Inspiration

మాధవరం:  ఇంటికో వ్యక్తి ఆర్మీలో ఉన్న అరుదయిన ఆంధ్రా కుగ్రామం

Posted
FacebookTwitter

 “పోరాడేవాడికి తెలిసినంతగా జీవితపు రుచి పోషింపబడేవాడికి తెలియదు”

యుద్ధ స్మారకంగా వీరుడి హెల్మెట్, రైఫిల్ ఉండటం మాధవరం గ్రామానికి ఉన్న ఒక ప్రత్యేకత. అమరావతికి 150 కి.మీ. దూరంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ గ్రామం 300 సంవత్సరాల నుండి తమ గ్రామం నుండి వ్యక్తులను ఆర్మీలో పనిచేయటానికి పంపుతోంది.

దాదాపుగా అన్ని కుటుంబాలలోను కనీసం ఒక వ్యక్తి ఇండియన్ ఆర్మీ కి సేవ చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. కొన్ని యిళ్ళలో ముగ్గురు నలుగురు కూడా ఉన్నారు. ప్రస్తుతం 109 మంది వ్యక్తులు (65 మంది యుద్ధ రంగంలో మిగతావారు పరిపాలనా విభాగంలో) ఈ ఊరి నుండి ఇండియన్ ఆర్మీకి సేవలు అందిస్తున్నారు.

మాధవరంలో గాలి కూడా యుద్ధం, ధైర్యం, తెగువ వంటి కథల చుట్టూ తిరుగుతువుంటుంది. వందకు పైగా కుటుంబాలు యుద్ధంలో తమవాళ్లు గెలిచిన వీర పతకాలను ప్రదర్శిస్తుంటాయి. పదవీవిరమణ చేసిన వారుకూడా యుద్ధంలో తమ హోదాని ముందు చేర్చి పిలవడాన్నే ఇష్టపడతారు. ఇక్కడి మహిళలు మిలటరీవాల్ల్ని పెళ్లిచేసుకోవడానికే ఇష్టపడతారు. కల్నల్, మేజర్, కెప్టెన్ అని పిల్లలకి పేర్లు కూడా పెడుతుంటారు.

మాధవరం మిలిటరీ చరిత్ర అక్కడివారందరికీ గర్వకారణం. 17వ శతాబ్దంలో గజపతివంశం వాడయినా పూసపాటి మాధవవర్మ బ్రహ్మ నుండి ఈ వారసత్వం వచ్చింది. ఆయన ప్రస్తుత ఒరిస్సా దక్కన్ భూములకు చెందిన రాజు. మాధవరానికి 6 కి.మీ. దూరంలో ఉన్న ఆరుగొల్లు అనే గ్రామంలో ఇప్పటికీ శిధిలావస్థలో ఉన్న రాజుగారికోట ఉన్నది.

రాజ్యం యొక్క యుద్ధ బలాన్ని పెంచడానికి ఒరిస్సా దక్షిణ ఆంధ్రల నుండి ప్రజలను, కుటుంబాలను ఇక్కడికి తీసుకువచ్చి డబ్బు,భూమి ఇచ్చి సైనికులుగా శిక్షణ ఇచ్చేవారు. బొబ్బలి, పిఠాపురం, పల్నాడు, వరంగల్ మరియు కాకతీయ యుద్ధాలలో వీరు పాల్గొన్నారు.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 90 మంది సైనికులు ఈ గ్రామం నుండి బ్రిటిష్ రాజ్యం తరపున పోరాడారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ సంఖ్య 1110 కి పెరిగింది.

ఇక్కడి స్థానికులు ఈ ఊరి నుండి వెళ్లి యుద్ధంలో గొప్ప బిరుదు పొందినవారిని ఎంతో గౌరవిస్తారు.శ్రీ సుబేదార్ వేంపల్లి వెంకటాచలం, ఈయనకు రావు బహద్దూర్, పల్లకి సుబేదార్, ఘోడా సుబేదార్,బిరుదులతోబాటు విక్టోరియా క్రాస్ మెడల్ అనే అత్యున్నత  పురస్కారం కూడా ఇవ్వబడింది.

వీరి కుటుంబం గ్రామం యొక్క మిలిటరీ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. వీరి అబ్బాయి శ్రీ మార్కండేయులు. 1962 ఇండో చైనా యుద్ధం, 1965  ఇండో పాక్ యుద్ధం, 1971 బాంగ్లాదేశ్ విమోచనలోను పాల్గొన్నారు. మనవడు శ్రీ సుబ్బారావు నాయుడు, ఇటీవలే ఇండియన్ ఆర్మ్  నుండి హవల్దారుగా పదవీవిరమణ చేసారు . మరో మనవడు శ్రీ మానస్ ఇప్పటికే మిలిటరీ సర్వీసెస్ లో ఎంపికై చేరడానికి సిద్ధంగా ఉన్నాడు.

శ్రీ మార్కండేయులుగారి మాటల్లో, “దేశానికీ సేవ చేయడం మా రక్తంలోనే ఉంది. మేము దానిని కొనసాగిస్తూనే ఉంటాం”.

మాధవరం సైనికులు స్వతంత్ర భారతం సాగించిన ప్రతి యుద్ధంలోనూ ఒక భాగమై ఉన్నారు. ఇప్పటికీ 250 మంది సైనికులు మాధవరం నుండి దేశ సరిహద్దు రక్షణలో ఉన్నారు.

తమ ఊరివారి త్యాగాలకు, సేవలకు గుర్తుగా మాధవరం ప్రజలు, ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతిలాంటి యుద్ధ స్మారక చిహ్నాన్ని ఇక్కడ నిర్మించారు.

తరాల తరబడి సాయుధ దళాలలో చేరడం అనేది ఇక్కడి యువతకు ప్రధాన ప్రాధాన్యతగా ఉంటోంది. ఇటవల భారత విమానయాన సంస్థ స్త్రీలను కూడా యుద్ధవిమానాల్లో అనుమతిస్తుందనే వార్తతో ఇక్కడి యువతులు కూడా తమసేవలు అందించడానికి ఎదురుచూస్తున్నారు

ఈ గ్రామానికి చెందిన శ్రీ నాగ విజయ మోహన్ ఇటీవల టెర్రరిస్ట్ దాడి జరిగిన “ఉరి” కి 15 కి మీ. దూరంలో విధులలో ఉన్నాడు. మాజి సైనికుడైన అతని తండ్రి టైమ్స్ అఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ” మా అబ్బాయికి ఎలాంటి ప్రమాదం సంభవించినా మేము వాడు మాతృదేశం కోసం ప్రాణత్యాగం చేసాడనే భావిస్తాము.” అతని తల్లి కూడా గర్వంతో కూడిన ధృడ స్వరంలో మాట్లాడుతూ, “నేను వాడితో చివరిసారి మాట్లాడినప్పుడు ధైర్యంగా ఉండాలని, యుద్ధరంగంలో ఉన్నందుకు గర్వంగా ఉండాలని చెప్పాను. తరువాత వాళ్ళ మొబైల్ ఫోన్లన్నీ అధికారులకు అప్పగించేశారు.”

ఈ గ్రామం మొదట్లో కొలువై ఉన్న పోలేరమ్మ గుడిని ఈ గ్రామస్తులు ఎంతో పవిత్రంగా  భావిస్తారు.  ఈ అమ్మ దీవెనలవల్లే యుద్ధరంగంలో ఉన్న తమ వారంతా క్షేమంగా ఉంటారని వారి విశ్వాసం.

మాధవరంలో 1180 సభ్యులతో కూడిన మాజి సైనికుల సంఘం ఉంది. వీరిలో చాలామంది చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కొందరు వ్యవసాయంలోను, మరికొందరు ప్రైవేట్ సెక్యురిటి  గార్డ్స గాను పనిచేస్తున్నారు. అయితే ఇప్పటికీ అందరు మిలటరీకి అవసారమైన వస్తువులు పంపడంలోనూ, కావలసిన సహాయం చేయడంలోనూ ముందుంటారు. వాళ్ళ ఉద్దేశ్యంలో వాళ్ళు ఆర్మీ నుండి భౌతికంగా పదవీ విరమణ చేసినా, ఎప్పటికీ దేశసేవకులే.

మాధవరం మిలిటరీ సంప్రదాయం, ప్రజల సేవలు చక్కని గుర్తింపు పొందాయి. దేశ రక్షణ మంత్రిత్వ శాఖవారు ఈ గ్రామాన్ని, సేవలను గుర్తించి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నది. రక్షణమంత్రి త్వరలో ఇక్కడ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కి శంఖుస్థాపన చేయనున్నారు.

BDL (Bharath Dynamics Limited) ఆధ్వర్యంలో అన్ని వసతులు కలిగిన డిఫెన్స్ అకాడమీ త్వరలో ఇక్కడి యువతకు అందుబాటులోకి రానున్నది. మిలటరీలోకి వెళ్లడమే పెద్ద గౌరవంగా భావిచే ఈ ఊరి ప్రజల కోరికపై త్వరలోనే ఈ ఊరు అధికారికంగా “మిలిటరీ మాధవరం” గా ప్రకటించబడనున్నది.

ఈ గ్రామ చరిత్రకు అబ్బురపడిన దర్శకుడు “క్రిష్” జాగర్లమూడి, ఈ ఊరి చరిత్ర ఆధారంగా “కంచె” అనే చిత్రాన్ని నిర్మించి జాతీయ అవార్డును సాధించారు.

ఈ గ్రామానికి చెందిన శ్రీ ఉఱిక సీతారామయ్య, మాజి సైనికోద్యోగి గారి కుమార్తె, శ్రీ రమణ ఈ గ్రామ విశేషాలతో ఒక డాక్యుమెంటరీ నిర్మించారు.

FacebookTwitter