స్విట్జర్లాండ్ జనాదేశం భారత దేశానికి కూడా ఒక హెచ్చరిక

FacebookTwitter
People cast their ballots during a vote on whether to give every adult citizen a basic guaranteed monthly income of 2,500 Swiss francs ($2,560), in a school in Bern, Switzerland, June 5, 2016. REUTERS/Ruben Sprich
People cast their ballots during a vote on whether to give every adult citizen a basic guaranteed monthly income of 2,500 Swiss francs ($2,560), in a school in Bern, Switzerland, June 5, 2016.

స్విట్జర్లాండ్ దేశంలో గడిచిన ఆదివారం ఒక సామజిక అంశం పై ఓటింగ్ జరిగింది, దానికి దారి తీసిన విషయాలను జాగ్రత్తగా గమనిస్తే, ఏ సామాజిక అంశం పై ఓటింగ్ జరిగింది? అని తెలుసుకోవాలి.

స్విట్జర్లాండ్ లోని ఒక సంస్థ తమ దేశంలో ఉండే ప్రజలందరికీ జీవించటానికి సరిపడే కొంత మొత్తాన్ని ఉచితంగా ప్రభుత్వమే సమకుర్చాలి అనే అంశంపై ఒక ఉద్యమాన్ని లేవదీసింది. అక్కడ రాజ్యాంగ నియమానుసారం ఏదైనా విషయం పైన లక్ష మంది సంతకాలు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తే దాని మీద దేశ వ్యాప్తంగా రిఫరండం నిర్వహిస్తారు.

ప్రజలందరికీ జీవించడానికి సరిపడే కొంత మొత్తాన్ని స్విట్జర్లాండ్ ప్రభుత్వమే సమకుర్చాలి అనే ఆలోచనతో లక్ష మంది ప్రజల సంతకాలు సేకరించారు. దాంతో అక్కడి ప్రభుత్వం రెఫరండం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది, అది గత ఆదివారం (5-june-2016) నాడు జరిగింది. దాంట్లో 25% ప్రజలు ఆ ప్రతిపాదనను అంగీకరిస్తూ ఓటు వేయగా, మిగిలిన 75% వాళ్ళు దాన్ని తిరస్కిరించారు. దీంతో ఆ అంశం వీగి పోయింది. కాని వాళ్ళు ఆ అంశాన్ని దేశ, ప్రపంచ దృష్టికి తీసుకొని వచ్చారు. పౌరులందరికీ పనితో నిమిత్తం లేకుండా వచ్చే కనీస ఆదాయాన్ని అందించాలా? వద్దా? అనే ప్రశ్న ఎదురయ్యింది.

ప్రభుత్వాలు సమాజంలోని సర్వజనుల సంక్షేమం కోసం అలోచించి, తదనుగుణంగా కనీస అవసరాలు తీర్చడానికి చేపట్టవలసిన విధి విధానాలను రూపొందిస్తూ ఉంటాయి. అలా అని ప్రభుత్వమే ఉచితంగా డబ్బు సమకూర్చే ప్రయత్నం చేస్తే తాత్కాలికంగా ఒక మంచి పనిగా అందరూ గుర్తించవచ్చు, కాని దానితో వచ్చే దీర్ఘ కాలిక పరిణామాలు ఎట్లా ఉంటాయి అని ఆలోచించవలసిన అవసరం కూడా ఎంతయినా ఉంది.

యాంత్రీకీకరణ, ప్రపంచీకరణ మరియు మనుషుల స్థానంలో మరమనుషులు ప్రవేశించి ఉపాధి అవకాశాలు తగ్గుతూ, ఉద్యోగ భద్రత లేకుండా పోతున్న ఈ కాలంలో ఇటువంటి పథకం అవసరం అన్నది ఆ ఉద్యమకారుల వాదన, అంటే దేశ ప్రజలలో జీవన అభద్రతా నిర్మాణం చేయడం ఒక వైపరీత్యం. అయితే పని లేకుండానే ప్రభుత్వం కొంత ధన సహాయం చేయమనటం అనేది మరొక వైపరీత్యం. ఈ రెండు అన్ని కాలల్లో నిలబడేవి కావు. కాబట్టి ప్రజల తాత్కాలిక అవసరాల కన్నా వాళ్ళకు పని కల్పించి స్వతంత్రంగా, స్వేచ్చగా జీవించడానికి కావలసిన అవకాశాలు కల్పించడం ప్రభుత్వం యొక్క భాద్యత.

స్విట్జర్లాండ్ దేశ ప్రజలు ఎక్కువ సమయం పని చేసే అలవాటు ఉన్నవారు. సెలవుల విషయంలో కూడా పట్టింపు లేకుండా పనిచేసే అలవాటు ఎక్కువగా ఉన్నవారు. 2012 సంవత్సర వార్షిక సెలవు దినాలను ప్రభుత్వం మరో రెండు వారాలు పొడిగిస్తాం అని అంటే, ప్రజలు వద్దన్నారు. ఇపుడు పని చేయకుండా వచ్చే సొమ్ము కూడా మాకు వద్దు అని తిరస్కరించారు.

ప్రస్తుతం మన దేశ పరిస్థితులు చూస్తే సామాన్య ఓటర్ల నుండి రాజ్య సభ ఓటర్ల అయిన ఎం.ఎల్.ఏ/ఎం.పి ల వరకు ‘నోటు’ లేనిదే ‘ఓటు’ లేదు అనే పరిస్థితి మనకు కనపడుతుంది. పాలకుల వరాల జల్లులో తడిసి పోయి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ప్రేక్షక పాత్రకే పరిమితం అయిపోతున్న మన దేశ ప్రజలు జీవితాలను చూస్తే ఎంతో భాధకు, ఆలోచనకు గురి చేస్తున్నాయి. ప్రజలకు అన్ని ఉచితంగా అనే ఆలోచనను కల్గిస్తూ ఆకర్షింప చేసుకుంటున్న రాజకీయ నాయకులకు సరి అయిన పాఠం నేర్పినప్పుడే దేశం సజావుగా ముందుకు పోగలుగుతుంది. ఇట్లాంటి విషయాలను మనం జాగ్రత్తగా గమనించి నట్లయితే ప్రజలందరికి పని కల్పిస్తూ తమ కాళ్ళ మీద తామే స్వయంగా నిలబడేటందుకు కావలసిన పరిస్థితులు నిర్మాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

పండిత్ దీన్ దయాళ్ ఉపాద్యాయ గారు కొన్ని దశాబ్దాల పూర్వమే “ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు” ఉండాలి అని చెప్పారు. భారత దేశ పరంపరాగతమయిన వ్యవస్థలో జీవన బృతికి (జీవనోపాధికి) ఎటువంటి ఆటంకాలు లేని ప్రతివ్యక్తి సగర్వంగా బ్రతికే వ్యవస్థను వికసింప చేసుకుంటూ వచ్చింది. భారత దేశంలో వేల సంవత్సరాలుగా శ్రమ విభజన ప్రతి వ్యక్తి బ్రతకడానికి ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి ఒక హామీ ఇచ్చింది. కాని కాలక్రమంలో ఆ వ్యవస్థ చిన్నాభిన్నమయి ఒక విషమ పరిస్థితులను దేశంలో నిర్మాణం చేసింది. ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కంచ ఐలయ్య షెఫర్డ్ రాసిన వ్యాసంలోని విషయాలను చూస్తే కులాల పేరుతో ప్రజలను చీల్చి ఎట్లా విద్వేషాలు రెచ్చ గొట్టవచ్చు అనేది తేలికగా గ్రహించవచ్చు. ఇలాంటి మేధావులు సమాజ వికాసంలో అడ్డు గోడలు నిర్మాణం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు మన దేశంలో బ్రతుకుకు గ్యారంటీ ఇచ్చిన వ్యవస్థ పై దుష్ప్రచారం చేస్తున్నారు. బ్రిటిష్ పాలనా సమయంలో ఇలాంటి వ్యవస్థను నాశనం చేసారు. దీనితో బ్రతుకు బండి రోడ్డున పడింది. ఈ సమయంలో ఈ దేశ పరంపరాగత ఆలోచనలను ఇప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎట్లా అన్వయించుకోవచ్చో ఆలోచించవలసిన అవసరం ఎంతయినా ఉన్నది. స్వతంత్రం తరువాత ఇలాంటి పరిస్థితిని చక్క దిద్దవలసిన పాలకులు ప్రజలను వివిధ జనాకర్షక పథకాల వైపు ఆకర్షిస్తూ వాళ్ళను స్వతంత్రం, స్వాభిమానం లేని వాళ్ళుగా నిర్మాణం చేసే  ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో అందరు సమాన గౌరవంతో తమ బ్రతుకు తాము బ్రతికే వ్యవస్థను నిర్మాణం చేయడానికి సమాజంలో ఉండే సామజిక నాయకత్వం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దశలో ఆలోచించాలి అని మరో సారి స్విట్జర్లాండ్ దేశ పౌరులు ఇచ్చిన తీర్పు మనకు ఒక హెచ్చరిక.

 

FacebookTwitter