ఉపగ్రహ విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం

FacebookTwitter

గగనతలంలో సంచరిస్తున్న ఉపగ్రహాన్ని భారత్‌ బుధవారం నేలకూల్చివేసింది. తద్వారా ఈ రకమైన సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం మన వద్ద ఉందని భారత్ ప్రపంచానికి చాటిచెప్పింది. బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో భారత ప్రధాని మోడీ ఈ విషయాన్ని ప్రజలకు వెల్లడించారు. అమెరికా, రష్యా, చైనా దేశాల తర్వాత ఈ టెక్నాలజీ సొంతం చేసుకున్న నాలుగో దేశంగా భారత్‌ అవతరించిందన్నారు. ఆపరేషన్‌ ‘మిషన్‌ శక్తి’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలో.. స్వదేశీ పరిజ్ఞానంతో భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (యాంటీ శాటిలైట్‌) ఏ-శాట్‌ ను ఉపయోగించారు. ఇది కేవలం మూడు నిమిషాల్లో నేల నుంచి నింగిలోకి దాదాపు 300 కిలోమీటర్ల ఎత్తు వరకూ దూసుకెళ్లి, కచ్చితత్వంతో నిర్దేశిత ఉపగ్రహాన్ని ఛేదించింది. ఈ పరీక్ష దేశానికి కొత్త బలాన్ని ఇచ్చిందని మోడీ తెలిపారు.

ఏ-శాట్ గురించి మరిన్ని వివరాలు క్లుప్తంగా:

– ఏ-శాట్ పరీక్ష విజయవంతం కావడంతో అంతరిక్ష సైనిక శక్తులుగా పరిగణింపబడుతున్న అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్ నిలిచింది.
– ఈ ప్రయోగానికి అమెరికా సుమారు లక్ష కోట్ల రూపాయలు (భారత కరెన్సీ రూపంలో) ఖర్చు చేయగా భారత్ కేవలం 8వేల కోట్ల రూపాయల ఖర్చుతోనే ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
– అమెరికా, చైనా దేశాలు సుమారు 4-5 సార్లు ఈ ప్రయోగాన్ని చేసి ఆఖరిసారి విజయం సాధించగా భారత మాత్రం తొలి ప్రయత్నంలోనే విజయాన్నందుకుంది.
– వ్యూహాత్మక రక్షణ అవసరాల కోసం, అక్రమంగా గగనతలంలో తిరిగే శత్రు ఉపగ్రహాల ధ్వంసం వంటి అవసరాల కొరకు దీన్ని ఉపయోగిస్తారు.
– ఈ శాటిలైట్ పరీక్ష కోసం డిఆర్డీవో శాస్త్రవేత్తలు భారత దిగువ భూభాగంలో సంచరిస్తున్న ఉపయోగం లేని సొంత ఉపగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు.
– ఈ తరహా సామర్థ్యాన్ని 2012లోనే భారత్‌ సమకూర్చుకున్నప్పటికీ ఈ పరీక్ష కోసం అప్పట్లో రాజకీయ నాయకత్వం నుంచి అనుమతి రాలేదని డీఆర్‌డీవో మాజీ అధిపతి వి.కె.సారస్వత్‌ పేర్కొన్నారు.
– ఆపరేషన్‌ శక్తి పేరుతో భారత్‌ చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక ప్రాజెక్ట్‌ విజయవంతం కావడంవెనుక హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) కీలకపాత్ర పోషించింది.
– శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చే క్షిపణి సాంకేతికతను శాస్త్రవేత్తలు ఇక్కడ అభివృద్ధి చేశారు.
– 70 మంది శాస్త్రవేత్తలు దాదాపు రెండేళ్ల పాటూ ఈ ప్రాజెక్ట్‌పై పనిచేశారు.
– అత్యంత రహస్యంగా, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు డీఆర్‌డీవో ఛైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి నాయకత్వం వహించారు.
– ఏ శాట్‌ను భూ ఉపరితలంపై నుంచి కానీ, యుద్ధ విమానాల నుంచి కానీ ప్రయోగించే అవకాశం ఉంది.
– దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపగ్రహాలను పేల్చివేసే సామర్థ్యం ఏ-శాట్ కు ఉంది.

FacebookTwitter