కరవును జయించిన కామేగౌడ

Posted Posted in Inspiration
మంచి ఆలోచన, నలుగురికి పనికివచ్చే పని చేయాలనే సంకల్పం ఉంటే ఎలాంటి కార్యాన్నైనా చేయవచ్చని నిరూపించాడు కర్ణాటకలోని మాండ్యకి చెందిన కామేగౌడ. 40 ఏళ్లపాటు అతను చేసిన కృషి వల్ల వర్షాలు లేనప్పుడు కూడా ఆ గ్రామంలో పుష్కలంగా నీరు లభిస్తోంది. ఇటీవల కామేగౌడ చనిపోయినా అతను చేసిన పని మాత్రం గుర్తుండిపోతుంది.
మాండ్య ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేక కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. భూగర్భజలాలు కూడా అడుగంటిపోయాయి. బోరుబావులు ఎండిపోయాయి. దీనితో ఉన్న కాస్త నీటిని రక్షించుకోవడం, జాగ్రత్తగా వాడుకోవడం ముఖ్యమైంది. దాసనదొడ్డి గ్రామానికి చెందిన కామేగౌడ ఆ పనికి పూనుకున్నాడు. ఆ ప్రాంతంలో చెట్లను, ప్రకృతి సిద్ధమైన నీటివనరులను పరిరక్షించడానికి నడుంబిగిం చాడు. ఎవరి సహాయం కోసం చూడకుండా స్వయంగా రంగంలోకి దిగాడు. కాలువలు తవ్వాడు, ఆనకట్టలు కట్టాడు. రోడ్లు, చెక్‌ డామ్‌లు నిర్మించాడు. కొండలపై నుంచి వచ్చే నీటిని తమ గ్రామాలవరకు వచ్చేట్లుగా ఏర్పాటు చేశాడు. 40 ఏళ్ల అతని కృషి వల్ల ఇప్పుడు అతని గ్రామంతోపాటు చుట్టుపక్క గ్రామాల్లో కూడా నీటికి లోటు లేదు. చుట్టూ కరవు పరిస్థితులు ఉన్నా ఈ గ్రామాల్లో పుష్కలంగా నీరు లభిస్తోంది.
ఎప్పుడు పాఠశాలకు వెళ్లని కామేగౌడ అద్భుతమైన జల వనరుల నిర్వహణ పద్దతులను అమలుచేసి చూపించాడు. కొండలపై నుంచి తన గ్రామమైన దాసనదొడ్డి వరకు అయిదుకు పైగా ఆనకట్టలు నిర్మించాడు. ఒక చెక్‌ డ్యామ్‌ నిండితే మరొక దానిలోనికి నీరు ప్రవహించే విధంగా ఏర్పాటు చేశాడు. 78 ఏళ్ల వయస్సులో మరో రెండు చెక్‌ డ్యామ్‌లు నిర్మించడానికి పూనుకున్నాడు. దానికి అవసరమైన డబ్బు కూడా స్వయంగా సమీకరించుకున్నాడు. తనకున్న మేకలు, గొర్రెలను అమ్మేయగా వచ్చిన 6 లక్షల రూపాయలు ఆ పనికి ఖర్చుపెట్టాడు. తనకు వచ్చే కొద్దిపాటి పెన్షన్‌ డబ్బు కూడా చాలాసార్లు అతను ఈ పనికే వినియోగించే వాడు. కోడలి పురిటికోసం పొదుపు చేసిన 20 వేల రూపాయలు కూడా ఖర్చుపెట్టి పుట్టిన పిల్లవాడు కృష్ణ పేరుతో ఒక చెక్‌ డ్యామ్‌ నిర్మించాడు. పురుడు సజావుగా జరిగింది కాబట్టి, డబ్బు ఖర్చు కాలేదు కాబట్టి తాను అలా చేశానని చెప్పాడు కామేగౌడ. కొండలపై మొక్కలు నాటడం కూడా అతను చేపట్టిన పనిలో భాగమే. సాధారణ మొక్కలతోపాటు అనేక మందు మొక్కలను కూడా నాటాడు. అంతేకాదు అటవీ శాఖ వారు నాటిన మొక్కలకు కూడా అతనే సంరక్షణ చేసేవాడు.
కామేగౌడ 40 ఏళ్లపాటు చేసిన కృషివల్ల నేడు మాండ్యలో అనేక గ్రామాలు నీటితో కళకళ లాడుతున్నాయి. కరవు బారినుండి శాశ్వతంగా బయటపడ్డాయి.

ప్రపంచం మరవలేని హైఫా యుద్ధం

Posted Posted in Inspiration
సెప్టెంబర్‌ 22,23, 1918న జరిగిన హైఫా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనది. స్వతంత్ర ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్‌పూర్‌ మహారాజా, మైసూర్‌ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయిల్‌ (వెస్ట్‌ బ్యాంక్‌)లో ప్రాణత్యాగం చేశారు. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సంయుక్త సేనను ఓడించి ఇజ్రాయిల్‌ రేవు పట్టణం హైఫాను సెప్టెంబర్‌, 1918లో విముక్తం చేశారు. ఇజ్రాయిల్‌ను అప్పట్లో పాలస్తీనాగా పిలిచేవారు. 1516 నుండి 402 ఏళ్ళపాటు ఇది టర్కీ ఒట్టమాన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.
ఈ యుద్ధం తరువాత బ్రిటిష్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సేనలతో కలిసి పోరాడిన భారతీయ సైనికులు మొత్తం ఇజ్రాయిల్‌ను విముక్తం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇజ్రాయిల్‌లో జరిగిన వివిధ పోరాటాల్లో 900 పైగా భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఇప్పటికీ వారి సమాధులను ఇజ్రాయిల్‌ ప్రభుత్వం పరిరక్షిస్తోంది. ప్రతి సంవత్సరం 23 సెప్టెంబర్‌ను భారతీయ సైనికుల స్మృతి దినంగా పాటిస్తారు. వారి బలిదానాల గురించి పాఠశాలల్లో పిల్లలకు చెపుతారు. పాఠ్య పుస్తకాల్లో కూడా వారి విజయగాథలు చేర్చారు. భారత సేనలకు నాయకత్వం వహించిన మేజర్‌ దలపత్‌సింగ్‌ షెకావత్‌ను ‘హైఫా హీరో’గా గుర్తిస్తారు. ఆ యుద్ధంలో ఆయన చనిపోయినప్పటికీ సైనికులు మాత్రం వెనకడుగువేయకుండా భారత్‌కు చిరస్మరణీయమైన కీర్తిని తెచ్చిపెట్టారు.
ప్రపంచ చరిత్రలో ఇది చాలా అరుదైన, చెప్పుకోదగిన యుద్ధంగా నిలిచిపోయింది. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సైన్యం తమ భూభాగంలో సురక్షితంగా ఉంది. ఆ సేన దగ్గర తుపాకులు, ఫిరంగులు మొదలైన ఆధునిక ఆయుధాలు కూడా ఉన్నాయి. మరోవైపు జోధ్‌పూర్‌, మైసూర్‌లనుండి వెళ్ళిన భారతీయ సైనికులు ప్రధానంగా అశ్వికులు. కొద్దిమంది సాధారణ కాలిబంటులు. వారి దగ్గర కత్తులు, బల్లాలు తప్ప ఆధునిక ఆయుధాలు లేవు. ఇలా కత్తులు, బల్లాలతో కొద్దిమంది సైనికులు ఆధునిక ఆయుధాలు కలిగిన అపారమైన సైన్యాన్ని ఓడించడం ప్రపంచ చరిత్రలో మరెక్కడా కనిపించదు. అలాగే ఇలాంటి యుద్ధం జరగడం కూడా ఇదే ఆఖరుసారి. కనుక ఇలాంటి అపూర్వమైన యుద్ధం ప్రతి భారతీయుడికి ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తుంది.
హైదరాబాద్‌ నిజాం కూడా బ్రిటిష్‌ సేనలకు సహాయంగా అశ్వికదళాన్ని పంపాడు. కానీ ఆ దళానికి యుద్ధంలో పట్టుకున్న శత్రుసైనికులను చూడటమే వారి పని. వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనలేదు.
హైఫా విజయం ప్రాముఖ్యత
హైఫా ఇజ్రాయిల్‌ నౌకా పట్టణం. క్రీ.శ 1516లో టర్క్‌ ఒట్టమాన్‌లు దీనిని ఆక్రమించి 402 ఏళ్ళపాటు తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. హైఫా లేకుండా, సరైన రోడ్డు మార్గాలు లేకుండా సైనిక దళాల కదలిక సాధ్యం కాదని బ్రిటిష్‌ అధికారులకు అర్థమైంది. అందుకనే 1918 సెప్టెంబర్‌ 22న బ్రిగెడియర్‌ జనరల్‌ కింగ్‌ యుద్ధశకటాలను తీసుకుని నజరత్‌ మార్గం గుండా హైఫా చేరుకోవాలని ప్రయత్నించాడు. కానీ పర్వత సానువుల నుండి టర్క్‌లు వారిపై గుళ్ళవర్షం కురిపించారు. దానితో బ్రిటిష్‌ సేనలు వెనక్కి తగ్గక తప్పలేదు.
భారతీయ సైనికుల ప్రతిస్పందన
జోధ్‌పూర్‌, మైసూర్‌ మహారాజాలు పంపిన రెండు అశ్వికదళాలలోని సైనికులకు ఇలా వెనక్కి తగ్గడం ఏమాత్రం నచ్చలేదు. అశ్వికదళాలకు నేతృత్వం వహిస్తున్న మేజర్‌ దలపత్‌ సింగ్‌ షెకావత్‌కు ఇది చాలా అవమానమనిపించింది. అయితే శత్రువులు సురక్షితమైన, కీలక ప్రదేశాలను ఆక్రమించుకుని ఉన్నారని, వారి వద్ద అధునాతన ఆయుధాలు కూడా ఉన్నాయని వీరికి నచ్చచెప్పాలని బ్రిటిష్‌ అధికారులు ప్రయత్నించారు. కానీ మహారాజా సైనిక దళాల పట్టుదలను చూసి ఎదురుదాడికి అనుమతిని ఇచ్చారు.
23 సెప్టెంబర్‌, 1918 – హైఫా యుద్ధం
ఇజ్రాయిల్‌ను విముక్తం చేయడంలో భారతీయ పరాక్రమం
జోధ్‌పూర్‌, మైసూర్‌ మహారాజాలు పంపిన అశ్వికదళంవద్ద కేవలం కత్తులు, బల్లాలు మాత్రమే ఉన్నాయి. అయినా వాటితోనే దళాలు 23 సెప్టెంబర్‌,1918 హైఫా పట్టణం వైపు సాగాయి. సైనికులు కిషోన్‌ నది, దాని కాలువల వెంబడి చిత్తడి నేలలో కార్మెల్‌ పర్వత సానువుల వెంబడి ముందుకు కదిలారు. ఇలాంటి ప్రదేశంలో అశ్వదళం కదలడమే చాలా కష్టం. వాళ్ళు దాదాపు 10 గంటలకు హైఫా పట్టణానికి చేరుకుంటున్నప్పుడు కార్మెల్‌ పర్వత సానువుల నుండి 77 ఎం.ఎం ఫిరంగులు ఒక్కసారి వారిపై విరుచుకుపడ్డాయి. హైఫా పట్టణంలోనేకాక చుట్టుపక్కల ప్రదేశాలలో కూడా టర్క్‌లు జర్మన్‌లు, ఆస్ట్రియా దళాలు సమకూర్చిన ఫిరంగులను మొహరించారు.
మైసూరు అశ్విక దళం (వీరితోపాటు షెర్‌వుడ్‌ దళం కూడా ఉంది) దక్షిణం వైపు నుంచి కార్మెల్‌ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించారు. శత్రువును ఆశ్చర్యపరుస్తూ ఆ దళం రెండు నావికాదళ ఫిరంగులను కూడా స్వాధీనం చేసుకుంది. అంతేకాదు శత్రువు కురిపిస్తున్న మిషన్‌గన్‌ కాల్పులకు ఎదురువెళ్ళారు.
అప్పుడే మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో జోధ్‌పూర్‌ అశ్వదళం బ్రిటిష్‌ సేనతోపాటు హైఫాను ముట్టడించింది. అన్ని వైపుల నుండి జరుగుతున్న మెషిన్‌గన్‌ కాల్పులను లెక్కచేయకుండా వాళ్ళు శత్రువుపై విరుచుకుపడ్డారు.
ఆ తరువాత ఒక గంట లోపు భారతీయ అశ్వసైనికులు ఒట్టమాన్‌ల నుండి హైఫాను స్వాధీనం చేసుకున్నారు. వారి స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశారు.
ఆనాటి భారతీయ దళాల యుద్ధనైపుణ్యం, పోరాట పటిమ గురించి ప్రపంచయుద్ధపు అధికారిక చరిత్ర – మిలటరీ ఆపరేషన్‌ ఇన్‌ ఈజిప్ట్‌లో (2వ సంపుటం) ఇలా వివరించారు – ”ఈ మొత్తం యుద్ధంలో భారత అశ్వదళం చూపిన పరాక్రమం మరెక్కడా కనిపించదు. మెషిన్‌గన్‌ కాల్పులు కూడా అశ్వదళపు మెరుపుదాడిని అడ్డుకోలేకపోయాయి. కాల్పులకు ఎదురొడ్డి గుర్రాలను నడపడం మరెక్కడా చూడం. యుద్ధం తరువాత చాలా గుర్రాలు చని పోయాయి.” ఇలా ముందుకురికిన అశ్వదళం ఒక దుర్భేద్యమైన పట్టణాన్ని సైతం స్వాధీన పరచు కోవడం మిలటరీ చరిత్రలో మరెక్కడా కనిపించదు.

హైఫా హీరో మేజర్‌ ఠాకూర్‌ దలపత్‌ సింగ్‌కు నివాళి
మేజర్‌ షెకావత్‌ సాధించిన అపూర్వమైన విజయానికిగాను బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనకు అత్యుత్తమ సైనిక పురస్కారం ‘మిలటరీ క్రాస్‌’ను (ఇప్పటి పరమవీర చక్రకు సమానం) ఇచ్చింది. దలపత్‌ సింగ్‌ స్మృత్యర్థం మేవార్‌ ప్రభుత్వం ప్రతాప్‌ పాఠశాల ఆవరణలో ‘దలపత్‌ స్మృతి మందిరం’ నిర్మించింది. మహారాజా ఉమేద్‌ సింగ్‌ ప్రత్యేక వెండి నాణాలు విడుదల చేయించారు. అవి ఇప్పటికీ జోధ్‌పూర్‌ 61 అశ్వదళ కేంద్రంలో ఉన్నాయి.
ఇతర హైఫా యుద్ధవీరులు
కెప్టెన్‌ అనూప్‌ సింగ్‌, సెకెండ్‌ లెఫ్టినెంట్‌ సాగత్‌ సింగ్‌ లకు కూడా మిలటరీ క్రాస్‌ లభించింది. కెప్టెన్‌ బహదూర్‌ అమన్‌సింగ్‌ జోధా, దఫాదార్‌ జోర్‌ సింగ్‌లకు ఇండియన్‌ ఆర్టర్‌ ఆఫ్‌ మెరిట్‌ లభించింది. బ్రిటిష్‌ రాణి భారతీయ సైనికులకు ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం మిలటరీ క్రాస్‌. ఇది ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న పరమ్‌ వీర్‌ చక్ర వంటిది.

‘యజ్ఞన్న’ చేసిన సమాజ యజ్ఞం

Posted Posted in Inspiration

‘యజ్ఞన్న’ చేసిన సమాజ యజ్ఞం

కర్నూల్ – శ్రీశైలం రహదారిలో వచ్చే ఆత్మకూరు అనే గ్రామం లో 1934 మే 1 న శ్రీ యమ్. డి. వై. రామమూర్తి గారు జన్మించారు. తల్లితండ్రులు మేడూరి దీక్షితుల రామయ్య, శ్రీమతి మేడూరి సుబ్బమ్మ. ఆత్మకూరులోని ‘శేతురావు బడి’ అనే ప్రైవేటు స్కూల్ లో విద్యాభ్యాసం మొదలైంది. 10 వ తరగతి కర్నూల్ లోని మునిసిపల్ హై స్కూల్ లోనూ, ఇంటర్మీడియట్ కర్నూల్ ఉస్మానియా కళాశాల లోనూ, న్యాయవాద కోర్స్ బెళగావి లోనూ పూర్తి చేశారు. ఇంట్లో ఆయనను ‘యజ్ఞన్న’ అని పిలిచేవారు. ఆయన పూర్తి పేరు మేడూరి దీక్షితుల యజ్ఞ రామమూర్తి.

కర్నూల్ లో చదివేటప్పుడే సంఘ పరిచయమయ్యింది. ఆర్ యస్ యస్ లో ఎక్కువగా తిరుగుతున్నాడని ఆయనని బెళగావి పంపడం జరిగింది. అక్కడ నిక్కరు వేసుకొని రోజు సంఘ శాఖకి వెళ్ళేవారు. అక్కడ అప్పటి కర్ణాటక ప్రాంత సంఘ చాలక్ శ్రీ అప్పా సాహెబ్ గారితో పరిచయం ఏర్పడింది.

1951 లో నాగపూరు లో జరిగే నెలరోజుల  OTC కి వెళ్ళాలని రామమూర్తి గారు భావించారు. వర్గ శుల్కం 75 రూపాయలు ఇవ్వమని తండ్రి గారిని అడిగారు. వారేమో డబ్బు లేదంటే లేదన్నారు. అంతలో రామమూర్తి గారికి ఎయిర్ ఫోర్సు గ్రౌండ్ టెక్నీషియన్  పోస్ట్ కి  ఇంటర్వ్యూ కి రమ్మని కార్డు వచ్చింది. అది ఆయన తండ్రి చూసి,’ మిలిటరీ ఉద్యోగానికి అప్లికేషను ఎందుకు పెట్టావు?’ అని నిలదీశారు. ‘మనకి మిలిటరీ ఉద్యోగాలు ఎందుకు నాయనా’ అని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. దాంతో రామమూర్తి గారు ‘నన్ను సంఘ్ శిక్షా వర్గ కన్నా పంపండి, లేకపోతే మిలిటరీ ఉద్యోగానికైన పోనివ్వండి’ అని బెదిరించారు. దాంతో ఆయన తండ్రి OTC కి పంపడం పైన మొగ్గు చూపి డబ్బిచ్చారు.

బెళగావిలో చదివే రోజుల్లో నెలవారీ ఖర్చుల వివరాలు వ్రాసి, అందులో శాంతకు 25 రూపాయలు, లక్ష్మి కి 20 రూపాయలు అని వ్రాసి తండ్రి గారికి పంపేవారట రామమూర్తి గారు. దాంతో ఆయనకంగారు పడిపోయి  ‘ఈ శాంత, లక్ష్మి ఎవరురా’ అని నిలదీశారుట. వారిని కాస్త ఉడికిద్దామని ‘వాళ్ళు అమ్మయిలు లే’ అని చెప్పడం తో ‘ఈ ఆడపిల్లల సావాసాలేమిట్రా? వాళ్ళతో నీకేంపని’ అని ఆయన తాపత్రయ పడ్డారు. అప్పుడు రామమూర్తి గారు శాంత అంటే శాంత నివాస్ హోటల్, లక్ష్మి అంటే లక్ష్మి బిల్డింగ్ అని వాస్తవం బయట పెట్టారట. దాంతో ఆయన తండ్రి కాస్త స్థిమితపడి నవ్వుతూ ‘భడవా! ఎంత భయపెట్టావురా’ అని తేలిక పడ్డారట. ఇలా ఉండేది రామమూర్తి గారి హాస్య ప్రవృత్తి.

బెళగావి లో న్యాయవాద కోర్స్ (1951-53) ను పూర్తి చేసుకున్నారాయన. 1954 లో తమ 20వ ఏట ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ అడ్వకేట్ గా గుంటూరులో  నమోదు (enroll) చేసుకొన్నారు. 1956 లో హై కోర్ట్ ప్రాక్టీసు చెయ్యటానికి హైదరాబాద్ వెళ్ళినా, ఇంట్లో పరిస్థితుల కారణంగా 1960 లో తిరిగి కర్నూల్ వచ్చేశారు. అప్పటి నుండి దాదాపు 56 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తి లో కొనసాగారు. ఒకసారి ఆయన వృత్తి జీవితంలో ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. కంపమళ్ళ సుబ్బరామయ్య అనే వ్యక్తికి చెందిన కేసు ఒకటి కోర్టులో ఉంది. సుబ్బరామయ్య తరఫున రామమూర్తి గారి అన్న దీక్షితులు ఆకేసును చూస్తుండేవారు. వారి మరణం తర్వాత ఈయనకు వారసత్వంగా వచ్చిన కేసులలో అదొకటి. కానీ ఆకేసులో ఒక చమత్కారముంది. ప్రతివాదుల్లో ఒకరు శ్రీ జీ.వి. శేషఫణి గారి తమ్ముడు. శ్రీ శేషఫణి గారు సంఘ్ లో ప్రముఖ కార్యకర్త. రామమూర్తి గారికి చాలాకాలంగా ఆప్త మిత్రుడు. దానికి తోడు ఆ దస్త్రాలలో సంతకం చేసినవారు శ్రీ రాధాకృష్ణయ్య అనే సంఘ్ ప్రచారక్. రామమూర్తి గారు ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. ఇది చాలా సున్నిత విషయం. అందువల్ల మరొక లాయర్ ని చూసుకోమని సుబ్బరామయ్య కు సూచించారు. ఆయనేమో ఒప్పుకోలేదు.  ఇక్కడ మరొక తమాషా ఏమంటే, సంఘ కార్యం దృష్ట్యా రామమూర్తి గారు నంద్యాలకు వెళ్ళినప్పుడల్లా శ్రీ జి.వి. శేష ఫణి గారింట్లో దిగడం, భోజనం చేయడం. కర్నూలులో మాత్రం వారికి వ్యతిరేకంగా వాదించడం. అదృష్టవశాత్తు ఆ కేసుకు కోర్ట్ బయటే రాజీ పరిష్కారం లభించడంతో రామమూర్తి గారి నెత్తిన పాలు పోసినట్లయింది.

కోర్ట్ లో వ్యవహారాలు ఎలా సాగుతున్నా సంఘ తో అనుబంధం మాత్రం పెరుగుతూనే ఉంది. 1950 లో నెల్లూరులో ప్రథమ వర్ష, 1951 లో నాగపూర్ లో ద్వితీయ వర్ష పూర్తి చేశారాయన. 1984 లో తృతీయ వర్ష కు వెళ్లివచ్చారు.

1975 లో దేశం లో అత్యవసర పరిస్థితి విధించబడింది. రామమూర్తి గారిని అరెస్ట్ చేసి హైదరాబాదు లోని ముషీరాబాద్ జైలుకు తరలించారు. ఒక్కసారి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారాయన్ని. చుట్టూ బందోబస్త్  ఉంది. ఉన్నట్లుండి ఒక చేయి ఆయన వీపుని చరిచింది. “ఏం రామమూర్తి బాగున్నావా?” తో పరామర్శ విన్పించింది. ఆ చేయి ఆయన వీపుని తాకడం ఆలస్యం కాపలాగా ఉన్న సెక్యూరిటీ అదే విసురుగా  ఆ చేయి విసిరి వేయడం రెప్పపాటులో జరిగాయి. వెనక్కి తిరిగి చూస్తే అ వ్యక్తి దామోదరం మునిస్వామి. మాజీ ముఖ్య మంత్రి దామోదరం సంజీవయ్య సోదరుని కుమారుడు. అప్పటి రాష్ట్ర మంత్రి వర్గం లో సభ్యుడు. ఆయనతో “చూశావా మునుస్వామి! నువ్వు మంత్రి అయినా నా పాటి రక్షణ నీకు లేదు. నాపై  ఈగ కూడా వాలనివ్వాదు మీ కాంగ్రెస్ ప్రభుత్వo.” అంటూ పరాచికాలాడారట రామమూర్తి గారు.

రామమూర్తి గారు సంఘ పని చేస్తూనే వివిధ రంగాలలో పనులకూ ప్రాధాన్యమిచ్చారు. కర్నూలులోని సంస్కృత పాఠశాలను తమ నిర్వహణం లోకి తీసుకొని, దానిని హైస్కూల్ స్థాయికి పెంచారాయన. అదే నేటి వివేకానంద సంస్కృత పాఠశాల. అఖిల భారతీయ కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రానికి కార్యదర్శిగా బాధ్యత స్వీకరించి దానిలో జరిగిన అవకతవకలను సరిదిద్ది, సరైన దారికి తీసుకొచ్చారు. కర్నూల్ లో శంకర మందిర నిర్వహణ బాధ్యతను స్వీకరించారు. కర్నూలులో అరక్షిత శిశు మందిరం ప్రారంభింప చేశారు.

ఇలా 83 ఏళ్ల వ్యక్తిగత జీవితం లో 72 సంవత్సరాలు సంఘ్ తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తి శ్రీ యమ్.డి.వై. రామమూర్తి గారు. చివరి దశలో అనంతపురం విభాగ్  (అనంతపురం, కర్నూల్, కడప జిల్లాలు) కు విభాగ్ సంఘ్ చాలక్ గా మార్గదర్శనం చేశారు.

ఒక వ్యక్తిగా శ్రీ రామమూర్తి గారి గురించి ఎంత చెప్పినా, అయన శ్రీమతి రామలక్ష్మి గారి ప్రస్తావన లేకపోతే ఆయన సంఘ జీవితానికి నిండుదనం రాదు.

అత్యవసర పరిస్థితి సమయములో ఆయన ఇంటిపై పోలీసుల నిఘా వుండేది. అప్పటి కర్నూల్ జిల్లా ప్రచారక్ శ్రీ వై. రాఘవులు అజ్ఞాతం లో ఉంటూ సంఘ్ కార్యకలాపాలను సమన్వయ పరిచేవారు. ఒక రోజు  పోలీసులు వారింట్లో ఉండగానే రాఘవులు గారు ఇంట్లోకి రాబోతున్నారు. పరిస్థితిని గమనించిన శ్రీమతి రామలక్ష్మి గారు “ఏరా రాముడు! మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తేవడానికి ఇంతసేపా? ఈమధ్య నీకు మాంద్యం చాలా  ఎక్కువైంది వెధవా! ఆ సంచి అక్కడ పెట్టి, తిరిగి రా. వెనుక తలుపు దగ్గర టిఫినుంది. తిని తగలడు!” అని గట్టిగా చీవాట్లు పెట్టింది.

రాఘవులు గారు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎపుడూ మర్యాదగా ఏమండీ రాఘవులు గారూ అంటూ మర్యాదగా సంబోధించే అమ్మగారు ఎందుకింత దురుసుగా మాట్లాడారో అర్థం చేసుకుని, అలాగేనంటూ చల్లగా జారుకున్నారు. అరెష్ట్ తప్పించుకున్నారు.

శ్రీ రామమూర్తి గారి కుటుంబ సభ్యులంతా సంఘ్, సేవికా సమితి కార్యకర్తలే. మొత్తం కుటుంబాన్ని కార్యకర్తలుగా తయారు చేసిన రామమూర్తి గారు 2018 సెప్టెంబర్ 13 రాత్రి 8 గంటలకు స్వర్గస్తులయ్యారు. వారి మృతికి సమాచార భారతి సంతాపం తెలుపుతోంది.