నిఘా నీడలో జకీర్ నాయక్

FacebookTwitter

ముంబయకి చెందిన ఇస్లామిక్ బోధకుడు చిక్కుల్లో పడ్డాడు. ఆయన వివాదాస్పద ప్రసంగాలు ప్రస్తుతం జాతీయ మీడియాలో చర్చనీయాంశాలయ్యాయి. యధావిధిగా ఆయన్ను బలపరిచే వాళ్లు ప్రస్తుతించేవాళ్లు బయలుదేరారు. మక్కా వెళ్లిన ఆయన ఈ తంతు చూసి ముంబయ రావడం మాని ఆఫ్రికా దేశాలకు వెళ్లాడు. మక్కానుంచి స్కైప్‌లో మీడియాతో మాట్లాడతానన్నాడు. అదీ రద్దయింది. ఆయనలో భయం ఎక్కువైంది. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఆయన కదలికలపై దృష్టి పెట్టింది. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పేర ఆయన ప్రచారంలోకి వచ్చా డు. ఇటీవల ఢాకాలో పేలుళ్లు జరిపిన తీవ్రవాదుల విచారణలో ‘ఆయన ప్రసంగాలవల్లనే మేము ఉగ్రవాదులమయ్యామన్నారు’ నిందితులు. ఆ ప్రసంగాల కర్త, చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్న అపర మేథావియే జకీర్ నాయక్. 51 ఏళ్ల ఈ బోధకుడు భారత్‌ను విడిచి చాలా కాలమైంది. గత ఏప్రిల్‌లో ఈయన మలేసియాలో ఉన్నాడు. ఈయన ‘ఉమ్రా’ కోసం మక్కా వెళ్లాడు. తరువాత జెడ్డా వెళ్లాడు. ఇది ముస్లింలు పవిత్రంగా నిర్వహించే తీర్ధయాత్ర. కాని జకీర్‌నాయక్‌కు ఇది తీవ్రవవాదుల సంకల్ప సిద్ధియాత్ర. బంగ్లాదేశ్‌లో పీస్‌టీవీ చానల్‌ను నిర్వహిస్తున్న ఈ ప్రబుద్ధుడు తన ప్రసంగాల్లో మాత్రం పచ్చి మతతత్వం, మతోన్మాదం ప్రజలకు నూరిపోస్తాడు. ఆయన నడుపుతున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు వస్తున్న నిధుల విషయంపై ప్రస్తుతం భారత హోంమంత్రిత్వశాఖ ఆరా తీస్తోంది.

భారత్‌కు చెందిన ఎన్‌ఐఎ అరెస్టు చేసిన అగంతకులలో ఐఎస్ అనుమానితుడు ఇబ్రహీం యజ్‌దానీ కూడా జకీర్ నాయక్ ప్రసంగాలు వినేవాడు. మోదీ తన ఆఫ్రికా పర్యటనలో కెన్యాలో మాట్లాడుతూ అన్యాపదేశంగా విద్వేషం చిమ్ముతూ ప్రసంగించే కొందరు బోధకులు సమాజాన్ని చీలుస్తున్నారన్నారు. ఆయన నడుపుతున్న పీస్‌టీవీ దుబాయ్‌నుంచి ప్రసారమవుతుంది. బం గ్లాదేశ్ ఈమధ్యనే తమ దేశంలో పీస్ టీవిని నిషేధించింది. భారత్‌లో పీస్ టీవీ చానల్ ఎప్పుడో నిషేధించబడింది. కాని కొందరు చానల్ ఆపరేటర్లు దొంగచాటుగా ప్రసారాలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం వారిని తాజాగా హెచ్చరించింది. సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈమేరకు కఠినంగా ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జకీర్‌నాయక్ రాతలు, ప్రసంగాలు, నిధులు అన్నీ నిఘా నీడలో వున్నా యి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ కన్ను వేసి వుంచింది. ఇంగ్లాండ్, కెనడా దేశాలు ఇప్పటికే జకీర్‌నాయక్ ప్రసంగాలను, ఆయన తీవ్రవాదాన్ని ఉసిగొల్పడాన్ని నిం దించాయి. ఆయనపై భారత శిక్షాస్మృతి ఐపిసి 153ఎ, 295ఎల కింద మత సామరస్యానికి భంగం కలిగించిన నేరం మోపే వెసులుబాటు వుంది. ఆయన ప్రసంగాలలో ముస్లింలను తీవ్రవాదులు కమ్మని ఆయన రెచ్చగొడుతున్నాడు.

న్యాయ విశే్లషకుడు అమిత్ దేశాయ్ ఆయన ప్రసంగ పూర్తిపాఠంపై విచారణ జరగాలన్నారు! జకీర్‌నాయక్ విషయమై భారత్‌లో ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతంగా చర్చించింది. సామాజిక మాధ్యమాలలో ఈ చర్చలపై అనేకమంది అనేక రకాలుగా స్పందించారు. తమ మతం నమ్మని వారందరూ కాఫిర్లని వారిపై జిహాద్ నిర్వహిస్తామని హింసను ప్రేరేపించే ఉన్మాదులను ఏరిపారేయాలని కొందరన్నారు. ఈ తరహా ప్రేరేపణలు ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్నాయ. వారేదో బాగా అధ్యయనం చేసినట్టు ఇతర మత గ్రంథాలకు వారు కువ్యాఖ్యలు, కొత్త అర్ధాలు చెబుతున్నారు. ఇతర మతానుయాయుల్లో అయోమయం సృష్టిస్తున్నారు. యుట్యూబ్‌లో జకీర్‌నాయక్ ప్రసంగాలను ఎవరైనా వీక్షించవచ్చు. ఆయన బాహాటంగా ఒసామా బిన్‌లాడెన్‌ను, తీవ్రవాదాన్ని సమర్ధిస్తున్నాడు. ప్రతి ముస్లిం తీవ్రవాది కావాలి అని కోరుకుంటున్నాడు. దేవాలయాల విధ్వంసాన్ని, బౌద్ధారామాలను పడగొట్టడాన్ని సమర్ధిస్తున్నా డు.యూదులను చంపాలంటున్నాడు. హిందు దేవీ దేవతల్ని అవమానించడం, దూషించడం ఆయన నైజం. మహిళలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడతాడు. బాల లైంగిక నేరాలను ఆయన సమర్ధిస్తున్నాడు. ‘గే’ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వారిని చంపాలంటున్నాడు. ఈయన్ని సమర్ధిస్తున్న కొందరు కుహనా మేధావులు కూడా మీడియాలో వింత వాదనలు చేస్తున్నారు. ఇది మతం పేర దెయ్యాలను ప్రోత్సహించడమే అవుతుందని వారు తెలుసుకోవాలి.

ఈ విషయమై నిష్పాక్షిక చర్చ చేపట్టిన టైమ్స్‌నౌ చానెల్‌కు చెందిన అర్నబ్ గోస్వామి జకీర్‌నాయక్‌కు సవాలు విసిరారు. ఎందుకు భారత్ రాకుండా పారిపోయావని ప్రశ్నించారు. భారత్‌ను తీవ్రవాద కార్యకలాపాలకు ఎందుకు వాడుకుంటున్నావని ప్రశ్నించారు. ఏ తప్పు చేయకుంటే భారత్‌కు ఎందుకు తిరిగి రాలేదన్నారు. కొన్ని సందర్భాలలో ఆత్మాహుతితో కూడిన తీవ్రవాదం మంచిదే అని ఎందుకు వ్యాఖ్యానించారని అడిగారు. పైగా జకీర్‌నాయక్ తనను ముంబయలో బహిరంగ చర్చకు రమ్మన్నాడని, గంటసేపు చర్చిద్దామన్నాడని, జకీర్‌నాయక్ డొల్లతనాన్ని దేశప్రజలకు తెలియజేయడానికి తనకు ఒక్క నిముషం కూడా పట్టదని, భారత్ మాత్రమే చర్చకు అనువైన ప్రదేశమని, ఆత్మాహుతి దాడుల పేర వ్యాపారం చేస్తున్న జకీర్ పిరికిపంద అని ధైర్యంగా వ్యాఖ్యానించారు. అర్నబ్ గోస్వామి జరిపిన ఈ చర్చపై అనేకమంది జకీర్ అనుచరులు అర్నబ్‌ను నానా మాటలతో దూషించారు. కొందరు జాతీయ వా దులు జకీర్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించా రు. జులై మొదటి వారంలో నిర్వహించబడ్డ ఈ చర్చకు వేలాదిగా ట్వీట్‌లు వచ్చాయి.

కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ఆయనతో వేదిక పంచుకున్నారు. వేదాలనుంచి ఆయ న కొన్ని విషయాలను ఉటంకించడం చూసి ఆయన మహా మేధావి అని మెచ్చుకున్నారు. 2006లో శ్రీశ్రీ రవిశంకర్‌తో కలి సి ఆయన ఓసారి వేదిక పంచుకున్నాడు. వేదాల్లో కూడా అల్లా పేరు వుందని, అల్లోపనిషత్ పేర ఒక ఉపనిషత్తు కూడా వుందని ఆయన మెట్టవేదాంతం వల్లె వేసారు. తప్పు ల తడక సందర్భ చర్చ చేసారు. ఆయన గురించి రవిశంకర్ గురూజీ మాట్లాడుతూ ఆయన తర్కం కంటె వితర్కం చేస్తాడని, పైకి బాగా మాట్లాడుతునే అతిథిగా పిలిచి అవమానిస్తాడని తన ఆధిపత్యం ప్రదర్శిస్తాడని, చెప్పు మనల్ని కరిచిందని మనం వెళ్లి చెప్పును కరుస్తామా? అని ప్రశ్నించారు. మొఘలుల పాలనలో అక్బరు కాలంలో అక్బరును మహమ్మద్ ప్రవక్తగా కీర్తిస్తూ కొందరు వందిమాగధులు రాసిన ‘అల్లోపనిషత్’ గురించి ముస్లింలకు కూడా తెలిసి వుండదు. ‘సత్యార్ధ ప్రకాశం’ రాసిన స్వామి దయానంద సరస్వతి ఆ పుస్తకం ఉపనిషత్తుల కోవలోకే రాదని ఉద్ఘాటించారు. ఇస్లాంకు, హిందు ధర్మానికి గల కొన్ని సామ్యాలను ఉటంకిస్తూ హిందు ముస్లింల సఖ్యతకోసం రవిశంకర్ గురుజీ రాసిన పుస్తకాన్ని జకీర్ అడ్డదిడ్డంగా విమర్శించా డు.‘నేను చెప్పిందే మతం, నాదారే అసలైన దారి’ అని వాదించడం జకీర్ అభిమతం.

‘నప్రతిమే అస్తి’ అని వాఙ్మయంలో వుందని, అందుకే తాను విగ్రహారాధనకు వ్యతిరేకమని జకీర్ వాదన. ప్రతిమలో లేదన్నాడు కానీ, ‘్భగవంతుడు’ ప్రతిమ అనేదే వుంటే అందులోనూ ఆయన వున్నాడు కదా! అంటారు శ్రీశ్రీ రవిశంకర్. అంతటా తానున్నానని గీతాచార్యుడు చెప్పాడు కదా! కేవలం ఇతరులను తప్పుబడితే మనిషి గొప్పతనం తెలియవస్తుందా? అంత తప్పు చేయని వాడే అయితే భారత్‌కు ఎందుకు తిరిగి రాలేదు. పీస్ టీవీ ద్వారా ఆయన వంద మిలియన్ల మందిని మతాంతీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆంగ్లం, ఉరుదు, అరబిక్ భాషలలో అనర్గళంగా ప్రసంగించగలిగిన జకీర్ సూటులో కనిపిస్తాడు.

ప్రసంగాలకు ముందు ఆయన ఒక డాక్టరు. మతాలమధ్య సామ్యాల గురించి మాట్లాడుతూ ఆయన అన్య మతస్తులను బురిడీ కొట్టించడంలో దిట్ట. ఆయన ఇస్లాం ఎంతో అసహనంతో కూడింది అని వొప్పుకుంటాడు, కానీ ఆ అసహనం అవినీతి, వివక్ష, అన్యాయం, కల్తీ, మద్యపానం వంటి దురాచారాలపైనే అంటాడు. సంగీతాన్ని ఆయన ద్వేషిస్తాడు. ఇస్లాంలో నిషేధం కనుక ఆయన సంగీత వాద్యాలను ద్వేషిస్తానంటాడు. శిక్షార్హులకు చేతులు నరికివేసే శిక్ష వేయమంటాడు. మహిళలను కొట్టే అధికారం భర్తలకుందని, యుద్ధ ఖైదీలైన వనితలతో ముస్లింలు లైంగిక వాంఛ తీర్చుకోవచ్చంటూ పరోక్షంగా ఆయన ఐసిస్‌ను సమర్ధిస్తాడు. డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ ఖురాన్‌లో చెప్పిందే నిజమైన సిద్ధాంతమని, విజ్ఞానమని వాదిస్తాడు. ముస్లిం మహిళలు బురఖా ధరించడాన్ని, ఏభై ఏళ్ల వృద్ధుడు 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవడాన్ని ఆయన ఒప్పుకుంటాడు. సాల్మన్ రష్డీ, తస్లిమా నస్రీన్ వంటి ఆధునిక భావాలున్న ముస్లిం రచయితలను ఆయన విమర్శిస్తాడు.

ఇస్లాం వ్యతిరేకులే ఐసిస్‌ను ప్రోత్సహిస్తున్నారని, ఐసిస్‌పై అమెరికా దాడులు కూడా ఖండించదగినవని రెండు గొంతులతో మాట్లాడే మాటల మాయాజాలం జకీర్ సొత్తు. జకీర్‌ను సమర్ధిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ వంటివారు ఏ తరహా సమాజాన్ని కోరుకుంటున్నారో తేల్చుకోవాలి. భారత్‌ను హురియత్ ప్రకారం పాలించాలన్న పిలుపునిచ్చిన జకీర్‌కు ప్రజాస్వామ్యంలో ఎంత నమ్మకముందో ప్రజాప్రతినిధులు గ్రహించాలి. ఆయనది పిల్లమేధావితనంగా కుష్వంత్‌సింగ్ కొట్టి పారేస్తారు. ఖలీద్ అహ్మద్, షహిర్ ఖ్వాజీ వంటివారు కూడా ఆయన్ను విమర్శిస్తారు. ఆయనపై ‘దారుల్ ఉలూమ్’ ఫత్వా జారీ చేసింది కూడా. జకీర్‌నాయక్ గురించి ఎంతైనా రాయవచ్చు. ఈ డొల్ల మేధావిని నమ్మేదెవరు? ఖర్మ కాల్చుకునేదెవరు?

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్

ఆంధ్ర భూమి సౌజన్యం తో

FacebookTwitter