్రజల నుండి పాలకులను ఏ విధంగా చేరాలి అనే విషయాన్ని దేవర్షి నారదులు వివరించారని  అందుకే మనం నారద జయంతిని పాత్రికేయదినం గా జరుపుకుంటున్నామన్నారు.

అలాగే నారద జయంతి సందర్బంగా సమాచార భారతి నలుగురు పాత్రికేయులను సన్మానించడం జరిగింది. సీనియర్ జర్నలిస్టు, ప్రభుత్వ తెలంగాణ పత్రిక ఎడిటర్ శ్రీ అష్టకాల రామ్ మోహన్ గారికి శ్రీ వడ్లమూడి రామ్ మోహన్ రావు స్మారక పురస్కారం  అందచేయడం జరిగింది.

శ్రీ వడ్లమూడి రామ్మోహన్ రావు స్మారక పురస్కారాన్ని అందుకున్న సీనియర్ పాత్రికేయులు శ్రీ రామ్ మోహన్ గారు మాట్లాడుతూ తన 35 ఏళ్ళ పాత్రికేయ “ఏది వార్త అవుతుంది, ఏది కాదు” అని తెలుసుకోవడమే తన పాత్రికేయ జీవితానికి తొలిమెట్టు అని, పురస్కారాన్ని గ్రహించడం సంతోషంగా ఉందన్నారు.

శ్రీ భండారు సదాశివ రావు స్మారక పురస్కారం అందుకున్న సీనియర్ పాత్రికేయురాలు శ్రీమతి ఉష తురగ రేవల్లి మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ఒక అంతర్గత పోరు జరుగుతోందని, దీని నుంచి బయటపడడానికి సోషల్ మీడియా ఒక సానుకులమైన,  శక్తివంతమైన సాధనమని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఛాయాచిత్రం, దృశ్య మాధ్యమంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేస్తున్న శ్రీ గోవింద రాజు పెండం గారికి సమాచార భారతి ఉత్తమ ఛాయా చిత్రకార పురస్కారాన్ని అందచేసారు. ఈ పురస్కారం అందుకోవడం తనకు ఎంతో స్ఫూర్తిదాయకమని శ్రీ గోవిందరాజు అన్నారు.

సమాచారభారతి ఉజ్వల యువ పురస్కారాన్ని అందుకున్న జర్నలిస్ట్ శ్రీమతి దేవికా రాణి మాట్లాడుతూ ఇలాంటి పురస్కారాలు యువ జర్నలిస్టులకు స్ఫూర్తితో పాటు ఎంతో ఆత్మ విశ్వాసాన్ని, సమాజం పట్ల మరింత బాధ్యతతో పని చేయడానికి ప్రోత్సాహన్ని ఇస్తాయన్నారు.

ఈ సందర్బంగా శ్రీ నడింపల్లి ఆయుష్, సమాచార భారతి నిర్వహిస్తున్న కార్యక్రమాలు గురించి వివరించారు.

కార్యక్రమంలో సమాచార భారతి ప్రాంత కార్యదర్శి శ్రీ ఆయుష్, జర్నలిస్ట్లు శ్రీ క్రాంతి దేవ్ మిత్ర, శ్రీ సాయి, శ్రీ బీరప్ప, శ్రీ స్వామి, శ్రీ నీలేష్, శ్రీ నర్సింగ రావు, శ్రీ విశ్వనాధ్, శ్రీ వేదుల నరసింహం,  విశ్వ సంవాద కేంద్ర సభ్యులు శ్రీమతి అనురాధ, శ్రీ నరసింహులు, శ్రీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

FacebookTwitter