శ్రీ బాలసాహెబ్ దేవరస్ జీవితంలోని ప్రేరణదాయక సంఘటన

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్ శ్రీ బాలసాహెబ్ దేవరస్ జీవితంలో అనేక ప్రేరణదాయక సంఘటనలు ఉన్నాయి. అందులో ఒకటి ఆయన వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న శ్రీ శ్రీకాంత్ జోషి వివరించారు.
FacebookTwitter

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్ శ్రీ బాలసాహెబ్ దేవరస్ జీవితంలో అనేక ప్రేరణదాయక సంఘటనలు ఉన్నాయి. అందులో ఒకటి ఆయన వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న శ్రీ శ్రీకాంత్ జోషి వివరించారు.

పక్షవాతం వచ్చినప్పటికి, ఆరోగ్యం సహకరించక పోయినప్పటికి ఆయన (బాలసాహెబ్ జి ) రెండు పర్యటనలు చేశారు. రామజన్మభూమి ఉద్యమం సందర్భంగా సంఘపై పెట్టిన నిషేధం 1993లో తొలగిపోయిన తరువాత కొద్ది రోజులకే మద్రాస్ కార్యాలయంపై జిహాదీల బాంబుదాడి జరిగింది. కార్యాలయం ముందుగది దెబ్బతింది. కార్యాలయంలో ఉండేవారు, సందర్శకులతో సహా మొత్తం 12మంది చనిపోయారు. దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే బాలసాహెబ్ జి చెన్నై వెళ్లాలని, అక్కడి వారిని ఓదార్చాలనుకున్నారని ఆయన సహాయకుడిగా ఉన్న శ్రీకాంత్ జోషి చెప్పారు. కానీ బాలసాహెబ్ జీ ఆరోగ్యస్థితిని చూసి డాక్టర్లు అందుకు అంగీకరించలేదు. తనను కలవడానికి వచ్చిన ప్రతిఒక్కరితో ఆ సంఘటన గురించి ప్రస్తావిస్తూ, అక్కడికి వెళ్లలేని తన అశక్తత గురించి విచారం వ్యక్తంచేసేవారు. శ్రీకాంత్ జి  కనిపించినప్పుడల్లా చెన్నైకి వెళ్లాలని అడిగేవారు. కొన్ని రోజుల తరువాత డాక్టర్లు అనుమతి ఇచ్చారు. కానీ ఒక నిబంధన విధించారు. ముందు హైదారాబాద్ వెళ్ళి అక్కడ 2 రోజులు విశ్రాంతి తీసుకుని, ఎలాంటి సమస్య లేకపోతే అప్పుడు చెన్నైకి వెళ్లాలని అన్నారు. అలాగే 2 రోజులు హైదారాబాద్ లో ఉన్నతరువాత ఆయన చెన్నై వెళ్లారు. ఆయన్ని చక్రాల కుర్చీలో తీసుకువెళ్లారు.

చెన్నై చేరుకోవడానికి కొద్దిగా ముందు విమానంలో  ఎయిర్ హోస్టెస్ బాలాసాహెబ్ జీ తో మాట్లాడింది. అందరిలాగానే ఆమె కూడా ఆయన ఏదో చికిత్స కోసం వెళుతున్నారని అనుకుంది. ఏ ఆస్పత్రికి వెళుతున్నారని అడిగింది. అందుకు బాలాసాహెబ్ జీ `నేను చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళడం లేదు. ఇటీవల జరిగిన బాంబు పేలుడులో చనిపోయిన వారి బంధువులను ఓదార్చడానికి నాగపూర్ నుండి వస్తున్నాను’ అని చెప్పారు. అది విని ఆమె ఆశ్చర్యపోయింది. ఆయన ఆరోగ్యస్థితి, వయస్సు అడిగింది. పక్షవాతం వల్ల ఆయన శరీరంలో కుడివైపు పూర్తిగా పనిచేయడం లేదు. వయస్సు 80 ఏళ్ల పైమాటే. మూత్రవిసర్జన కోసం ట్యూబ్ పెట్టారు. అటువంటి స్థితిలో ప్రయాణమా? విమానం కిందికి దిగింది. ఆమె చక్రాల కుర్చీ తెచ్చింది. అతికష్టం మీద ఆమె, శ్రీకాంత్ జోషి జీ కలిసి ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు. కిందికి వచ్చిన తరువాత ఆయన్ని కారులో కూర్చోబెట్టడానికి కూడా ఆ ఎయిర్ హోస్టెస్ సహాయం చేసింది. తరువాత ఆయన పాదాలకు నమస్కరించి `మీరు నిజంగా మహాత్ములు. ఈ వయస్సులో, ఇలాంటి పరిస్థితిలో ఇతరుల బాధను పంచుకోవడానికి ఇంత దూరం వచ్చారు. నా జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి వారిని చూడలేదు. మీరు నిజంగా మహాత్ములు’ అని వెనుదిరిగింది.

కారు నగరంలోకి చేరుకుంది. బస చేయాల్సిన ప్రదేశానికి వచ్చినప్పటి నుండి కార్యాలయం వెళ్లాలని బాలసాహెబ్ జీ అడగటం మొదలుపెట్టారు. సాయంత్రం 4.గం లకు పేలుడులో చనిపోయిన వారి బంధువులు కార్యాలయం  వస్తారని, అప్పుడు వారిని కలవవచ్చని చెపితే అప్పుడు కాస్త శాంతించారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు రక్త పోటు 180/110 ఉందని గమనించి అది తగ్గడానికి మాత్రలు ఇచ్చారు. అలాంటి స్థితిలో ఆయన్ని కార్యాలయం తీసుకెళ్ళడం ఎలాగని డాక్టర్లు ఆందోళన పడ్డారు. మధ్యాహ్నానికి రక్త పోటు 220/120కి పెరిగింది. ఇదే స్థితి కొనసాగితే ఆయనకు గుండెపోటు రావచ్చని, లేదా మళ్ళీ పక్షవాతం రావచ్చని డాక్టర్ లు భయపడ్డారు. కార్యాలయానికి ఎప్పుడు బయలుదేరుతామని బాలాసాహెబ్ జీ అడగడడం ప్రారంభించారు. అప్పుడు శ్రీకాంత్ జీ ఎలాగైనా కార్యాలయం వెళ్ళాల్సిందే. అది తప్పదు అని డాక్టర్ లకు చెప్పేశారు. ఇక్కడే ఉంచితే ఆయన బీపీ మరింత పెరిగే ప్రమాదం ఉందని చెప్పారు. దానితో వెళ్లడానికి డాక్టర్ లు అంగీకరించారు.

చక్రాల కుర్చీలో కూర్చుని బాలాసాహెబ్ జీ కార్యాలయం చేరుకున్నారు. చనిపోయిన స్వయంసేవకుల చిత్రపటాల దగ్గరకి వెళ్లారు. ప్రతి ఒక్కరికీ పుష్పాంజలి సమర్పించారు. పటాలకు కుంకుమ పెట్టి, దీపం వెలిగించారు. ధూపం వెలిగించారు కూడా. బాధతో ఆయన చలించిపోయారు. నీరు నిండిన కళ్ళతో దెబ్బతిన్న కార్యాలయాన్ని పరిశీలించారు. దాదాపు 200 మంది అక్కడ సమావేశమయ్యారు. వారిలో చనిపోయిన స్వయంసేవకుల బంధువులు కూడా ఉన్నారు. వారిని బాలాసాహెబ్ జీ కి పరిచయం చేశారు. ఆయన అతి కష్టం మీద వారితో కొద్దిసేపు మాట్లాడారు. `నేను మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నిజానికి నేను ఇంకా ముందే రావలసింది. మిమ్మల్ని ఎలా ఓదార్చగలను? మీ బాధను ఎలా తగ్గించగలను? నేను సర్ సంఘచాలక్, సంస్థకు పెద్దను. నేను మొట్టమొదట ఇక్కడికి రావాల్సింది, మిమ్మల్ని ఓదార్చాల్సింది. కానీ డాక్టర్లు నన్ను రానీయలేదు. ప్రయాణించడానికి వాళ్ళు అనుమతించిన వెంటనే నేను వచ్చేశాను. దయచేసి నన్ను క్షమించండి. స్వయంసేవకులపై ఇలాంటి దాడి నాకు ఎంతో బాధను కలిగిస్తుంది. ఈ లోటును పూడ్చలేము. నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను. నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. అయిన మిమ్మల్ని కలవడం నా బాధ్యత. మీ వ్యక్తిగతమైన బాధను నేను పంచుకుంటున్నాను. మీ బాధను అర్ధం చేసుకున్నాను’ అని అన్నారు. ఆయన మాటలు విన్నవారు చలించిపోయారు. వారిలో కొందరు `మీరు ఇక్కడకు రావడం వల్ల మా బాధ కొంత తగ్గింది. ఇలాంటి పరిస్థితిలో కూడా మీరు మమ్మల్ని కలుసుకోవడానికి, మా బాధను పంచుకోడానికి ఇక్కడకు వచ్చారు. అదే మేం కోరుకునేది. మీరు మాకు దేవుడితో సమానం. నిజంగా మీరు మహాత్ములు’ అన్నారు. బాలాసాహెబ్ జీ ని ఎక్కువ మాట్లాడనీయలేదు. ఆయన హిందీ ఉపన్యాసాన్ని తమిళం లో అనువదించారు. ప్రార్థన తరువాత ఆయన్ని బసకు తీసుకువెళ్లారు. దానితో ఊపిరిపీల్చుకున్న డాక్టర్లు ఆయన రక్తపు పోటును పరీక్షించారు. అది 120/80 సాధారణ స్థితిలో ఉంది!

అదీ బాలసాహెబ్ జీ జీవితం .

FacebookTwitter