కాకతీయ లఘు చిత్రోత్సవం – బహుమతి ప్రదానం -Dec 17th, 2016

Posted Posted in Film Festival, News

పత్రిక ప్రకటన

కాకతీయ లఘు చిత్రోత్సవం – బహుమతి ప్రదానం
…………………………………………………..

సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన ‘కాకతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’కు దేశం నలుమూలల నుండి విశేష స్పందన లభించింది. పలువురు సినీ ప్రముఖులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంపిక చేసిన కొన్ని చిత్రాలను ఈ నెల 17వ తేదీ, మ. 2.30 ని.లకు శనివారం (రేపు) హైదరాబాద్, అమీర్ పేటలోని సారధి స్టూడియోలో ప్రదర్శించబోతున్నాం.

బహుమతి ప్రదానోత్సవం
ఆ తదనంతరం సా. 4.00 గం.లకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది.

ప్రముఖ దర్శక నిర్మాతలు శ్రీ అల్లాణి శ్రీధర్, ‘మధుర’ శ్రీధర్, రాజ్ కందుకూరి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమానికి మీ రిపోర్టర్ ను, ఫోటోగ్రాఫర్ / వీడియోగ్రాఫర్ ను పంపవలసిందిగా మనవి.
ఆయుష్ నడింపల్లి
కార్యదర్శి
సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్

9848038857

తెలంగాణ లో ప్రారంభమైన ‘బోనాలు’ పండుగ

Posted Posted in Articles

  Telangana-Festivals

ఆషాడమాసంలో గ్రామ దేవతలను పూజించే సాంప్రదాయం గ్రామ ప్రజల మధ్య విస్తృతంగా కనబడుతుంది.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలలోను మరియు తెలంగాణా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోను నివసించే హిందువుల అతిపెద్ద పండుగ ‘బోనాలు’ పండుగ.

ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర ప్రజలు అతిగొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని ‘ఆషాఢంజాతర’ అని కూడా అంటారు. వర్షాలు మొదలయ్యే సమయంలో జంటనగరాలలో మాత్రమే కాకుండా తెలంగాణాలోని ఇతర ప్రాంతాలలోను ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రదేశంలో బోనాల జాతర జరుపబడుతుంది. ఇది అమ్మవారికి ప్రజలు తమ మొక్కును చెల్లించుకునే తరుణం. 1869లో జంట నగరాలలో ప్లేగువ్యాధి వ్యాపించినప్పుడు, గ్రామ ప్రజలు దైవ ఆగ్రహానికి గురి అయ్యాము అని తలచి భయభక్తుతో అమ్మవారిని శాంతిపచేయడానికి ఈ పండుగను ప్రారంభించినట్లు తెలుస్తోంది. గ్రామదేవతలు ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకామ్మ, మారమ్మ, మహాంకాళి మొదలైన పలుపేర్లతో కొలవబడుతున్నారు.

‘బోనాలు’ అంటే ‘భోజనాలు’ అని అర్థం. ఆలయాలలో దేవుళ్ళకు మనం సమర్పించే నైవేద్యమే బోనాలు.

ఈ ఉత్సవం ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళీ దేవాలయంలో ప్రారంభమై, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, హైదరాబాద్‌ పాతబస్తీలోని ‘షాలిబండ’లో కొలువై ఉన్న అక్కన-మాదన్న మహంకాళీ దేవాయం, ‘లాల్‌దర్వాజ’ లోని మహాంకాళీ అమ్మవారి దేవాలయం`మొదలైన పలు ప్రధాన దేవాలయాలలో వరుసగా కనుల పండుగగా జరుగుతుంది.

అక్కన్న`మాదన్న మహంకాళీ దేవాలయం, గోల్కొండను పాలించిన తానీషా కాలములో అక్కన్న-మాదన్న అనబడే సోదరుల వల్ల కట్టబడింది. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ ఆలయం 1815లో కట్టబడింది.

బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో సుమారు పదహారు రోజులు జరుపబడుతుంది.

ఈ ఏడాది బోనాల ఉత్సవం హైదరాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో జూలై పది నుండి జూలై ముప్పైదాకా జరుపబడుతుంది. ఇది తెలంగాణా ప్రజల అసలైన తెలుగు పండుగ. ఆషాఢమాసంలో వచ్చే ఆదివారాలో తెలంగాణా ఆలయాలలో బోనాలు జరుపుతారు. జంటనగరాల ప్రజలు మాత్రమే కాకుండా ప్రక్కన ఉన్న తెలంగాణా ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది ఈ ఉత్సవంలో పాల్గొంటారు. వేరు వేరు ప్రాంతాలనుండి వచ్చేవారు రకరకాలైన ఉయ్యాలలను తయారుచేసి తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు.

బోనాల పండుగఘటం, బోనాలు, వేపాకు సమర్పించుట, ఫలహారంబండి, పోతురాజు విన్యాసం, రంగం, బలి, సాగనంపుట అని ఎనిమిది అంగాలతో కూడినది.

tumblr_m7k3xzfQSo1qlobzqo1_1280

  1. ఘటోత్సవం: ప్రత్యేకమైన కలశంలో అమ్మవారిని ఆవాహనచేసి, నగరవీధులగుండా ఉరేగింపుగా తీసుకెళతారు. బోనాల ఉత్సవం ప్రారంభించిన మొదటి రోజునుండి పదునాల్గవ రోజుదాకా ప్రతిరోజు ప్రొద్దున, సాయంకాలం అమ్మవారు కలశంలో సూక్ష్మరూపంగా ఆసీనురాలై, నగర, గ్రామ వీధులో ఊరేగి, భక్తుల పూజలను స్వీకరిస్తుంది. ‘ఘటం’ అంటే ‘కలశం’. అమ్మవారి రూపం కలశం మీద గీయబడుతుంది. ఆ ఘటం అమ్మవారిలాగే అలంకరించబడుతుంది. ఆలయ పూజారి శరీరమంతా పసుపు పూసుకుని ఘటాన్ని మోసుకెళతాడు.
  2. బోనాలు: శక్తి స్వరూపిణియైన మహంకాళికి భక్తితో సమర్పించే అన్నమే ‘బోనాలు’. ఎవరివారు ఏఏ రకంగా వండి నైవేద్యం పెడతామని మ్రొక్కుకున్నారో, ఆవిధంగా వండి సమర్పించి తమ కృతజ్ఞతను తెలుపుకోవటం ఆచారంగా ఉన్నది. చక్కెరపొంగలి, బెల్లపు పొంగలి, కట్టెపొంగలి, పసుపుఅన్నం, అని పలురకాలుగా బోనాలు అన్నం ఉంటుంది.ఆషాఢ జాతరలో పదిహేనవరోజు, స్త్రీలు తమ ఇళ్ళను కడిగి శుభ్రపరచి, తలంటుకుని సాన్నంచేసి, శుభ్రమైన కొత్తబట్టలు ధరించి, వ్రతం ఆచరించి నైవేద్యం తయారు చేస్తారు. చక్కగా అలంకరించిన ఒకపాత్రలో అన్నాన్ని ఉంచి, వేపాకులతో చుట్టూకట్టి, దానిమీద మూతపెట్టి, మూతమీద పవిత్రంగా దీపం వెలిగించి, తలమీద పెట్టుకునివచ్చి లక్షలాది మంది ఆడవారు వరుసగా అమ్మవారికి భక్తితో బోనం సమర్పించి తమ మ్రొక్కులను తీర్చుకుంటారు. ఆ రోజు ఆడవారు ముఖంనిండా పసుపు రాసుకుని తడిబట్టలతో రావడం పురాతన ఆచారం. మహిళలు బోనాలను నెత్తిమీద పెట్టుకుని, భేరీ, తప్పెట, కొమ్ము వాద్యాలు మ్రోగుతుండగా ఊరేగింపుగా రావడాన్ని చూడటానికి రెండుకన్నులు సరిపోవు. దీనికంటూ ప్రభుత్వం ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే ప్రణాళికగా అమలు పరుస్తుంది.
  1. వేపాకు సమర్పించుట: వేపాకులను పసుపునీటిలో ముంచి అమ్మవారికి సమర్పించే ఆచారం ముఖ్యమైన క్రియగా భావించబడుతుంది. వర్షాకాలం ప్రారంభమయినప్పుడు సోకే కలరా, మశూచివంటి వ్యాధులను తరిమికొట్టే క్రిమినాశినిగా వేపాకు ఉండటం వల్లనూ, అమ్మవారికి ప్రియమైన వృక్షంగా ఉండటం వల్లనూ వేపాకులను అమ్మవారికి సమర్పించి ఆనందిస్తారు స్త్రీలు.
  2. ఫలహారంబండి: ‘బోనాలు’ జరుపుకునేరోజు భక్తులు తమ ఇళ్ళల్లోనుండి శుభ్రంగా, నియమనిష్ఠలతో తయారుచేసి తెచ్చిన నైవేద్యాలను బండ్లలోపెట్టి ఆలయానికి ప్రదక్షిణం చేయటాన్నే ‘ఫలహారంబండి’ అనే ఉత్సవంగా జరుపుకుంటారు.
  3. పోతురాజు వీరంగం: అమ్మవారి సోదరుడుగా పోతురాజును భావిస్తారు. బోనాలు పండుగ పదిహేనవరోజు తెలంగాణా ప్రాంతంలోని ప్రతి బస్తీనించీ పోతురాజు అమ్మవారి ఆలయానికి లక్షల సంఖ్యలో వీరధీర విన్యాసాలు ప్రదర్శిస్తూ వరదగా తరలివస్తారు. వీరు కాళ్ళకి గజ్జలుకట్టి, ఒళ్ళంతా పసుపు పూసుకుని, పసుపు నీటిలో తడిపిన ఎరుపు వస్త్రం ధరించి, కంటికి కాటుక, నుదుటి మీద కుంకుమ బొట్టుతో, నడుముకు వేపాకులు కట్టి, చేతిలో పసుపు రంగు కొరడా ఝుళిపించి నాట్యంచేస్తూ ఫలహారం బండికి ముందుగా నడచి వెళ్ళడం బోనాలు పండుగయొక్క విశేష ఆకర్షణీయ అంశం.
  4. రంగం: ఇది చివరి రోజున జరిగే ముఖ్యఘట్టం. బోనాలు నైవేద్యం ఆదివారం జరుగుతుంది. సోమవారం త్లెవారుఝామున అమ్మవారి సన్నిధికి ఎదురుగా ముఖమంటపంలో ఉన్న మాతంగీశ్వరి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా వివాహంకాని ఒక స్త్రీ వచ్చి ఒకమట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీనినే ‘రంగం’ అంటారు. దేశ రాజకీయం, వ్యవసాయం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు అన్నిటినీ ఆ రోజు అమ్మవారు ఆ స్త్రీల ద్వారా తెలుపుతుంది. ‘రంగం’పలికే ఆ స్త్రీ, ఒక కత్తికి మాంగ్యం కట్టి, తన జీవితాంతం వివాహం చేసుకోకుండానే ఉండటం ఆనవాయితీ.
  5. బలి: రంగం ముగిశాక సోమవారం పోతురాజులు ప్రొద్దున తొమ్మిది గంటల ప్రాంతంలో వీర తాండవం చేస్తూ మైమరచి భక్తి పారవశ్యంతో ఆలయ ప్రదక్షిణం చేస్తారు. అమ్మవారి సన్నిధికి ఎదురుగా వారు ఆడే నృత్యం, మనను భక్తిపారవశ్యంలో ముంచుతుంది. ఆ సందర్భంలో సొరకాయ, ఎర్ర గుమ్మడికాయవంటి కూరగాయల్ని పగుల గొట్టి అమ్మవారికి బలి ఇస్తారు. ఇది వరకు ఎద్దు, మేక, కోళ్లను బలిఇచ్చే వారట. ఇప్పుడు మృగబలి నిషేధం కాబట్టి కూరగాయలను పగులగొట్టి పండుగను పూర్తిచేస్తున్నారు.
  6. సాగనంపుట: బలిఇచ్చే కార్యక్రమం పూర్తిఅయ్యాక, సోమవారం ప్రొద్దున పదిగంటల సమయంలో అమ్మవారి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించి కలశాలతోపాటు ఏనుగుమీద ఎక్కించి, మంగళ వాద్యాల ధ్వనులమధ్య వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్ళి భక్తులు అమ్మవారిని సాగనంపుతారు.చివరిగా ‘ఘటాన్ని’ నయాపూల్‌ ప్రాంతంలో ప్రవహించే మూసీనదిలో నిమజ్జనం చేసి, పండుగను పూర్తి చేస్తారు.

శ్రీమతి రాజీరఘునాథన్‌

ఋషిపీఠం సౌజన్యంతో…

విస్తరిస్తున్న విష’వల’యం

Posted Posted in Articles

సాధారణ ప్రజలు సందేశాలు పంపడానికి, సంభాషించడానికి, మల్టీమీడియా వాడకానికి ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్‌లను వాడతారు. ఉగ్రవాదులు తమ సందేశాలను నిగూఢంగా (ఎన్‌క్రిప్షన్‌) పంపడానికి ష్యూర్‌స్పాట్‌, టెలెగ్రామ్‌ వంటి మెసేజింగ్‌ యాప్స్‌ అమర్చిన స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు. తమ సభ్యులు గుప్త వ్యవహారాలు నిర్వహించడానికి వీలుగా ఐసిస్‌ మార్గదర్శక నియమావళిని విడుదల చేసింది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల వినియోగం, పాస్‌వర్డ్‌లు, యాప్‌ల డౌన్‌లోడ్‌కు తీసుకోవలసిన జాగ్రత్తలు అందులో ఉన్నాయి. వాట్సాప్‌, టెలెగ్రామ్‌, జెలో వంటి ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ సర్వీసుల వినియోగంలో ఐసిస్‌ దళాలు ఆరితేరాయి. ఈ కార్యకలాపాలను ఐసిస్‌ హ్యాకర్‌ విభాగమైన సైబర్‌ ఖిలాఫత్‌ పకడ్బందీగా నిర్వహిస్తోంది.

పారిస్‌, బ్రసెల్స్‌, ఓర్లాండో, ఇస్తాంబుల్‌, ఢాకా, బాగ్దాద్‌… ఈ నగరాలలో ఇస్లామిక్‌ ఉగ్రవాదుల కాల్పులు, పేలుళ్లు, వూచకోతలు ప్రపంచాన్ని కుదిపేశాయి. బాగ్దాద్‌ మినహా ఇతరచోట్ల ఘాతుకాలకు పాల్పడినది పశ్చిమాసియా నుంచి దిగివచ్చిన ఉగ్రవాదులు కారు – స్థానిక ముస్లిం యువకులే. ఖలీఫా రాజ్య స్థాపనకు ఐ.ఎస్‌.ఐ.ఎస్‌ (ఐసిస్‌) వాస్తవ లోకంలోనే కాక సైబర్‌ సీమలోనూ జిహాద్‌ మొదలుపెట్టింది. వివిధ దేశాల ముస్లిం యువతను ఆకర్షించి, దాడులకు పురమాయించడానికి ఇంటర్నెట్‌నూ, సోషల్‌మీడియానూ ఉపయోగించుకుంటోంది. సిరియాలోని ఐసిస్‌ నాయకత్వంతో హైదరాబాదీ యువకులు సోషల్‌మీడియా, టెలిఫోన్‌లలో జరిపిన సంభాషణలపై నిఘావేయడం ద్వారానే భాగ్యనగరంలో మారణహోమాన్ని నివారించగలిగారు. ఇరాక్‌, సిరియాలలో భూతలయుద్ధంలో చావుదెబ్బ తింటున్న ఐసిస్‌ సైబర్‌ సీమలో కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. 2014లో ఇరాక్‌లో మూడోవంతు భూభాగాన్ని గుప్పిట్లోకి తెచ్చుకున్న ఐసిస్‌ నేడు 14 శాతం భూభాగానికే పరిమితమైపోయింది. అందుకే ‘మీరు ఇరాక్‌, సిరియాలకు వచ్చి మాతో భుజం కలిపి పోరాడటంకన్నా శత్రుభూమిలో ఉండి ఏ చిన్న దాడి జరిపినా మన పోరాటానికి ఎంతో ఎక్కువ మేలు జరుగుతుంది’ అని ఐసిస్‌ అధికార ప్రతినిధి అబూ మహమ్మద్‌ అల్‌అద్నానీ ఇటీవల ప్రకటించారు. అతని పిలుపు ప్రకారమే ఇస్లామిక్‌ ఉగ్రవాదులు అమెరికా, ఐరోపా, ఆసియాలలో చెలరేగిపోతున్నారు. అంతర్జాలం ఆవిర్భావానికి ముందు తమ భావజాలాన్ని గుట్టుగా ప్రచారం చేసుకున్న ఉగ్రవాదులు, నేడు సోషల్‌మీడియాను విరివిగా ఉపయోగించుకుంటున్నారు.

దాదాపు అందరి చేతిలో అంతర్జాలంతో అనుసంధానమైన స్మార్ట్‌ఫోన్‌ ఉండటం ఐసిస్‌కు కలసివచ్చింది. చరిత్రలో మునుపెన్నడూ ఉగ్రవాదులకు ఇంతటి ప్రచార సౌలభ్యం ఉండేది కాదు. ఐసిస్‌ డిజిటల్‌ ప్రచారంతో ప్రభావితులైన 30,000 మంది ముస్లిం యువకులు వివిధ దేశాల నుంచి తరలివచ్చి సిరియా, ఇరాక్‌లలోని జిహాదీ సేనలో చేరిపోయారు. అక్కడ గట్టి ఎదురుదెబ్బలు తింటున్న ఐసిస్‌, ఇక నుంచి ఎక్కడివారు అక్కడే ఉండి రక్తపాతం సృష్టించాలని సామాజిక మాధ్యమాల్లో నూరిపోస్తోంది.

‘బ్రాండ్‌’గా మారిన తీరు
ఖాతాదారులను ఆకర్షించడానికి బడా కంపెనీలు, సమాచార సాధనాలు, మార్కెటింగ్‌ సంస్థలు అంతర్జాలంలో ప్రయోగించే చిట్కాలనే ఐసిస్‌ కూడా పాటిస్తూ వర్చువల్‌ ఖలీఫా రాజ్యంగా రూపాంతరం చెందుతోంది. కంపెనీలు ఆకర్షణీయ వాణిజ్య ప్రకటనలనూ, రకరకాల సందేశాలను పోస్ట్‌ చేసినట్లే, ఐసిస్‌ కూడా రోజుకు 38 కొత్త అంశాలను అంతర్జాలంలో విడుదల చేస్తోంది. వీటిలో 20 నిమిషాల వీడియోలు మొదలుకొని పూర్తి నిడివి డాక్యుమెంటరీలు, ఛాయాచిత్ర వార్తా కథనాలు, ఆడియోక్లిప్పులు, పలు ప్రపంచ భాషలలో కరపత్రాలు ఉంటాయి. వీటితోపాటు ఐఎస్‌ పోరాటాల వీడియోలను దాని మీడియా విభాగమైన అల్‌ పుర్కాన్‌ సైబర్‌ సీమలోకి వదులుతోంది. 2014 మే నెలలో విడుదలైన ఒక వీడియో ఇరాకీ పోలీసులను ఐసిస్‌ మృత్యు దళాలు వేటాడి చంపుతున్న దృశ్యాలను చూపింది. కొందరు ఇరాకీ పోలీసులు ప్రాణాలకోసం వేడుకోవడం అందులో కనిపించింది. స్మార్ట్‌ ఫోన్లలో, నెట్‌లో ఈ వీడియోలను చూసిన ఇరాకీ సైనికులు, పోలీసులు ఐసిస్‌ దళాలు వస్తున్నాయనగానే ఆయుధాలు అవతలపారేసి పరారైన ఉదంతాలున్నాయి. అయితే ఐసిస్‌ ప్రసారం చేస్తున్న వీడియోలలో చాలా కొద్దిభాగమే ఇంత కిరాతకంగా ఉంటాయి.

మిగతా వీడియోలలో ఐసిస్‌ ఆక్రమిత భూభాగంలో జరిగే నిర్మాణ కార్యక్రమాలను, ఆర్థికాభివృద్ధినీ చూపుతున్నారు. ఖలీఫా రాజ్యం కేవలం ఒక భావన కాదనీ, అది నిజంగానే సాకారమై విస్తరిస్తోందని దేశదేశాల్లోని ముస్లింలకు భరోసా ఇవ్వడం ఈ డిజిటల్‌ ప్రచార లక్ష్యం. తమ దేశాల్లో స్థితిగతులపై అసంతృప్తి చెందిన ముస్లిం యువకులు ఐసిస్‌లో చేరేలా ఈ ప్రచారం ప్రేరేపిస్తోంది. వారి ఆగ్రహావేశాల వ్యక్తీకరణకు ఐసిస్‌ సోషల్‌మీడియా వేదిక కల్పిస్తోంది. ఐసిస్‌ రకరకాల భాషల్లో ప్రచారం చేస్తున్నందువల్ల విధ్వంస మనస్కులు తమబోటివారితో గూడుపుఠాణీ చేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతోంది.

డార్క్‌వెబ్‌ ద్వారా ధ్వంసరచన
వివిధ దేశాల్లో దాడులు జరిపించడానికి ఐసిస్‌ డార్క్‌ వెబ్‌నూ వినియోగిస్తోంది. అందుకే పారిస్‌, బ్రస్సెల్స్‌ పోలీసులు ఈ దాడులను ముందుగానే పసిగట్టలేకపోయారు. సాధారణ ఇంటర్నెట్‌కన్నా వందలు, వేల రెట్ల సమాచారం డార్క్‌వెబ్‌లో ఉంటుంది. కానీ, ఈ గుప్త సమాచార యంత్రాంగం గూగుల్‌ సెర్చ్‌ వంటి సార్వత్రిక శోధన సాధనాలకు అందదు. టోర్‌ బ్రౌజర్‌వంటి సాధనాలను వాడవలసిందే. అంతర్జాలానికి వెలుపలి యంత్రాంగాల ద్వారా పనిచేసే డార్క్‌వెబ్‌ను ఉగ్రవాదులు, సంఘటిత నేరగాళ్ల ముఠాలు ఉపయోగిస్తుంటాయి. రహస్య సమాచార ప్రసారం, బిట్‌ కాయిన్‌వంటి నిగూఢ కరెన్సీలో విరాళాల సేకరణ, బిల్లుల చెల్లింపులు డార్క్‌ వెబ్‌లో జరుగుతున్నాయి. అంతేకాదు, మాదకద్రవ్యాలు, ఆయుధాలు, అశ్లీల వీడియోలు, కంప్యూటర్‌ మాల్‌వేర్‌ వంటి నిషిద్ధ వస్తువుల క్రయవిక్రయాలకు డార్క్‌వెబ్‌ రహస్య బజారుగా ఆవిర్భవించింది.

అమెరికా గూఢచారి సంస్థ (సీఐఏ), ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బిఐ)లు నిత్యం ఐసిస్‌ నాయకులు, కార్యకర్తల ఫోన్లు, ఐపీ చిరునామాలపై నిఘా వేస్తున్నాయి. వారి ప్రపంచవ్యాప్త సంభాషణలు, సందేశాలను ఆలకించడానికి అన్ని భాషల నిపుణులను నియోగించాయి. భారత ఉపఖండంలో ఐసిస్‌, దాని సానుభూతిపరుల కార్యకలాపాల గురించి భారత భద్రతాధికారులకు సీఐఏ ఎప్పటికప్పుడు ఉప్పందిస్తోంది. ఆ సమాచారమే ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా 20 మంది ఐసిస్‌ కార్యకర్తల అరెస్టుకు దారితీసింది. కానీ, ఇల్లలకగానే పండగ కాదని గుర్తుంచుకోవాలి. 16-30 ఏళ్ల భారతీయ ముస్లిం యువకులలో ఐసిస్‌పట్ల కుతూహలం పెరుగుతోందని గత ఏడాది ఒక ఇంటెలిజెన్స్‌ సంస్థ సర్వేలో తేలింది. ఈ యువకులు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, గూగుల్‌లలో చూస్తున్న అంశాలు, జరుపుతున్న కార్యకలాపాలనుబట్టి సదరు నిర్ధారణకు వచ్చింది. ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు వంటి ఐటీ నగరాలతోపాటు చింఛ్వాడ్‌, హౌడా, శ్రీనగర్‌, గువహటి వంటి చిన్న పట్టణాల్లోనూ ముస్లిం యువతీ యువకులు ఐసిస్‌ కార్యకలాపాలపట్ల ఆసక్తి చూపుతున్నారు. సోషల్‌ మీడియాలో ఐసిస్‌ సంబంధ కార్యకలాపాలు జరుగుతున్న రాష్ట్రాలలో మొదటి స్థానం జమ్మూకశ్మీర్‌దే. తదుపరి స్థానాలను అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బంగ ఆక్రమిస్తున్నాయి. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే ఐసిస్‌ను అంతర్జాలం, సోషల్‌మీడియాల నుంచి తరిమేయాలని గూగుల్‌ ఐడియాస్‌ విభాగ డైరెక్టర్‌ జారెడ్‌ కోహెన్‌ సూచించారు. అది పూర్తిస్థాయిలో సాధ్యపడుతుందా అంటే అనుమానమే. దీనికన్నా ఐసిస్‌ తన యంత్రాంగాలను తానే నమ్మలేని స్థితి కల్పించడం భేషని అమెరికా భావిస్తోంది. ఐసిస్‌ ఆన్‌లైన్‌ యంత్రాంగాన్ని ఓవర్‌లోడ్‌ చేసి స్తంభింపజేయాలనుకొంటున్నామని అమెరికా రక్షణ మంత్రి ఏష్టన్‌ కార్టర్‌ చెప్పారు. దీనివల్ల ఐసిస్‌ తన దళాలకు ఆదేశాలు జారీచేయడం, వారి నుంచి సమాచారం అందుకోవడం, జనాన్ని విధ్వంసకాండకు పురిగొల్పడం అసాధ్యమవుతుంది. ఇలా అంతర్జాలంలో ఐసిస్‌కు చెక్‌ పెట్టాలని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తమ సైన్యంలోని సైబర్‌ కమాండ్‌ను ఆదేశించారు. 5,000 మంది నిపుణులున్న ఈ విభాగం ఐసిస్‌ కమ్యూనికేషన్లను విచ్ఛిన్నం చేస్తుంది. దాని నెట్‌వర్క్‌లను స్తంభింపజేస్తుంది.

ఐసిస్‌ నెట్‌వర్క్‌లో గుప్త మాల్‌వేర్‌లను ప్రవేశపెట్టి దాని నాయకుల ఆన్‌లైన్‌ అలవాట్లను పసిగట్టడం, వారి సందేశాలను, ఆదేశాలను మార్చి ఉగ్రవాదులను తప్పుదోవ పట్టించి హతమార్చడం, ఎలక్ట్రానిక్‌ నగదు బదిలీని, చెల్లింపులను దారిమళ్లించడం వంటి ఎత్తుగడలతో ఐసిస్‌ను చావుదెబ్బ తీయడానికి అమెరికా సైబర్‌ సేన నడుంకట్టింది. దీనితోపాటు ఐసిస్‌ ఘాతుకాలను, ఇస్లాం సూత్రాల వక్రీకరణను సహించలేక బయటకువచ్చిన మాజీ ఉగ్రవాదుల సాక్ష్యాలకు ఆన్‌లైన్‌లో విస్తృత ప్రచారం కల్పించదలిచారు. ఐసిస్‌ ఖలీఫా రాజ్యాన్ని భూతల స్వర్గంగా ప్రచారం చేస్తోంది. కానీ, దాని అధీనంలోని భూమిలో ఎంతటి అకృత్యాలు జరుగుతున్నాయో బయటి ప్రపంచానికి ఆన్‌లైన్‌లో తెలియజెప్పాలి.

ఎదురుదాడి
ఐసిస్‌ అనుయాయుల ఆట కట్టించడానికి భారతదేశమూ సైబర్‌ సీమను ఉపయోగించుకుంటోంది. హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన అబ్దుల్‌ బాసిత్‌ బృందం కార్యకలాపాల గురించి ఆప్తమిత్రులకూ తెలియకపోయినా వారిని కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు పట్టేశాయంటే కారణం- ఆన్‌లైన్‌ నిఘాయే. 2011లో హ్యాకింగ్‌ టీమ్‌ అనే ఇటాలియన్‌ సంస్థ నుంచి ప్రత్యేక ఎలక్ట్రానిక్‌ నిఘా హార్డ్‌వేర్‌ను నగర పోలీసులు కొనుగోలు చేశారని వికీలీక్స్‌ తెలిపింది. బహుశా దీని సాయంతో ఐసిస్‌ సానుభూతిపరుల కుట్రను ఛేదించి ఉండవచ్చు. ఈ తరహా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టడానికి జాతీయ సైబర్‌ భద్రతా వ్యవస్థను ఏర్పరచాలి. అధిక జీతభత్యాలు, ఇతర సౌకర్యాలను ఇచ్చి మెరికల్లాంటి ఐటీ నిపుణులను సైబర్‌ సేనలోకి ఆకర్షించాలి. శత్రువుల డిజిటల్‌ నెట్‌వర్కులలోకి చొరబడి వాటిని తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడానికి, అవసరమైతే విచ్ఛిన్నం చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ (మాల్‌వేర్‌)ను రూపొందించాలి. షాపింగ్‌ మాల్స్‌, రద్దీగా ఉండే ఇతర ప్రాంతాల్లో నియోగిస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు, బీట్‌ కానిస్టేబుళ్లకు బాంబులను పసిగట్టడంలో, ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో శిక్షణ ఇవ్వాలి. జనసమ్మర్ద ప్రాంతాల్లో పహరాకు సాయుధ మాజీ సైనికోద్యోగులను నియమించాలి. ఉగ్రవాద దాడి జరిగినప్పుడు శీఘ్ర స్పందన దళాలను రంగంలోకి దించాలి. ఒక్క మాటలో భూతల, సైబర్‌ తలాల్లో ఉగ్రవాదులను వేటాడి వెంటాడి నిర్మూలించాలి!

– ఆర్య
–ఈనాడు సౌజన్యం తో

 

భారతీయ వైజ్ఞ్యానిక ఆలోచన దేశ వికాసానికి అవసరం

Posted Posted in News

ప్రస్తుతం భారత దేశంలోని యువత ముఖ్యంగా పాఠశాల స్థాయి విద్యార్థులందరూ మానవాళికి ఉపయోగపడే అంశాలపై ఆలోచిస్తూ కొత్త కొత్త పరిశోధనలతో దేశ వైభవాన్ని ద్విగునికృతం చేయాలనీ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు శ్రీ సరస్వతి విద్యాభారతి సంస్కృతి శిక్షా సంస్థాన్ వారు సంయుక్తంగా నిర్వహించిన “వైజ్ఞ్యానిక ఆలోచనా వికాసం” అనే కార్యశాలలో ముఖ్య అతిధిగా ప్రసంగించిన విశ్రాంత ఐ.ఏ.ఎస్ శ్రీ ఉమా మహేశ్వర్ రావు గారు పిలుపునిచ్చారు.

హైదరాబాద్ లోని వివిధ పాఠశాలల నుండి ప్రత్యేక ప్రతినిధులుగా 250 మందికి పైగా విద్యార్థులు సైదాబాద్ లోని ‘శ్రీ సరస్వతి శిశు మందిర్’ లో ఏర్పాటు చేసిన ఒక్క రోజు (జూన్ 2, 2016) కార్యశాలలో పాల్గొన్నారు.

IMG_20160702_093303

ఈ సందర్బంగా శ్రీ ఉమా మహేశ్వర్ రావు గారు మాట్లాడుతూ మన పూర్వికులు వేల సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా, సామాజికంగా ఉండే ప్రతి చిన్న, పెద్ద అంశం పై లోతైన అద్యయనం చేసి వాటిని విద్య, వైద్యం, ఖగోళ, వ్యవసాయ, గణిత, కాల గణనం, లోహ మరియు వివిధ శాస్త్రాల రూపాల్లో మనకు అందించారు. కానీ దురదృష్టవశాత్తు  ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా విదేశీయుల పాలన, ముఖ్యంగా 200 సం. పైగా బ్రిటిష్ పాలనా సమయంలో ఇట్టి ఉజ్వలమయిన వైజ్ఞ్యన సంపదను ఎలాంటి పునః పరిశీలించకుండానే విదేశీయులు కొట్టివేసి మరుగున పడేసారు, అని అన్నారు.

IMG_20160702_100715 - Copy

ఇంకా వారు మాట్లాడుతు, దేశ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు తిరిగి మనం మన వైజ్ఞ్యానిక ఆలోచనకు పదును పెట్టుతూ, ఆధునిక సమాజానికి ఉపయోగ పడే విధంగా గణిత, భౌతిక, అంతరిక్షం (ఇస్రో ), కంప్యూటర్, వైద్య, దేశ భద్రతకు అవసరమయ్యే రక్షణ రంగాల్లో కూడా తేజస్, అగ్ని, బ్రహ్మోస్ లాంటి క్షిపణులను, అణు బాంబులను, సాటిలైట్ లను అందిస్తున్నాము అని, ఇదే స్పూర్తితో ముందు తరాల వారు అని ఆలోచించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో నిష్ణాతులు అయిన శాస్త్రవేత్తలు పలు అంశాలపై విద్యార్థులకు అవగాహనా కల్పిస్తూ స్పూర్తిని నింపారు. మొదటి విడతలో భాగంగా శ్రీ ఎం. మనికవసగం, ప్రాజెక్ట్ డైరెక్టర్-అగ్ని-ఏ.ఎస్.ఎల్, గారు “భారత రక్షణ రంగంలో విజయాలు” అనే అంశం పై ప్రసంగించారు.  దీని తరువాత ఎన్.జి.ఆర్.ఐ ప్రధాన శాస్త్రవేత్త అయిన డా. శ్రీ నాగేష్ దవలూరి  గారు “భూమి పరిణామక్రమం మరియు మనవ అభివృద్ధిలో దాని పాత్ర” అనే అంశం పై వివరించారు.

రెండో విడతలో సి.సి.ఎం.బి ప్రధాన శాస్త్రవేత్తలు అయిన డా. సతీష్ కుమార్ గారు “దేశీయ  పశువులలో వైవిధ్యత మరియు వాటి సంరక్షణ” అనే అంశం పై, డా. ఏ . వీరభద్ర రావు గారు “శ్యాం ప్రసాద్ ముకర్జీ నుండి స్వయం ప్రకాశం వరుకు శాస్త్ర పరమైన మార్గం” అనే అంశం పై వివరించారు.

ఈ కార్యశాల చివరలో డా. రామానుజ నారాయణ్, ఐ.ఐ.సి.టి ప్రధాన శాస్త్రవేత్త, గారు “భారత దేశ సైన్సు అండ్ టెక్నాలజీలో మన శాస్త్రవేత్తల సహాయ సహకారాలు – నేటి సమకాలిన పరిస్థితులు” అనే అంశం పై ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ నడుంపల్లి  అయుష్, సి.ఈ.ఓ- అడ్రియాటిక్ ఇంజనీరింగ్ సొల్యుషన్స్,  శ్రీ విద్వాన్ రెడ్డి, శ్రీ సరస్వతి విద్యాపీఠం సెక్రటరి-తెలంగాణ, పి శ్రీనివాస్, శ్రీ సరస్వతి విద్యాపీఠం సంఘటన మంత్రి, మరియు వివిధ పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

IMG_20160702_100749