అఖండ భారతం.. అనాది వాస్తవం!-
నాటకీయతవల్ల సంచలనాలు సంభవించవచ్చు.. కేవలం నాటకీయతవల్ల సమస్యలు పరిష్కారం కావు! ప్రధానమంత్రి హఠాత్తుగా పాకిస్తాన్‌కు వెళ్లడం అందువల్ల గొప్ప సంచలనం.. మతోన్మాది అయిన, ‘వెన్నుపోటు’ పొడవడం స్వభావమైన పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేత నవాజ్ షరీఫ్‌కు మోదీ పర్యటనవల్ల అంతర్జాతీయ సమాజంలో గొప్ప గౌరవం లభించింది! ఇదీ సంచలనం..
కానీ నాటకంలో అంతర్నాటకంవలె ప్రచార మాధ్యమాలవారు మరో సంచలనాన్ని సృష్టించారు!! అఖండ భారతదేశం గురించి మాట్లాడటం తెలియనివారికి వివరించడం మహాపరాధమైన భ్రాంతిని కల్పించడానికి మాధ్యమంలో జరిగిన ప్రయత్నం ఈ రెండవ సంచలనం!
‘అఖండ భారతదేశం’ ప్రముఖుల ఆలోచనలపై, రాజకీయ పక్షాల అభిప్రాయాలపై, నిరసనలపై, నిరాకరణలపై ఆధారపడి లేదు. ‘అఖండ భారతం’ సహజమైన చారిత్రక సాంస్కృతిక భౌగోళిక సనాతన వాస్తవం! రాజకీయ హరిహద్దులు తాత్కాలికమైనవి.. సంస్కృతి, జాతీయత సనాతనమైనవి, అంటే శాశ్వతమైనవి! సమాన జాతీయతగల ప్రజలను రాజకీయమైన సరిహద్దులు ఎక్కువకాలం విభజించి ఉంచలేవని అనేక అంతర్జాతీయ ఘటనలు నిరూపించాయి!
క్రీస్తుశకం 1945లో రెండు దేశాలుగా ‘విభజన’కు గురైన జర్మనీ ప్రజలు 1989లో మళ్లీ ఒకటిగా ఏర్పడడం ఒక ఉదాహరణ మాత్రమే!! సమాన సంస్కృతికల ప్రజలను విడదీయడానికై బెర్లిన్ నగరంలో ఏర్పడిన రాజకీయపు ‘గోడ’ను ప్రజలే కూల్చివేశారు! రెండుగా చీలిన ‘వియత్నాం’ మళ్లీ ఏకీకృతమైంది!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి చెందిన వరిష్ఠ ప్రచారక్ రామ్‌మాధవ్ ‘అఖండ భారత’ ఆకాంక్షను వ్యక్తం చేయడం, అందువల్ల ఈ సాంస్కృతిక వాస్తవానికి అనుగుణమైన వ్యవహారం! ఆయన భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో కాక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సభ్యుని హోదాలో ‘‘ఖండిత భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు మళ్లీ ఏకమై అఖండ భారత్ ఏదో ఒక రోజున మళ్లీ ఏర్పడుతుందని ‘సంఘం’ విశ్వసిస్తున్నట్టు’’ మాధ్యమాలవారికి చెప్పాడట! అందువల్ల ఆయన చెప్పినది ‘తప్పు’ అయితే నిరాకరించవలసింది ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ’ ప్రతినిధులు మాత్రమే, ‘ఒప్పు’ అయితే సమర్థించవలసిందీ వారే!
కానీ అనవసరంగా ముందుగానే అందుకున్న భారతీయ జనతాపార్టీ ప్రతినిధులు ‘అఖండ భారత్’ స్ఫూర్తిని నిరసించడం విచిత్రమైన పరిణామం! ‘అఖండ భారత్’ పునరుద్ధరణను ఆకాక్షించడం భారత్ పాకిస్తాన్ మైత్రికి కానీ భారత బంగ్లాదేశ్ మైత్రికి కాని ఎలా భంగకరం? ‘అఖండ భారత్’ మళ్లీ ఏర్పడాలంటున్న ‘సాంస్కృంతిక జాతీయవాదులు’ పాకిస్తాన్‌లో కూడా ఉన్నారు.
‘అఖండ భారత్’ను ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘం’ కొత్తగా కనిపెట్టలేదు. ‘అఖండ భారత్’ యుగాలుగా కొనసాగుతున్న వాస్తవం! సూర్యుని వెలుగు వంటి ఈ వాస్తవాన్ని ఈ దేశంలోని అధికాధికులు గుర్తించారు… రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కూడా ఈ చారిత్రక వాస్తవాన్ని గుర్తించింది, అంగీకరించింది!! ‘వెలుగు’ను, వాస్తవాల వెలుగును చూడబోమని కళ్లు మూసుకునే ‘గుడ్లగూబలు’ సహజమైన పరిణామక్రమాన్ని నిరోధించలేవు!
ఒకప్పటి ‘అఖండ భారత్’ మళ్లీ వాస్తవం కావడం, వైకల్యగ్రస్త అయిన భారత మాత మళ్లీ సర్వసమగ్ర స్వరూపాన్ని సంతరించుకొనడం ఈ ‘పరిణామక్రమం’! ‘అఖండ భారత్’ పునర్‌ఘటితం కావడానికి యుద్ధాలు చేయవలసిన పనిలేదు, ‘అఖండ భారత్’ ద్వారా యుద్ధాలను నిరోధించవచ్చు! స్వతంత్ర దేశాలుగా ఉన్నంతవరకు ఒకప్పటి ‘అఖండ భారత’ ప్రాంతాలు పరస్పరం కలహించడం సంభవించవచ్చు.
అన్ని దేశాలూ ఒక్క దేశం అయినపుడు యుద్ధాలు ఉండవు, సైనిక వ్యయ రక్షణ వ్యయం బాగా తగ్గిపోయి లక్షలాది కోట్ల రూపాయలను ప్రగతి కలాపాలకు ఖర్చుపెట్టవచ్చు!! ‘అఖండ భారత్’ ఇలా ప్రస్తుతం స్వతంత్రంగా ఉన్న ఒకప్పటి ‘ప్రాంతాల’ సాంస్కృతిక సుగతికి మాత్రమే కాదు, ఆర్థిక ప్రగతికి కూడా దోహదకరం!!ప్రస్తుత ‘ఖండిత భారత్’, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు మళ్లీ ఏకీకృతం కావడం ‘అఖండ భారత్’లో సగం మాత్రమే! మరో సగం నేపాల్, భూటాన్, బర్మా, శ్రీలంక, మాల్‌దీవులు, అప్ఘానిస్తాన్‌లుగా ఏర్పడి ఉన్న అఖండ భారత ప్రాంతాలు..
క్రీస్తుశకం 1947 ఆగస్టు 14న మన దేశం నుండి పాకిస్తాన్ విడిపోవడం గురించి మనకు ధ్యాస ఉంది. కానీ అంతకుపూర్వం శతాబ్దులపాటు మిగిలిన ప్రాంతాలు అఖండ భారత్‌నుండి విడిపోవడం గురించి మనకు ధ్యాస లేదు! మహాభారత యుద్ధం ముగిసిన తరువాత కలియుగం ఆరంభమయ్యేనాటికి ‘జంబూద్వీపం’ తొమ్మిది ‘వర్షా’లు- కాంటినెంట్స్‌గా ఏర్పడి ఉంది.
పాశ్చాత్యులు ‘కనిపెట్టి’ భూగోళాన్ని ఖండాలుగా విభజించడానికి వేల ఏళ్ళ పూర్వం నుండి భారతీయులు ధరాతలాన్ని ద్వీపాలుగా వర్షాలుగా, ఖండాలుగా గుర్తించారు. ఎటొచ్చీ ఈ పేర్లు ఆంగ్ల భాషలో లేవు కనుక, ప్రాచీన కాలంలో ఆంగ్ల భాష లేదు కనుక భారతీయుల ‘గుర్తింపు’ను పాశ్చాత్యులు గుర్తించలేదు, మన దేశంలోని పాశ్చాత్య భావదాస్యగ్రస్తులు గుర్తించడం లేదు! కానీ జంబూద్వీపంలోని తొమ్మిది ‘వర్షాల’లో భారత వర్షం నేటి పశ్చిమాసియా మొదలు తూర్పున ఫిలిప్పీన్స్ వరకూ, ఇండోనేసియా వరకూ జపాన్ వరకూ విస్తరించి ఉండేది.
ఈ భారత వర్షమంతటా సనాతన వైదిక సంస్కృతి వ్యాపించి ఉండేది! ఐరోపా వారు రచించిన చరిత్ర కూడా ఈ వాస్తవాన్ని ధ్రువీకరించింది! ఈ ‘్భరత వర్షం’లో ‘సమీకృత రా జ్యాం గ’ వ్యవస్థ ఏర్పడి ఉండిన ప్రాంతం ‘్భరత ఖండం’! భారత వర్షాన్ని పాశ్చాత్యులు ‘గ్రేటర్ ఇండియా’ అని పిలిచారు, ఇది కేవలం హిందూ సంస్కృతికి ఆలవాలమైన ప్రాంతం! సాంస్కృతిక అద్వితీయతతోపాటు సమీకృత రాజ్యాంగ వ్యవస్థ నెలకొని ఉండిన ప్రాంతం భారత ఖండం! ఈ ‘్భరత ఖండమే’ అఖండ భారత్!
ఈ అఖండ భారత్ కైలాసం నుండి కొలంబో వరకూ విస్తరించింది. కైలాసం ఇపుడు టిబెట్‌లో ఉంది, కొలంబో శ్రీలంకలో వుంది! అలాగే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ నుండి బర్మా వరకూ ‘అఖండ భారత్’ వ్యాపించి ఉండేది!
కలియుగం ఆరంభమై ఇప్పటికి 5116 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం 5117వ సంవత్సరం నడుస్తోంది! కానీ ‘కలి’లో 2600 ఏళ్లు గడిచిన తరువాత అంటే ‘పారశీక రాజు’ సైరస్ మన దేశాన్ని ఆక్రమించడానికి యత్నించిన నాటినుండి ‘అఖండ భారత్’ విచ్ఛిన్నం కావడం ఆరంభమైంది. ఈ సైరస్ క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్దినాటివాడు! అఖండ భారతీయుల దృష్టి ఇలా పడమటి దురాక్రమణను నిరోధించేందుకు కేంద్రీకృతమయింది. అందువల్ల తూర్పున ఉన్న టిబెట్, బర్మాలు ‘అఖండ భారత్’ రాజ్యాంగ వ్యవస్థ నుండి దూరమయ్యాయి!
ఆ తరువాత క్రీస్తుశకం 1959 వరకూ దాదాపు రెండు వేల ఐదు వందల ఏళ్లపాటు టిబెట్ స్వతంత్రదేశమైంది! బర్మా అర్థస్వతంత్ర దేశమైంది. 1959లో చైనావారు టిబెట్‌ను దురాక్రమించారు!రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం నాటి అఖండ భారత్ అప్పటి ‘చైనా’తో సమాన వైశాల్యం కలిగిన దేశం. కానీ ‘అఖండ భారత్’ క్రమంగా ముక్కలైంది, ‘చైనా’ క్రమంగా ఇరుగు పొరుగు దేశాలను కబళించింది.
చైనా ఇలా టిబెట్‌ను, ‘సింకియాంగ్’ అన్న మధ్య ఆసియా దేశాలను, మంగోలియాలో కొంత భాగాన్ని మంచూరియాను ఆక్రమించి కలుపుకొంది. ఫలితంగా ప్రస్తుత ‘ఖండిత’ భారత్ కంటే చైనా వైశాల్యం చాలా ఎక్కువగా ఉంది! అఖండ భారత విచ్ఛిత్తివల్ల ఏర్పడిన భౌగోళిక విపరిణామం ఇది! చైనాకు మనకూ మధ్య అతి పెద్ద సరిహద్దు ఏర్పడటానికి ఏకైక కారణం టిబెట్‌ను చైనా దురాక్రమించడం.
టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండిన సమయంలో రెండు వేల ఐదు వందల ఏళ్లపాటు చైనాతో మన దేశానికి సరిహద్దు లేదు. అంతకుపూర్వం టిబెట్ ‘అఖండ భారత్’లో భాగం! ‘సింకియాంగ్’ లేదా ‘జింఝియాంగ్’గా మారిన తూర్పు తుర్కీస్థాన్‌లో ‘ఇస్లాం’కు పూర్వం వైదిక మతాలు, బౌద్ధమతం విలసిల్లాయి.
క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దులో సింకియాంగ్ చైనాలో కలిసిపోయిన తరువాత మాత్రమే చైనాకూ మనకూ మరో సరిహద్దు ఏర్పడింది! ఇలా సహస్రాబ్దులపాటు బర్మాకు ఉత్తరంగా ఈశాన్యంగా మాత్రమే చైనాతో మనకు కొద్దిపాటు సరిహద్దు ఉండేది! అఖండ భారత విచ్ఛిత్తివల్ల చైనా దురాక్రమణ మన సరిహద్దులకు చేరింది!! చైనా ‘విస్తరణ’ ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో అఖండ భారత్ మళ్లీ ఏర్పడడం ఒక్కటే దురాక్రమణ నిరోధానికి మార్గం…బర్మా ప్రాంతాన్ని బ్రిటీష్ వారు 1885 వరకూ దురాక్రమించలేకపోయారు.
మిగిలిన భారతదేశం క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్ది ఆరంభం నాటికే బ్రిటీష్ వారికి స్వాధీనం అయింది. అలా 1885వరకూ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకున్న అఖండ భారత ప్రాంతం బర్మా! 1885లో బర్మా-మ్యాన్‌మార్- బ్రిటీష్ దురాక్రమిత ‘్భరత్’లో కలిసిపోయింది! ఈ కథ అలాగే కొనసాగి ఉండినట్టయితే 1947 ఆగస్టు 15 తరువాత ‘బర్మా’ స్వతంత్ర భారత్‌లో కొనసాగి ఉండేది! బ్రిటీష్ వారు కొనసాగనివ్వలేదు, 1937లోనే బర్మాను భారత్ నుంచి విడగొట్టారు!!సింహళం అఖండ భారత అంతర్భాగమన్నది చరిత్ర నిరూపించిన వాస్తవం.
సింహళ ద్వీపవాసులు తమిళనాడు దక్షిణ ప్రాంతాలను పాలించడం, తమిళ రాజులు సింహళాన్ని పాలించడం అఖండ భారత సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో భాగం. మాలా ద్వీపాలను మహిళా ద్వీపాలని కూడా ఐరోపా చరిత్రకారులు అభివర్ణించారు!! భారతీయుల సాంస్కృతిక ధార్మిక కేంద్రాలు భారతదేశం వెలుపల లేవు.. ‘సింహళం’- శ్రీలంకలో శక్తిపీఠం ఉంది. ‘‘లంకాయాం శాంకరీ దేవీ..’’! అలాగే మాలా ద్వీపాలలో వైదిక బౌద్ధమతాలు నెలకొని ఉండేవి.
ఇస్లాం ‘జిహాదీ’ల దండయాత్రల ఫలితంగా ‘మాలా ద్వీపాలు’ అఖండ భారత్‌కు దూరమయ్యాయి. సింహళ, ‘్ధనేహీ’ భాషలు సంస్కృత భాషా రూపాంతాలు! మాల్‌దీవుల ప్రజల భాష ‘్ధనేహీ’!నేటి ఆఫ్ఘనిస్తాన్ గాంధార, యోన, రామఠ, జ్యోతిష, దరద, ఉరగ వంటి అనేక ప్రాచీన భారతీయ రాజ్యాల సమూహం! జిహాదీల దాడుల ఫలితంగా ఈ మొత్తం ప్రాంతం ‘అఖండ భారత్’ నుండి విడిపోయింది. యావత్ భారతదేశాన్ని ఆంగ్లేయులు దురాక్రమించినప్పటికీ చివరివరకూ అంటే 1947లో ఆంగ్లేయులు నిష్క్రమించేవరకూ స్వతంత్రంగా మనగలిగిన భారత ప్రాంతాలు నేపాల్, భూటాన్!!
ఇలా ‘అఖండ భారతం’ ప్రస్తుత భారత్, బంగ్లా, బర్మా, సింహళ, మాలాద్వీప, పాకిస్తాన్, ఆఫ్ఘన్, నేపాల్, భూటాన్, త్రివిష్టప- టిబెట్ దేశాల సమాహారం! ఇదీ అనాది వాస్తవం!!
హెబ్బార్ నాగేశ్వరరావు31/12/2015
More Stories
గాజుల లక్ష్మీ నరసు చెట్టి పుస్తకావిష్కరణకు వేదిక సిద్ధం
సమాజంలో జాతీయవాద జర్నలిజం.. పాత్రికేయులకు నారదుడు ఆదర్శం
నారద జయంతి 2024: జాతీయవాదులు పూర్తిగా సంఘటితం కావాలి