
సాధారణ ప్రజానీకం కూడా తమ ఇళ్ళలో, వ్యక్తిగతంగా జాతీయపతాకాన్ని ఎగురవేయవచ్చని సర్వోన్నత న్యాయస్థానం 2002లో స్పష్టం చేసింది.
అప్పటినుంచి కాగితం, ప్లాస్టిక్ జెండాల తయారీ, అమ్మకాలు పెరిగాయి. జాతీయదినోత్సవాల రోజున ప్రజలు ఎంతో ఉత్సాహంగా, దేశభక్తి ఉట్టిపడుతూ ఈ జెండాలను కొనడం, విరివిగా ఉపయోగించడం చూస్తున్నాము. కానీ విచారించవలసిన విషయం ఏమిటంటే ఆ మర్నాడు ఈ జెండాలన్నీ వీధుల్లో చెల్లాచెదురుగా పడిఉంటాయి. అంతకుముందు రోజు గర్వంగా తమ గుండెలపై వాటిని ధరించినవాళ్లే కాళ్లతో తొక్కుకుంటూ తిరుగుతుండటం కనిపిస్తుంది. చెత్తకుండీలలో కూడా ఇవి కనిపిస్తాయి. ఇలా తమ జాతీయపతాకాన్ని తామే అవమానిస్తున్నామని వాళ్ళు గ్రహించడంలేదు. కొన్నిసార్లు ఈ జెండాలను మిగతా చెత్తతోపాటు కలిపి తగలబెడుతుంటారు. జాతీయపతాకాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాధమిక కర్తవ్యం. కనుక జాతీయపతాకం విషయంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం –
- జాతీయపతాకాన్ని తగిన ఎత్తులో సరిగా ఎగురవేయాలి
- పిల్లలు జెండాను ఆట వస్తువుగా చూడకుండా జాగ్రత్తవహించాలి
- ప్లాస్టిక్ జెండాలను కొనకూడదు.
- అలంకరణ కోసం జాతీయజెండాను ఉపయోగించకూడదు.
- జెండా నలిగిపోకుండా,చిరిగిపోకుండా చూడాలి
- జాతీయపతాకాన్ని ఎవరు తొక్కకుండా జాగ్రత్తవహించాలి
- జెండా నేలపై పడకుండా చూసుకోవాలి
- జాతీయజెండాను పోలిఉండేట్లుగా బట్ట ముక్కలను కలిపి కుట్టకూడదు.
ఇలా జాతీయపతాకాన్ని ఎక్కడపడితే అక్కడ పారవేయడం, తొక్కడం నేరమని చాలమందికి తెలియదు. ఒకవేళ జెండా చిరిగిపోతే, పాడైపోతే దానిని ఎలా తీసివేయాలన్నది కూడా తెలియదు. ఈ నియమాలు 2002 జాతీయపతాక నిబంధనావళిలో పొందుపరచారు.
ఏం చేయాలి?
- చొరవతీసుకోవాలి: జాతీయపతాకానికి పైన చెప్పిన పద్దతిలో ఎలాంటి అవమానం జరగకుండా ఉండేందుకు దీనిగురించి ఇతరులకు అవగాహన కలిగించడంలో మనం చొరవ తీసుకోవాలి.
- జెండాను తొలగించడం: పాడైపోయిన జెండాను జాగ్రత్తగా తీసివేసి,ఎక్కడైనా పాతిపెట్టడమో,కాల్చివేయడమో చేయాలి. పాడైపోయిన జెండాను మడతపెట్టి గౌరవపూర్వకంగా మంటలో వేయాలితప్ప నిర్లక్ష్యంగా విసిరివేయకూడదు. ఇలా చేయకుండా జెండాను చేతిలో పట్టుకుని ఒక పక్క మంట పెట్టడం చట్టరీత్యా నేరం. పాడైన జెండాలను పూడ్చిపెట్టలంటే వాటన్నిటిని ఒక చెక్క పెట్టెలో పెట్టాలి.
- అవగాహన కల్పించాలి: జాతీయజెండా విషయంలో ఏమి చేయాలి,ఏమి చేయకూడదన్నది పాఠశాలలు,కళాశాలల్లో తెలియచెప్పాలి.
- అలాగే మన స్నేహితులు,బంధువులకు కూడా ఈ విషయాలు చెప్పాలి.
- జాతీయపతాకం విషయంలో మన అనుచిత వ్యవహారాన్ని గురించి హెచ్చరించేందుకు,సరైన పద్దతిని తెలియచేయడానికి ఒక బృందంగా ఏర్పడి పనిచేయాలి.
More Stories
మార్గదర్శి `కళాతపస్వి’
17,300 beds arranged in Isolation and covid care centers run by Seva Bharati
సుహృద్భావనను పాడుచేస్తున్న శక్తుల పట్ల జాగరూకులై ఉండాలి: ఆర్.ఎస్.ఎస్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి