మహారాణి నాయకీదేవి

‘ప్రబంధచింతామణి’ అనేగ్రంథంలో – రెండవ మూలరాజు తల్లి, మహారాణి నాయకీదేవి, గదరారఘట్ట లేక కైరా అనే ప్రాంతంలో అబూపర్వతపాదసానువుల్లో మ్లేచ్ఛరాజుల సైన్యాలను వీరోచితంగా ఎదిరించటం గురించి పేర్కొన్నారు.
FacebookTwitter

వీరుడైన పృథ్వీరాజ్ చౌహాన్ ని క్రీ.శ. 1192లో జరిగిన తారాయిన్ యుద్ధంలో ఓడించిన మహమ్మద ఘోరీ ఢిల్లీ సుల్తానుల రాజ్యానికి పునాది వేసాడనేది మనందరికీ తెలిసిన కథ. ఐతే మనకు పెద్దగా తెలియని, ఎక్కువగా ప్రచారంకానీ మరొక వాస్తవగాథ ఏమిటంటే, ఇదే మహమ్మద్ ఘోరీ తారాయిన్యు ద్ధానికి పద్నాలుగేళ్ల పూర్వమే గుజరాత్ కి చెందిన రాణినాయకీదేవి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. చరిత్రలో ఈ విషయం పెద్దగా ప్రచారంలోకి రాకపోవడంవల్ల ఈమెను గురించిన వివరాలు కొంతమాత్రమే అందుబాటులో ఉన్నాయి.

మహారాణి నాయకీదేవి గుజరాత్ చాళుక్యులవంశంలోని సోలంకిరాజులలోని అజయపాలరాజు భార్య. 1171 నుండి నాలుగేళ్లపాటు తక్కువ సమయమే పాలించిన ఈ రాజు మరణానంతరం నాయకీదేవి మహారాణిగా రాజ్యభారాన్నితీసుకుంది. ఈమె గోవా ప్రాంతానికి చెందిన కాదంబరాజులలో మహామండలేశ్వరుని కుమార్తె. నాయకీదేవి పుత్రుడు మూలరాజు చిన్నపిల్లవాడుకావడంతో అతని పేరిట మహారాణియే రాజ్యనిర్వహణ చేసేది. తాను పాలించిన కొద్దికాలంలోనే ఈమె చరిత్ర సృష్టించింది. క్రీ.శ. 1178 లో తన రాజ్యంపైకి దండెత్తి వచ్చిన మహమ్మద్ ఘోరీ సైనికబలగాలని వీరోచితంగా ఎదిరించి, ఓడించి, తరిమికొట్టింది. ఈమె సమకాలీనులైన ఎందరో రాజ్యాధినేతలు ఈ సాహసానికి ఆమెను అభినందించారు.

గుజరాతీ ఆస్థానకవియైన సోమేశ్వరుడు ఈ సంఘటనను తరువాతికాలంలోని సోలంకిరాజుల సమక్షంలో కీర్తిస్తూ, చిన్నవాడైన మూలరాజు, మ్లేచ్చసైన్యాలను తరిమికొట్టాడని పేర్కొన్నాడు. అయితే నాయకీదేవి మహమ్మద్ ఘోరీ సైన్యాలను ఓడించిన ఈ యుద్ధవివరాలు, తరువాత కాలంలో 14 వ శతాబ్దానికి చెందిన జైనపండితుడు మేరుతుంగ రచనలలో లభించాయి.  ఈయన తన‘ప్రబంధచింతామణి’ అనేగ్రంథంలో – రెండవ మూలరాజు తల్లి, మహారాణి నాయకీదేవి, గదరారఘట్ట లేక కైరా అనే ప్రాంతంలో అబూపర్వతపాదసానువుల్లో మ్లేచ్ఛరాజుల సైన్యాలను వీరోచితంగా ఎదిరించటం గురించి పేర్కొన్నారు.

ఇదేకాక మరికొన్నిఉదాహరణలు కూడా ఘోరీ పరాజయాలను చెబుతున్నాయి. 13వ శతాబ్దానికి చెందిన పెర్షియన్ చరిత్రకారుడు మిన్హాజ్ – ఈ – సిరాజ్ (ఢిల్లీసుల్తానులకు ఆస్థానపండితుడుగా సేవలు అందించాడు) ఈ ఉదంతాన్నివర్ణిస్తూ మహమ్మద్ ఘోరీ, ముల్తాన్ మీదుగా సోలంకీల రాజధాని అయిన నహద్వాలా వైపుగా సైన్యాలతో తరలివెళ్లాడని రాసారు. సోలంకీలరాజు చిన్నవాడైనా, ఏనుగులతో కూడిన అతిపెద్ద సైనికదళాలను నడిపించాడని తరువాత జరిగిన యుద్ధంలో ఇస్లాంసైన్యాలు చిత్తుగా ఓడి, ప్రాణభయంతో వెనుతిరిగి పారిపోయాయని రాసాడు.

అయితే చరిత్రలో ఎందరో గొప్పమహిళల కథలాగే నాయకీదేవి కథ కూడా ఈ ఉదంతంతో అసంపూర్తిగా ముగిసిపోయింది. చరిత్రపుటలలో ఈమె సాహసాలు, విజయాలు మరుగునపడిపోయాయి.

FacebookTwitter