దేశం పట్ల కన్హయ్యకు ఉన్న అవగాహనా రాహిత్యం

Posted Posted in News

హైదరాబాద్ నగరం సుందరయ్య భవన్ లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు ఆధ్యర్యంలో జరిగిన కార్యక్రమం లో ప్రధాన వక్తగా ప్రసంగించిన జె.ఎన్.యు విద్యార్థి నేత కన్హయ్య కుమార్ సభ నిర్వాహకులను, వచ్చిన ప్రజలకు తన రాజకీయ అపరిపక్వతను ప్రదర్శించే వేదికగా ఉపయోగించుకున్నాడు.

తన ప్రసంగ మొత్తం , దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థను మరి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న మోడీ ప్రభుత్వాన్ని, రాష్టీయ స్వయంసేవక్ సంఘ్ ను విమర్శిస్తూ ప్రజలను తప్పు దోవ పట్టించాడు. మనువదానికి వ్యతిరేకం, దేశంలోని ఆర్థిక అసమానతల పై పోరాటం చేస్తాం అని చెప్తూ పెట్టుబడిదారి విదానాలకు వ్యతిరేకంగా ఒక చిన్న సమూహాన్ని ఏర్పాటు చెయ్యాలి అని అన్నాడు.  గాడ్సే అభిమానుల నుండి  దేశాన్ని కాపాడుకోవడానికి తను గాంధీ వైపు తనతో పటు మిగితా వారు నిలబడాలి అన్నాడు. అంబేద్కర్, మార్క్స్, ఆదివాసులు, సమాజం లో అణగారిన వర్గాలు అందరు ఒక గొడుగు కిందికి వచ్చి తమ హక్కులకై పోరాటం చెయ్యాలి అన్నాడు.

తన ప్రసంగం లో ఇన్ని విషయాలు చెప్పిన  కన్హయ్య అసలు తను ఎందుకు జైలు కి పోవాల్సి వచ్చింది, తను దేశానికి వ్యతిరకంగా చేసిన నినాదాలు చేసిన వాళ్ళ తో చట్టాపట్టలు ఏసుకొని ఎందుకు ఉన్న అనే విషయాన్నీ కనీసం ప్రస్తావించలేదు, భయమా?

ఎమన్నా అంటే మనువాదానికి వ్యతిరేకంగా మా పోరాటం అంటాడు..ఈ కాలంలో అసలు మనువు ఎవరు? ప్రస్తుత ప్రభుత్వాలు దేని ఆధారంగా పరిపాలన సాగుతున్నాయి. అంబేద్కర్ అధ్వర్యంలో తయారు చేయబడిన భారత రాజ్యాంగం ప్రకారం కాదా? దేశాన్ని “దేశాల సమూహం”గా వర్ణించిన ఒక విద్యార్ధి నేతగా చెల్లు బాటు అవుతున్న కన్హయ్య కు దేశం పట్ల ఎంతటి అవగాహనా ఉందొ మనకు అర్ధం అవుతుంది.

మన రాజ్యాంగం లో “ఇండియా దట్ ఇస్ భరత్” అని వ్రాసి ఉంది, కాని కన్హయ్య దేశాల సమూహం అంటే ఏంటిదో వివరించి ఉంటె బాగుండేది. భారత మాతను, జాతీయ పతాకాన్ని, దేశ సైనుకులను, రైతులను  గౌరవిస్తాను అంటూనే ఇది దేశం కాదు ఉంటె దేశాల సమూహం అనటము అజ్ఞ్యనమో అర్ధం కాని ప్రశ్న.

రాజ్యాంగం ద్వార ఉరి తీయబడ్డ దేశ ద్రోహి యాకుబ్ మెమొన్ ను కీర్తించిన రోహిత్ వేముల ఆదర్శం ఏ విదంగా కన్హయ్య కు ఆదర్శామో?

ఈ మద్య కాలంలో దేశం యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తునటువంటి వాళ్ళ జాబితాలో కన్హయ్య కూడా చేరిపోయాడు.

స్వభూమిపై వికసించిన స్వభావం…

Posted Posted in Articles

Akhand Bharat

రాజ్యాంగం ఒక జాతి స్వభావాన్ని వివరించే నిర్వచన పత్రం. ఒక జనసముదాయం, లేదా అనేక జనసముదాయాల సమాహారం జాతిగా వికసించిన తరువాత ఏర్పడే వివిధ వ్యవస్థలలో రాజ్యాంగం అతి ప్రధానమైంది. అందువల్ల రాజ్యాంగం జాతీయతను వ్యక్తం చేసే ఒక మాధ్యమం. ఒక జాతి తన ప్రస్థాన క్రమంలో రాజ్యాంగాన్ని రాసుకుంటుంది, మార్చుకుంటుంది, రద్దు చేసుకుంటుంది, కొత్త రాజ్యాంగాన్ని వ్రాసుకుంటుంది. ఈ రాజ్యాంగ ప్రక్రియకు పూర్వం కూడ జాతి ఉంది. ఈ రాజ్యాంగ ప్రక్రియకు పూర్వం కూడ జాతి ఉంది, ఈ ప్రక్రియ రద్దయి కొత్త ప్రక్రియ మొదలయినప్పుడు కూడ జాతి ఉంటుంది. అందువల్ల రాజ్యాంగం అంతకుపూర్వం నుంచి ఉన్న జాతీయతకు ఒక ధ్రువీకరణ మాత్రమే. జాతి ఏర్పడిన తరువాతనే రాజ్యాంగం ఏర్పడుతోంది. రాజ్యాంగ రచనతో జాతి ఏర్పాటు ఆరంభం కావడం లేదు. ఒక జాతి ఏర్పడిన తరువాత రాజ్యాంగం అనేకసార్లు ఏర్పడవచ్చు. ఒక రాజ్యాంగ వ్యవస్థకు, మరో రాజ్యాంగ వ్యవస్థకు మధ్య దశాబ్దులు గడచిపోవచ్చు, సహస్రాబ్దులు సాగిపోవచ్చు, యుగాలు, మహాయుగాలు గడచిపోవచ్చు, మన్వంతరాలు కదలి పోవచ్చు…ఒక జాతి ఏర్పరచుకొనే వ్యవహార నియమావళి రాజ్యాంగం. అందువల్ల అత్యంత వినూతన నియమావళిని జాతీయులు సహజంగానే పాటిస్తారు, పాటించాలి. రాజ్యాంగ నిబద్ధత అంటే ఇదీ. ఈ రాజ్యాంగ నిబద్ధత మరింత విస్తృతమైన వౌలికమైన జాతీయతా నిబద్ధతలో భాగం. భారతజాతికి అనాదిగా అనేక రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడినాయి. కొన్ని సహజంగా అంతరించాయి, కొన్నింటిని జాతీయులు మార్చుకున్నారు, కొన్నింటిని విదేశీయుల ధ్వంసం చేశారు. అందువల్ల 1947లో విదేశీయులు చివరిగా నిష్క్రమించిన తరువాత అనాది భారతజాతి క్రీస్తుశకం 1950 జనవరి 26 నుండి కొత్త రాజ్యాంగ వ్యవస్థను ఏర్పరచుకుంది. అప్పటినుంచి ఈ కొత్త రాజ్యాంగ నియమాల ప్రకారం మన సనాతన జాతీయ ప్రస్థానం కొనసాగుతోంది. అందువల్ల ఈ సనాతన జాతీయ ప్రస్థానంలో 1950 జనవరి 26వ తేదీ ఒక శుభంకరమైన ఘట్టం. అంతేకాని 1950 జనవరి 26న మనం ఒక జాతిగా ఏర్పడలేదు, భారతీయులు సృష్ట్యాదిగా ఒక జాతిగా ఏర్పడి ఉండటం వాస్తవ చరిత్ర.. పాఠశాలలో చేరిన పిల్లవాడు, పాప, తమ ఇంటిపేరును నమోదు చేసుకుంటారు. తాము పుట్టినప్పటినుంచి ఆ ఇంటిపేరు తమకు ఉంది. అలా ఉండడానికి పాఠశాలలో జరిగే నమోదు ఒక ధ్రువీకరణ మాత్రమే. అంతేకాని పాఠశాలలో నమోదు చేసుకొనడం వల్ల ఆ పిల్లలకు ఆ ఇంటిపేరు, ఇంటితనం ఏర్పడడం లేదు. అంతేకాదు ఈ పిల్లలు ఆ ఇంటిలో పుట్టకపూర్వం కూడ వందల లేదా వేల ఏళ్లుగా ఆ ఇంటితనం ఉంది. అలాగే భరతమాత బిడ్డలైన భారతీయులు తమకు అనాదిగా ఉన్న ఇంటితనాన్ని-జాతీయతను-1950 జనవరి 26 నాడు రాజ్యాంగ పత్రం ద్వారా నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకొనడానికి పూర్వం అనాదిగా ఇంటితనం, ఇంటిపేరు-్భరత జాతీయత-కొనసాగుతోండడం చరిత్ర. అందువల్ల మనది సనాతన జాతి. సనాతన జాతి అని అంటే ఆద్యంతము లేని శాశ్వతమైన జాతి…అందువల్ల వర్తమానంలోని మనం లేని సుదూర గతంలోను, మనం ఉండని సుదూర భవిష్యత్తులోను మన జాతి ఉంది, మన జాతీయత ఉంది! ‘‘తేరా వైభవ్ అమర్ రహే మా హమ్ రహే, న రహే..’’- నీ వైభవము నిరంతరం నిలచిపోవాలి, మేము ఉండవచ్చు, ఉండకపోవచ్చు-అన్న హిందీ కవిత భారత జాతి సనాతన తత్వానికి లేదా శాశ్వత తత్వానికి ఆధునిక ప్రతీక. ఇంటితనం అన్న వైయక్తిక వాస్తవానికి సమష్టి విస్తృతి జాతీయత…ఈ భారత జాతీయత ‘‘రక్షతి బ్రహ్మేదం భారతం జనమ్..’’ అని సృష్ట్యాదిలో వైదిక ఋషులు ప్రార్థించిన నాటిది, అప్పటి నుంచి కొనసాగుతున్నది, అనంతంగా కొనసాగుతున్నది. ఈ ఆద్యంత రహిత ధ్యాస సహజమైన మాతృభక్తికి పితృభక్తికి ప్రాతిపదిక. జాతికి ‘‘తల్లిదండ్రులు భూమి, ఆకాశం’’ అన్నది వౌలిక ప్రాతిపదిక. అందుకే తొలి భారతీయులు, తొలి మానవుడు, ‘‘తండ్రీ ఆకాశమూ, తల్లీ భూమీ! మిమ్ములను ప్రార్థిస్తూ నేను చేస్తున్న అభ్యర్థన నిజమగు గాక…మమ్ములను మాతో పాటు సమస్త జీవజాలమును మీరు రక్షించాలన్నది ఈ అభ్యర్థన..మీ ఇరువురి అనుగ్రహము వలన మేను జీవమును పెంపొందించునట్టి అన్నమును పొందుతున్నాము!’’ అని ప్రార్థించాడు. ఈ తొలి ప్రార్థన జాతీయతకు ప్రాతిపదిక. ఈ ప్రార్థనను ఇప్పుడు కూడ చేయడం ఎప్పుడూ చేస్తూ ఉండడం సహజమైన జాతీయత…
‘‘ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు పితర్మాతర్యది హోపబ్రువేవామ్ భూతం దేవానాం అవమే అవోభిః విద్యామేషం వృజనం జీరదానుమ్’’ ఈ వైదిక ఆకాంక్ష బంకించంద్రుని వందేవమాతరం లోను, రవీంద్రుని జనగణమన గీతంలోను పునరభివ్యక్తమైంది. వందేమాతరంలో మాతృభక్తి, జనగణమన గీతంలో పితృభక్తి ప్రస్ఫుటిస్తున్నాయి. ఈ సనాతన ‘జాతిపిత’ ఆకాశం..జాతీయ మాత భూమి..్భరత మాత! ఈ జాతి ప్రజలు ఈ మాతా పితరుల వరాల బిడ్డలు. ఈ పుత్రభావం సహజమైన జాతీయత. ‘‘ద్యౌర్యఃపితా, పృథివీ మాతా..’’ ఆకాశం తండ్రి, భూమి తల్లి!
ఆకాశానికి మానవులకూ మధ్య గల ఈ పితాపుత్ర భావం, భూమికీ మానవులకూ మధ్య గల ఈ మాతా పుత్ర భావం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు, ప్రపంచానికి సకల జీవజాలానికి వర్తించే సృష్టిగత సత్యం ఇది. ఈ సత్యాన్ని భారతీయులు అనాదిగా గుర్తించడం తుది మొదలు లేని సనాతన సంస్కారం. అందువల్లనే భారతీయులది సనాతన జాతి-ఎటర్నల్ నేషన్- అయింది. ఈ సంస్కారం యుగాల తరబడి ప్రపంచమంతటా వ్యాపించి ఉండడం చరిత్ర! ఈ సంస్కారాన్ని భారత దేశానికి వెలుపలగల మానవులు మరచిపోవడం కూడ చరిత్ర. అలా మరచిపోయిన వారు రకరకాల వికృతులకు గురయ్యారు. అలా మరచిపోయిన విదేశీయులు కోట్లాది ఏళ్ల చరిత్రను కూడ మరచిపోయి ప్రపంచ చరిత్రను వేల ఏళ్లకు కుదించారు. ఇలా కుదించిన వారు ప్రచారం చేసిన చరిత్రను గత కొన్ని వందల ఏళ్లుగా మనదేశ ప్రజలు కూడ విశ్వసించి ప్రచారం చేయడం చారిత్రక వైపరీత్యం. ‘జాతి’, ‘జాతీయభావం’, ‘దేశభక్తి’, ‘ప్రజాస్వామ్యం’, ‘రాజ్యాంగ వ్యవస్థ’ వంటివి మనకు విదేశీయుల పాలన కారణంగా సంక్రమించాయన్న వక్రీకరణలు వాస్తవాలుగా చెలామణి అవుతుండడం కొనసాగుతున్న వైపరీత్యం. మానవులు భారతదేశంలో పుట్టి పెరిగి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడం వాస్తవ చరిత్ర. తొలి మనువు నుంచి అభినవ మనువైన బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ వరకు గల భారతీయులెందరో ధ్రువీకరించిన చరిత్ర ఇది. మనువుకు సంబంధించిన వారు మానవులు, మానవులకు సంబంధించిన మానవీయ సంస్కారాలు కూడ భారతదేశం నుండి ఇతర ప్రపంచ ప్రాంతాలకు వ్యాపించడం చరిత్ర. అందువల్లనే భారత జాతి, మానవజాతికి ప్రతిరూపమైంది. ఈ దేశపు సనాతన సంస్కారమైన హిందుత్వం మానవ సంస్కారమైంది. ఈ దేశం నుంచి క్రమంగా బయటకు పోయిన ప్రజలు వేల ఏళ్లుగడిచిన తరువాత ఈ మానవీయ సంస్కారాలను మరచిపోయారు. అలా మరచిన వారు మనదేశానికి వచ్చి సంస్కారాలను నేర్చుకొని వెళ్లిన కాలఖండం కూడ చరిత్రలో ఉంది. కానీ భారతదేశం నుంచి బయటకి వెళ్లిన వారు భారతీయ సంస్కారాలను పూర్తిగా మరచిపోయి కొత్త జనసముదాయాలుగా ఏర్పడిన కాలఖండం కూడ ఉంది. ఈ కాలఖండం కలియుగం ఆరంభం నుంచీ కొనసాగుతోంది. కలియిగంలో ప్రస్తుతం 5,117వ సంవత్సరం నడుస్తోంది.
ఇలా భారతీయతను మరచి, ‘గ్రీకులుగా, రోమన్లుగా ఏర్పడిన వారికి, ఐరోపాలోని వారి వారసులకు కొన్ని శతాబ్దుల క్రితం వరకూ జాతి అంటే తెలియదు. భూమిని తల్లి అన్న అంశాన్ని తండ్రి అన్న వాస్తవాల పట్ల ధ్యాస లేదు. అందువల్లనే భారత దేశంలో సనాతన జాతి స్వర్ణశోభలతో వెలుగొంది సకాలంలో గ్రీకులు, రోమన్లు, నగర రాజ్యాలకు పరిమితమయ్యారు. ఆ తరవాత వారు తమకు నాగరికతను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నాగరికతలకు జాతి అంటే తెలీదు, జాతీయత తెలీదు. భూమి పట్ల మమకారం ప్రాతిపదికగా ఒక జనసముదాయం, లేదా జనసముదాయాలు జాతిగా వికసించిన భారతీయ సంతతి వారికి అర్థం కాలేదు. ఇలా అర్థం కాని ఐరోపా వారు మన దేశాన్ని దురాక్రమించడం, దురాక్రమణ దురహంకారంతో ఈ సనాతన జాతికి పాఠాలు చెప్పడం చరిత్రకు జరిగిన అన్యాయం, సృష్టికి జరిగిన అన్యాయం. భారతదేశంలోని ప్రజలు ఇతర దేశం నుంచి వచ్చిపడిన చిత్ర విచిత్రమైన తండాల వారసులన్నది ఐరోపా అజ్ఞానులు అహంకారంతో మనకు చెప్పిన అబద్ధాల పాఠం. ఈ పాఠం నమ్మిన వారికి ‘‘ఈ దేశం అనాదిగా తమదన్న’’ జాతీయ నిష్ఠ లేకుండా పోయింది. భరతమాతకు జయం కోరని దేశద్రోహులు ఐరోపావారు చెప్పిపోయిన అబద్ధపు పాఠానికి వారసులు. తాము దురాక్రమణను కొనసాగిస్తున్న కాలం నాటికి ‘‘్భరత దేశం ఒక జాతిగా ఏర్పడ లేద’’న్నది ఐరోపా ఆంగ్లేయులు నేర్పిన మరో అబద్ధపు పాఠం. ఈ పాఠం ఫలితంగా బ్రిటిష్ వ్యతిరేక సమరం జరిగిన సమయంలో, ‘‘మన దేశం పూర్వం ఒక జాతి-నేషన్-గా ఏర్పడి ఉండలేదని చరిత్రలో మొదటిసారిగా మన దేశ ప్రజలు ఒక జాతిగా ఏర్పడే ప్రక్రియ కొనసాగుతోంద’’ని ఈ సనాతన జాతీయులు విశ్వసించే దుస్థితి ఏర్పడింది. సురేంద్రనాథ బెనర్జీ వంటి మహనీయులు మేధావులు సైతం ఈ బ్రిటిష్ వారి అజ్ఞానపు అబద్ధాన్ని విశ్వసించారు.‘‘ఆవిర్భవిస్తున్న జాతి-ఏ నేషన్ ఇన్ ది మేకింగ్’’- అన్న పరిశోధక పత్రాన్ని సురేంద్రనాథ్ బెనర్జీ వ్రాయడానికి ఈ భ్రాంతి కారణం. ఇలా ‘‘మనదేశం ఒక జాతిగా ఏర్పడడానికి దేశంలోని వివిధ ప్రాంతాలను బ్రిటిష్ వారు ఇంగ్లీషు భాష ద్వారా, రైళ్లద్వారా సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ద్వారా అనుసంధానం చేయడం కారణమన్న’’ ప్రచారం జరిగింది, జరుగుతూనే ఉంది! ‘బావి’ని సైతం చూడని వారు ‘మహానది’ని వర్ణించినట్టుగా ఐరోపావారు మనకు జాతీయత గురించి జాతి గురించి బోధించారు. భావదాస్యగ్రస్తులైన వారు ఇప్పటికీ ఈ బ్రిటిష్ వారి అబద్ధాలను నిజాలుగా విశ్వసిస్తున్నారు. అందుల్లనే ‘జాతీయత’, ‘దేశభక్తి’, బ్రిటిష్ ‘పాలన’ వల్ల ఏర్పడిన ‘ప్రభావాత్మక’ లేదా ‘ప్రతిక్రియత్మక’ భావోద్వేగాలని ప్రచారమైంది. దేశంలో స్వభావాత్మక జాతీయత అనాదిగా ఉండడం వాస్తవం…
ఇంగ్లీషు పుట్టడానికి పూర్వం అనేక యుగాలుగా ఈ జాతిని సంస్కృత భాష అనుసంధానం చేసింది. కలియుగాది నుంచి మూడువేల ఏళ్లకు పైగా ఈ దేశంలో ఏకీకృత రాజ్యాంగ వ్యవస్థ నెలకొని ఉండేది. జాతీయ రాజమార్గాలు, భౌగోళిక అనుసంధానాన్ని కూర్చాయి. కానీ ఈ వ్యవస్థలన్నీ జాతీయతలోని కొన్ని విభాగాలు మాత్రమే. ఈ స్వభావాత్మక జాతీయతకు ప్రాతిపదిక మాతృభూమి పట్ల బిడ్డలకు సహజంగా ఏర్పడే మమకారం. ఈ మమకారం నిండిన గుండెలవారు జాతీయులు, భారతీయులు, హిందువులు….

హెబ్బార్‌ నాగేశ్వరరావు,

సెల్ః 9951038352

ఆంద్రభూమి సౌజన్యంతో

అది దేశద్రోహం కాక మరేమిటి?

Posted Posted in News

bhagayya sir

దేశభక్తి మా ఒక్కరి సొంతమని తాము ఏనాడూ అహంకరించలేదని చెప్పారు ఆరెస్సెస్ సహసర్కార్యవాహ్ (ఆలిండియా జాయింట్ జనరల్ సెక్రటరీ) భాగయ్య. కానీ అఫ్జల్గురును శ్లాఘించడం దేశద్రోహమేనని అన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య బాధాకరం, అదే సమయంలో యాకూబ్ మెమెన్కు అనుకూలంగా విద్యార్థులు నినదించడానికి దారి తీసిన పరిస్థితులను, అందుకు ప్రేరేపించిన వారిని కనిపెట్టాలని కోరారు. భాగయ్య ఇంటర్వ్యూలో కొన్ని అంశాలు.

ప్రశ్న: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పరిణామాల తరువాత మొదలైన చర్చ గురించి ఏమంటారు?
జవాబు: జేఎన్‌యూలో సాంస్కృతిక ఉత్సవం పేరుతో భారత వ్యతిరేక నినాదాలు చేయడం, దేశం ముక్కలయ్యే వరకు సంఘర్షణ కొనసాగుతుందని చెప్పడం, జుడీషియల్ కిల్లింగ్స్ పేరుతో అఫ్జల్‌గురు, మక్బూల్ భట్‌లని సమర్థించడం దేశద్రోహమే. దేశమంతా ఇలాగే భావిస్తోంది కూడా. ఈ అంశాలన్నింటి మీద సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నా పట్టించుకోకపోవడం మావోయిస్టుల విధానం. జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్, ఎస్‌ఎఫ్‌ఐ, అలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఇవన్నీ భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో దేశ ద్రోహానికి పాల్పడు తున్నాయి. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని తిరిగి తీసుకోవాలని పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇది దేశభక్తి. సామ్రా జ్యవాదంతో భారత్ కశ్మీర్‌ను దురాక్రమించిందని చెప్పడం దేశద్రోహమే. ఇదంతా దేశ సమగ్రతకు భంగకరం. దీనిని ఆరెస్సెస్ సహించదు.

ప్ర: ఆరెస్సెస్‌తో విభేదిస్తే దేశద్రోహ ముద్ర వస్తోందన్న విమర్శ ఉంది.

: దేశభక్తి అంటే మాదే అని మేం ఎప్పుడూ అహంకరించలేదు. గుత్తాధిపత్యం ప్రకటించుకోలేదు. ఈ దేశంలో చాలామంది దేశభక్తులు ఉన్నారు. వారంతా స్వయం సేవకులని మేం చెప్పలేదు. స్వతంత్ర కశ్మీర్, ఇండియా గో బ్యాక్ అనడం; కార్గిల్ యుద్ధ సమయంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, దంతేవాడలో 76 మంది జవాన్లను మావోయిస్టులు దుర్మార్గంగా హత్యచేస్తే ఒక రాత్రంతా ఉత్సవం జరుపుకోవడం జేఎన్‌యూకే సాధ్యం. అది దేశద్రోహమే.

ప్ర: సాధారణంగా వినిపించే విమర్శ – తనతో ఏకీభవించనివారిని దేశద్రోహులుగా పేర్కొంటున్న బీజేపీ కశ్మీర్‌లో వేర్పాటువాదులను బాహాటంగా సమర్థించే పీడీపీతో ఎందుకు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది? మళ్లీ ఎందుకు ప్రయత్నిస్తున్నది?
: ఇది పూర్తిగా బీజేపీకి సంబంధించిన వ్యవహారం. వారినే అడగాలి.

ప్ర: భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందన్న ఆరోపణ గురించి ఏమంటారు?

: అభిప్రాయ భేదం వేరు. ద్వేషం వేరు. ఆరెస్సెస్, బీజేపీ సహా ఏ సంస్థ సిద్ధాంతంతో అయినా విభేదించే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది. వాటికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. తప్పులేదు. కానీ ఈ సంస్థలను అడ్డం పెట్టుకుని దేశాన్ని ముక్కలు చేస్తాం అనే వరకు వెళ్లడం ఏమిటి? దీనికేనా భావ ప్రకటనా స్వేచ్ఛ అని పేరు? అసలు భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇక్కడ జరుగుతున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలను దేశం విస్తుపోయి చూస్తోంది. అరుంధతీరాయ్ మానవ హక్కుల రక్షణ పేరుతో భద్రతా దళాల హత్యను సమర్థించి, దానికి భావ ప్రకటనా స్వేచ్ఛ అని పేరుపెడుతున్నారు. ఇలాంటి ధోరణులకు ఒక వర్గం మీడియా రకరకాల పేర్లు పెట్టి సమర్థించడం ఇంకా దురదృష్టకరం. దీనితో మీడియా విశ్వసనీయత తగ్గుతోంది. ఏ వార్త వచ్చినా సోషల్ మీడియాలో చూసుకుని గాని ప్రజలు నిర్ధారణకు రాలేని పరిస్థితి తెచ్చారు. జేఎన్‌యూ విద్యార్థుల బెయిల్ పిటిషన్ వాదనల సమయంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చు కోండి. ఆమె ఉపకార్ సినిమాలో పాటను ఉటంకించారు. భగత్‌సింగ్ వంటి వారి రక్తతర్పణలతో విముక్తమైన దేశం, ఇది స్వర్ణభూమి అన్నారు న్యాయ మూర్తి. జేఎన్‌యూకి సంబంధించి హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛకే పరిమి తం కాలేమన్నారు. సీపీసీ సెక్షన్ 39 ప్రకారం దేశద్రోహ కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు చూసినవారు ఫిర్యాదు చేయాలి. కానీ జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు వాళ్లతో కలసి నినాదాలు ఇచ్చాడు. దీనినే కోర్టు తీవ్రంగా పరిగణించింది. జేఎన్‌యూ ఘటన తరువాత దేశంలో దేశభక్తులు, దేశ వ్యతిరేకులు అని రెండు శిబిరాలు ఏర్పడ్డాయి.

ప్ర: భారత్‌మాతాకీ జై నినాదం గురించి తెలెత్తిన వివాదం మాటేమిటి?

: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మతంతో ప్రమేయం లేకుండా దేశ ప్రజలంతా ఇచ్చిన నినాదాలు భారత్‌మాతాకీ జై, వందేమాతరం. ఇప్పుడు కేవలం రాజకీయాల కోసం కొందరు ఈ నినాదాన్ని అవమానించడమంటే, స్వరాజ్య సమరంలో మన పెద్దలు చేసిన త్యాగాలను అవమానించడమే. అధికారం కోల్పోయిన వారు మళ్లీ దాని కోసం ఆరాటపడతారు. తప్పులేదు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మీద కక్షతో విద్రోహశక్తులను సమర్థించడం ఎంతవరకు సబబు?

ప్ర: ఆ పని చేస్తున్నవారు ఎవరంటారు?

: కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, మావోయిస్టులు సైద్ధాంతికంగా, రాజకీ యంగా ప్రాబల్యం కోల్పోయిన తరువాత పేదలు, దళితులు, విద్యార్థులను అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారు. నిజానికి ఈ ధోరణిని కాంగ్రెస్‌లో కూడా అంతా సమర్థిస్తారని అనలేం. ఆ పార్టీలో ఇప్పుడు అంతర్మథనం మొదలైందనిపిస్తుంది. కమ్యూనిస్టులు మాత్రం తమ లబ్ధి కోసం ఎస్సీ ఎస్టీ విద్యార్థులను బలిచేయాలని చూస్తున్నారు.

ప్ర: ఆరెస్సెస్ ఆలోచనా ధోరణిలో మనువాదం ఉంటుందన్న విమర్శ గురించి ఏమంటారు?

: ఇది అవగాహనలేని విమర్శ. మనుస్మృతి గురించి మాకు కచ్చితమైన అవగాహన ఉంది. అదేమీ వేదం కాదు. స్మృతి. ఒక కాలానికి సంబంధించినది. దానికి ఎప్పుడో కాలదోషం పట్టింది. మనుస్మృతిని మేం ఏనాడూ ప్రస్తావించలేదు. ఈ విమర్శ ప్రధానంగా వామపక్షం వైపు నుంచి వస్తుంది. వారు  కొన్ని ప్రశ్నలకు సంబంధించి ఈ దేశానికి సమాధానం చెప్పాలి. ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా మహిళలకు అద్భుతమైన గౌరవం ఇచ్చి, సముచిత స్థానం కల్పించిందా? కేరళలో జరిగిన ఒక దురదృష్టకర ఉదంతాన్ని చెబుతాను. త్రిపుంతుర అనే చోట ఒక విద్యార్థిని ఎస్‌ఎఫ్‌ఐలో కొద్దికాలం పని చేసి బయటకు వచ్చింది. తరువాత ఏబీవీపీలో చేరింది. ఆ మరునాడే ఆమె శీలం గురించి అభాండాలు వేస్తూ పోస్టర్లు వెలిశాయి. ఆమె ఆత్మహత్యా యత్నం చేసింది. ఆ విద్యార్థిని పేరు స్మృతి. అదేం చిత్రమో ఎవరైనా సరే వామపక్షం వైపు ఉన్నంతకాలం సెక్యులర్. ఏవో కారణాలతో ఏబీవీపీ వంటి ఏ ఇతర సంస్థలోకో మారితే వాళ్లు వెంటనే ‘బ్రాహ్మణ వాదులు’ అయిపోతారు. వామపక్షాలకు నిలయంగా, ప్రగతిశీల భావాలకు ఆలవాలంగా చెప్పుకునే జేఎన్‌యూలో దుర్గాదేవి గురించి కరపత్రంలో ఎంత నీచంగా రాశారో అందరికీ తెలుసు. ఆ పేరు ఒక దేవతదే. కానీ ఆమె స్త్రీ. ఇలాంటివాళ్లు సంఘ్‌ని మనువాద సంస్థ అనడమే వింత.

ప్ర: మీ దృష్టిలో ఈ పరిణామాల మీద సామాన్య ప్రజల స్పందన ఏమిటి?

: దేశ విచ్ఛిత్తిని కోరుతున్న వారి అభిప్రాయాలకు సామాన్య ప్రజానీకం అంగీకారం లేదు. సాధారణ ప్రజానీకంలో ఆ విద్రోహ చింతనే ఉంటే దేశం ఏనాడో ముక్కలు చెక్కలు అయ్యేది. విద్యార్థుల విషయం కూడా అంతే. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో కూడా జేఎన్‌యూ మాదిరే నినాదాలు మొదలయ్యాయి. ఆ మరునాడే కొందరు విద్యార్థులు అలాంటి నినాదాలు, ధోరణులు మాకు సమ్మతం కాదని అంతకంటే పెద్ద సభ నిర్వహించి నిరూపించారు. ఇది కూడా పత్రికలలో ప్రాధాన్యానికి నోచుకోలేదు.

ప్ర హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, వేముల రోహిత్…..

: రోహిత్ ఆత్మహత్య ముమ్మాటికీ దురదృష్టకరం. ఈ వాస్తవాన్ని గుర్తిస్తూనే ఇంకొక మాట కూడా చెప్పాలి. జేఎన్‌యూ గొడవలకు అఫ్జల్‌గురు కేంద్ర బిందువైతే, హెచ్‌సీయూ రగడకు కేంద్ర బిందువు యాకూబ్ మెమెన్ ఉరి. ఒక మెమెన్‌ను ఉరితీస్తే ఇంటికో మెమెన్ పుడతాడు అంటూ విశ్వవిద్యాల యంలో ఊరేగింపు తీసి, నినాదాలు చేయడం, అతడి ఆత్మశాంతికి ప్రార్థనలు చేయడం గర్హించక తప్పదు. రోహిత్ ఆత్మహత్యతో తీవ్రమైన ఈ అంశం తెర వెనక్కిపోయింది. అతడి కులం వ్యవహారం ఘటనను మరో మలుపు తిప్పింది. ఇలాంటి ధోరణులకు దారి తీసిన పరిస్థితుల మీద దర్యాప్తు చేయాలి. అక్కడ జరుగుతున్న వ్యవహారాల గురించి పదేళ్ల కాలాన్ని తీసుకుని దర్యాప్తు చేయించాలి. పుట్టుకను బట్టి వివక్ష చూపడాన్ని ఆరెస్సెస్ అంగీకరించదు. ధర్మం కూడా అంగీకరించదు. ఈ దేశంలో పుట్టినవారు ఎవరైనా అన్ని హక్కులు అనుభవించగలగాలి. దీని ఆచరణలో లోపాలు లేకపోలేదు. ఆ లోపం మనుషులది. ధర్మానిది కాదు.

ప్ర మీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నవారి నోటంట వినిపించేదీ, మీ నోటంట వినిపించేదీ అంబేడ్కర్ పేరే. మరి ఎందుకీ ఘర్షణ.

: కులం గురించి అంబేడ్కర్ చేసిన రచనలో భారతదేశంలో కేవలం భౌగోళిక ఐక్యతే కాకుండా, సాంస్కృతిక ఏకాత్మత ఉందని అభిప్రాయపడ్డారు. మేం దీనిని నమ్ముతున్నాం. చెబుతున్నాం. మత మార్పిడిని ముఖ్యంగా ఇస్లాం, క్రైస్తవంలోకి బడుగులను మార్చడం మీద ఆయన తీవ్ర అభ్యంతరాలనే వ్యక్తం చేశారు. ఈ అంశాలను మమ్మల్ని విమర్శించేవారు సౌకర్యంగా విస్మరిస్తారు. దేశ సమగ్రత, సామాజిక న్యాయం, సౌశీల్యం, స్వేచ్ఛ, సమత్వం, సౌభ్రాత్రం ఆధారంగా పౌరులంతా కలసి పని చేయాలని అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని అంబేడ్కర్ చెప్పారు.

ప్ర ఆర్థికాంశాల మీద ఆరెస్సెస్ వైఖరి సాధారణంగా వినిపించదంటారు.

: ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, తెలిసినా తెలియకున్నా మా కార్యక్రమం మాకు ఉంది. మొన్న జైపూర్ సమావేశాలలో వ్యవసాయం గురించి తీర్మానం చేశారు. పెట్టుబడులు తగ్గాలి. రాబడులు పెరగాలి. ఇందుకు గో ఆధారిత సేద్యం సరైనదని, సేంద్రియ వ్యవసాయం రావాలని ఆ తీర్మానం సారాంశం. రైతుల దగ్గర నుంచి చెరకు కొంటారు. చెరకు ఉప ఉత్పత్తి మొలాసిస్. మళ్లీ దాని నుంచి ఎథనాల్ తీస్తారు. వీటిలో రైతుకు భాగం ఉండాలని మా వాదన. రైతు ఆత్మగౌరవంతో బతకాలి. అందరికీ విద్య, అందరికీ వైద్యం అని కూడా చెబుతున్నాం. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం రెండు దశాబ్దాలుగా సర్వ నాశనం అయినాయి. వాటిని పునరుద్ధరించాలి. మేం ఎన్నో సేవా కార్య క్రమాలు నిర్వహిస్తాం. కానీ ప్రచారం తక్కువ. అందుకు పాకులాడం.

ప్ర: ఆరెస్సెస్ అనుకూల ప్రభుత్వం వచ్చింది కాబట్టి మందిర్ మళ్లీ తెరపైకి వస్తుందా?

: ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వమైనా అది మనందరిది. అయో ధ్యలో రామాలయం తథ్యం. ప్రజాస్వామ్యబద్ధంగా అది జరుగుతుంది.

ప్ర మీ మీద వస్తున్న విమర్శల గురించి సూటిగా ఏం చెబుతారు?

: మీమీద దుర్యోధనుడికి ఎందుకింత ద్వేషం అని పాండవులను అడగలేం. ద్వేషిస్తున్న దుర్యోధనుడిని అడగాలి ఆ ప్రశ్న.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులు ఆందోళన

Posted Posted in News

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు రెండు నెలల సెలవుల  తరువాత తిరిగి విధుల లోకి చేరడం తీవ్ర ఉద్రిక్తత కు దారి తీసింది. ప్రభుత్వం వెంటనే రోహిత్ వేముల ఆత్మ హత్య పై ఆరోపణలు ఎదుర్కుంటున్న వైస్ ఛాన్సలర్ ని సస్పెండ్ చేయాలి అనే డిమాండ్ తో వి.సి  ఛాంబర్ లోకి వెళ్లి ఫర్నిచర్ ద్వంసం చేయడం జరిగింది. పరిస్థితి లో మార్పు ను గమనించిన యూనివర్సిటీ అధికారులు పోలీస్ వాళ్ళకు సమాచారం ఇవ్వడం తో అక్కడకు చేరుకొని ఉద్త్రిక్త వాతావరణాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్తులు ఘర్షణకు దిగడం తో పోలీస్ లో లాఠి ఛార్జ్ చేసారు. ఈ ఆందోళన మద్య ఒక పోలీస్ అధికారికి తలకు గాయం జరిగింది.  పోలీస్ వాళ్ళు రక్షణగా ఉండి  వైస్ ఛాన్సలర్ అక్కడనుండి తప్పించి, కొంత కాలం పాటు యూనివర్సిటీ కి దూరంగా ఉండాలి అని సలహా ఇచ్చినట్టు సమాచారం.

 

సంచార జాతుల సమ్మేళనం-నల్గొండ

Posted Posted in News

మన రాష్ట్రంలో ఎన్నో సంచార జాతులు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరికి తమ తమ విశిష్టత, గౌరవం, పురాణం కథలు, వైవిధ్యమైన జీవన విధానం ఉన్నాయి. ప్రస్తుతం మారుతున్న పరిస్తుతలకు అనుగుణంగా వారి జీవన శైలి లో మార్పు వస్తున్నపటికి వారు తమ మూలాలను సగర్వంగా సమాజానికి చాటి చెప్పడానికి ఎల్లపుడు ముందుగా ఉన్నారు.

ధర్మ జాగరణ సంస్థ ఆధ్యర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో 15-మార్చ్ -2016 నాడు సచార జాతుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రంలో బుడగ జంగాల,బాలసంతు,బుడబుక్కల,దాసరి, దొమ్మర,గంగిరెద్దుల,జోగి,కాటిపాపల,మేదరి, వంశరాజులు,వీరముష్టి,ఒడ్డెర,పూసల,తోలుబొమ్మల, ఎరుకల,డెక్కలి మొ,, 20కులాల నుండి 300మంది సమ్మేళనంలో పాల్గొని తమ కళలను ప్రదర్శించినారు.

ఈ సందర్బంగా పాల్గొన్న కళాకారులూ, మరియు వారి వారి కుల పెద్దలు సమాజం తమలను ఆదరించి తమ కళలను కాపుడుకుంటూ  ముందు తరాల వాళ్ళకు అందించే విధింగా సహాయపడాలి అని కోరుకున్నారు.

5

2

3

1