Press releaseSeminar

ఉపేక్షితులు, పేదల సంరక్షణే -దీన్ దయాళ్ జీ తత్వానికి మూలం

Posted
FacebookTwitter

 

70 ఏళ్లుగా దీన్ దయాళ్ జీ ఆలోచనలు, తత్వాన్ని ఈ దేశం పట్టించుకోలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక సిద్దాంతం నుండి మరొక సిద్దాంతానికి ఊగిసలాడుతూనే ఉన్నాం కానీ మన నాగరకత విలువల ఆధారంగా ఆలోచించలేకపోయాం. మొదట రష్యా సోషలిస్ట్ నమూనావైపు ఆకర్షితులమై ఆ తరువాత పాశ్చాత్య పెట్టుబడిదారీ విధానాన్ని కూడా కలగలిపి గందరగోళమైన `మిశ్రమ ఆర్థిక వ్యవస్థ’ ను రూపొందించుకున్నాం. కానీ మన ధార్మిక సంప్రదాయపు విలువలపై ఆధారపడిన ఏకాత్మ మానవ దర్శనాన్ని ఇప్పటికైనా పరిశీలించాలి’’ అని ప్రసారభారతి ఛైర్మన్ శ్రీ. ఎ . సూర్యప్రకాష్ అన్నారు. సమాచారభారతి, సంస్కృతిక సంస్థ, చేతన సంయుక్తంగా హైదారాబాద్ కొండపూర్ లో (26.8.2017) ఏర్పాటుచేసిన “ఏకాత్మ మానవవాదం – ప్రపంచానికి దిశా నిర్దేశం” అనే సెమినార్ లో ఆయన మాట్లాడారు.
పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ సెమినార్ లో ప్రధానోపన్యాసం చేసిన శ్రీ సూర్యప్రకాశ్ `మాతృ భూమి’ భావనలో నమ్మకం లేనివారు దేశ సమైక్యత, సమగ్రతలకు ప్రమాదకారులని అన్నారు.
ప్రతిఒక్కరు తమ తిండి తామే సంపాదించుకోవాలన్నది పాశ్చాత్య భావన అని, కానీ పిల్లలు, వృద్దులు, చేతకానివారిని సమాజమే పోషించాలని, మనిషి కేవలం ఆహార సంపాదన కోసమే పనిచేయకూడదని, సామాజిక బాధ్యతలు, విధులు నెరవేర్చడానికి పనిచేయాలని 1967లోనే దీన్ దయాళ్ జీ ప్రబోధించారని సూర్యప్రకాశ్ గుర్తుచేశారు.
కమ్యూనిస్టులు, సోషలిస్ట్ లకు `సమగ్ర మానవుడు’ అనే భావన అర్ధం కాదు. మనకి అటు సామ్యవాదం కానీ ఇటు పెట్టుబడిదారీ వాదం అవసరం లేదు. సమగ్ర మానవుని ఆనందమే మనం కోరుకుంటామని సూర్యప్రకాశ్ అన్నారు.
సమాజంలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం ఆ సమాజపు కనీస బాధ్యత. అందుకు రుసుము వసూలుచేయడం మన సాంప్రదాయంలో ఎప్పుడూలేదు. స్వాతంత్ర్యానికి ముందు ఏ రాజ్యంలోను విద్యకు రుసుము వసూలు చేయడం అనే పద్దతి లేనేలేదు. ప్రభుత్వమే ఉచితంగా వైద్య సదుపాయాన్ని కలిగించేది. ఇలా ఒక వ్యక్తి విద్యా, వైద్యం కోసం రుసుము చెల్లించాల్సి వస్తే అది ధార్మిక రాజ్యం కానేకాదు. పనిచేయగలిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి చూపించడం ప్రభుత్వ బాధ్యత. ప్రధాని నరేంద్ర మోడి ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన, స్కిల్ ఇండియా, పంట బీమా, బేటీ బచావో – బేటీ పడావో వంటి పధకాల వెనుక దీన్ దయాళ్ జీ ఆలోచనల ప్రభావం కనిపిస్తుంది. జన్ ధన్ యోజన కింద 25 కోట్ల బ్యాంక్ అక్కౌంట్ లు తెరిచారు. ప్రపంచంలో ఇటువంటి అద్భుతమైన కార్యం ఎక్కడ జరగలేదు. అలాగే ప్రభుత్వం పని హక్కును కూడా కల్పించే ప్రయత్నంలో ఉంది. ఇటువంటి దార్శనికుడిని కేవలం ఒక పార్టీకి చెందినవాడని, ఒక సిద్దాంతానికి పరిమితమైనవాడని అనడం అన్యాయం కాదా?
దీన్ దయాళ్ జీ ది ఒక సమగ్రమైన ఆలోచన ధోరణి. ఇటువంటి ధోరణిని జాతి గుర్తించకుండా నెహ్రూవాదులు, మార్క్సిస్ట్ లు చూశారు. గాంధీ, నెహ్రూ, మార్క్స్ ల గురించి మన పాఠశాలల్లో చెపుతున్నారు. ఇకనుండి దీన్ దయాళ్ జీ గురించి కూడా మన పిల్లలకు బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన పార్లమెంట్ సభ్యుడు కాకపోయిన వందలాది ఎం పి లను తయారుచేయగల ఆలోచన కలిగినవారు.
చారిత్రక తప్పిదాన్ని సరిచేసుకుని ఆయనకు సరైన స్థానాన్ని కల్పించడం మన కర్తవ్యం. అటల్జీ చెప్పినట్లుగా “రాజకీయాలు ఆయనకు సాధనం మాత్రమే. లక్ష్యం కాదు. ఆయన వైభవోపేతమైన గతాన్ని ఎప్పుడు మరచిపోలేదు. అలాగే రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పుడు వెనుకడుగు వేయలేదు.’’ “ఆయన నిరాడంబరత్వమే నాకు ఎప్పుడు గుర్తుకువస్తుంటుంది. పార్టీని సరిగా నడిపే కార్యకర్తలను తయారుచేయడం పైనే ఆయన దృష్టి పెట్టారు. కార్యకర్తలు పార్టీని నడిపితే పార్టీ దేశపు బాగోగులను చూస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోడి అంటారని సూర్యప్రకాశ్ అన్నారు.
కార్యక్రమ ముఖ్య అతిథిగా విచ్చేసిన ISB అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీ. సుబ్రమణీయన్ కృష్ణ మూర్తి మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ బలాబలాలను కేవలం GDP లో కొలవలేమని, ప్రజల బాగోగులను పట్టించుకునే వ్యవస్థను రూపొందించుకోవాలని అన్నారు. దేశీయ ఆలోచనలు, విధానాలు విలసిల్లే వాతావరణాన్ని ఏర్పర్చుకోగలగాలని, అందుకు పరిశోధన జరగాలని అన్నారు.
కార్యక్రమంలో 200 మందికి పైగా సమాజంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

FacebookTwitter