విస్తరిస్తున్న విష’వల’యం

FacebookTwitter

సాధారణ ప్రజలు సందేశాలు పంపడానికి, సంభాషించడానికి, మల్టీమీడియా వాడకానికి ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్‌లను వాడతారు. ఉగ్రవాదులు తమ సందేశాలను నిగూఢంగా (ఎన్‌క్రిప్షన్‌) పంపడానికి ష్యూర్‌స్పాట్‌, టెలెగ్రామ్‌ వంటి మెసేజింగ్‌ యాప్స్‌ అమర్చిన స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు. తమ సభ్యులు గుప్త వ్యవహారాలు నిర్వహించడానికి వీలుగా ఐసిస్‌ మార్గదర్శక నియమావళిని విడుదల చేసింది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల వినియోగం, పాస్‌వర్డ్‌లు, యాప్‌ల డౌన్‌లోడ్‌కు తీసుకోవలసిన జాగ్రత్తలు అందులో ఉన్నాయి. వాట్సాప్‌, టెలెగ్రామ్‌, జెలో వంటి ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ సర్వీసుల వినియోగంలో ఐసిస్‌ దళాలు ఆరితేరాయి. ఈ కార్యకలాపాలను ఐసిస్‌ హ్యాకర్‌ విభాగమైన సైబర్‌ ఖిలాఫత్‌ పకడ్బందీగా నిర్వహిస్తోంది.

పారిస్‌, బ్రసెల్స్‌, ఓర్లాండో, ఇస్తాంబుల్‌, ఢాకా, బాగ్దాద్‌… ఈ నగరాలలో ఇస్లామిక్‌ ఉగ్రవాదుల కాల్పులు, పేలుళ్లు, వూచకోతలు ప్రపంచాన్ని కుదిపేశాయి. బాగ్దాద్‌ మినహా ఇతరచోట్ల ఘాతుకాలకు పాల్పడినది పశ్చిమాసియా నుంచి దిగివచ్చిన ఉగ్రవాదులు కారు – స్థానిక ముస్లిం యువకులే. ఖలీఫా రాజ్య స్థాపనకు ఐ.ఎస్‌.ఐ.ఎస్‌ (ఐసిస్‌) వాస్తవ లోకంలోనే కాక సైబర్‌ సీమలోనూ జిహాద్‌ మొదలుపెట్టింది. వివిధ దేశాల ముస్లిం యువతను ఆకర్షించి, దాడులకు పురమాయించడానికి ఇంటర్నెట్‌నూ, సోషల్‌మీడియానూ ఉపయోగించుకుంటోంది. సిరియాలోని ఐసిస్‌ నాయకత్వంతో హైదరాబాదీ యువకులు సోషల్‌మీడియా, టెలిఫోన్‌లలో జరిపిన సంభాషణలపై నిఘావేయడం ద్వారానే భాగ్యనగరంలో మారణహోమాన్ని నివారించగలిగారు. ఇరాక్‌, సిరియాలలో భూతలయుద్ధంలో చావుదెబ్బ తింటున్న ఐసిస్‌ సైబర్‌ సీమలో కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. 2014లో ఇరాక్‌లో మూడోవంతు భూభాగాన్ని గుప్పిట్లోకి తెచ్చుకున్న ఐసిస్‌ నేడు 14 శాతం భూభాగానికే పరిమితమైపోయింది. అందుకే ‘మీరు ఇరాక్‌, సిరియాలకు వచ్చి మాతో భుజం కలిపి పోరాడటంకన్నా శత్రుభూమిలో ఉండి ఏ చిన్న దాడి జరిపినా మన పోరాటానికి ఎంతో ఎక్కువ మేలు జరుగుతుంది’ అని ఐసిస్‌ అధికార ప్రతినిధి అబూ మహమ్మద్‌ అల్‌అద్నానీ ఇటీవల ప్రకటించారు. అతని పిలుపు ప్రకారమే ఇస్లామిక్‌ ఉగ్రవాదులు అమెరికా, ఐరోపా, ఆసియాలలో చెలరేగిపోతున్నారు. అంతర్జాలం ఆవిర్భావానికి ముందు తమ భావజాలాన్ని గుట్టుగా ప్రచారం చేసుకున్న ఉగ్రవాదులు, నేడు సోషల్‌మీడియాను విరివిగా ఉపయోగించుకుంటున్నారు.

దాదాపు అందరి చేతిలో అంతర్జాలంతో అనుసంధానమైన స్మార్ట్‌ఫోన్‌ ఉండటం ఐసిస్‌కు కలసివచ్చింది. చరిత్రలో మునుపెన్నడూ ఉగ్రవాదులకు ఇంతటి ప్రచార సౌలభ్యం ఉండేది కాదు. ఐసిస్‌ డిజిటల్‌ ప్రచారంతో ప్రభావితులైన 30,000 మంది ముస్లిం యువకులు వివిధ దేశాల నుంచి తరలివచ్చి సిరియా, ఇరాక్‌లలోని జిహాదీ సేనలో చేరిపోయారు. అక్కడ గట్టి ఎదురుదెబ్బలు తింటున్న ఐసిస్‌, ఇక నుంచి ఎక్కడివారు అక్కడే ఉండి రక్తపాతం సృష్టించాలని సామాజిక మాధ్యమాల్లో నూరిపోస్తోంది.

‘బ్రాండ్‌’గా మారిన తీరు
ఖాతాదారులను ఆకర్షించడానికి బడా కంపెనీలు, సమాచార సాధనాలు, మార్కెటింగ్‌ సంస్థలు అంతర్జాలంలో ప్రయోగించే చిట్కాలనే ఐసిస్‌ కూడా పాటిస్తూ వర్చువల్‌ ఖలీఫా రాజ్యంగా రూపాంతరం చెందుతోంది. కంపెనీలు ఆకర్షణీయ వాణిజ్య ప్రకటనలనూ, రకరకాల సందేశాలను పోస్ట్‌ చేసినట్లే, ఐసిస్‌ కూడా రోజుకు 38 కొత్త అంశాలను అంతర్జాలంలో విడుదల చేస్తోంది. వీటిలో 20 నిమిషాల వీడియోలు మొదలుకొని పూర్తి నిడివి డాక్యుమెంటరీలు, ఛాయాచిత్ర వార్తా కథనాలు, ఆడియోక్లిప్పులు, పలు ప్రపంచ భాషలలో కరపత్రాలు ఉంటాయి. వీటితోపాటు ఐఎస్‌ పోరాటాల వీడియోలను దాని మీడియా విభాగమైన అల్‌ పుర్కాన్‌ సైబర్‌ సీమలోకి వదులుతోంది. 2014 మే నెలలో విడుదలైన ఒక వీడియో ఇరాకీ పోలీసులను ఐసిస్‌ మృత్యు దళాలు వేటాడి చంపుతున్న దృశ్యాలను చూపింది. కొందరు ఇరాకీ పోలీసులు ప్రాణాలకోసం వేడుకోవడం అందులో కనిపించింది. స్మార్ట్‌ ఫోన్లలో, నెట్‌లో ఈ వీడియోలను చూసిన ఇరాకీ సైనికులు, పోలీసులు ఐసిస్‌ దళాలు వస్తున్నాయనగానే ఆయుధాలు అవతలపారేసి పరారైన ఉదంతాలున్నాయి. అయితే ఐసిస్‌ ప్రసారం చేస్తున్న వీడియోలలో చాలా కొద్దిభాగమే ఇంత కిరాతకంగా ఉంటాయి.

మిగతా వీడియోలలో ఐసిస్‌ ఆక్రమిత భూభాగంలో జరిగే నిర్మాణ కార్యక్రమాలను, ఆర్థికాభివృద్ధినీ చూపుతున్నారు. ఖలీఫా రాజ్యం కేవలం ఒక భావన కాదనీ, అది నిజంగానే సాకారమై విస్తరిస్తోందని దేశదేశాల్లోని ముస్లింలకు భరోసా ఇవ్వడం ఈ డిజిటల్‌ ప్రచార లక్ష్యం. తమ దేశాల్లో స్థితిగతులపై అసంతృప్తి చెందిన ముస్లిం యువకులు ఐసిస్‌లో చేరేలా ఈ ప్రచారం ప్రేరేపిస్తోంది. వారి ఆగ్రహావేశాల వ్యక్తీకరణకు ఐసిస్‌ సోషల్‌మీడియా వేదిక కల్పిస్తోంది. ఐసిస్‌ రకరకాల భాషల్లో ప్రచారం చేస్తున్నందువల్ల విధ్వంస మనస్కులు తమబోటివారితో గూడుపుఠాణీ చేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతోంది.

డార్క్‌వెబ్‌ ద్వారా ధ్వంసరచన
వివిధ దేశాల్లో దాడులు జరిపించడానికి ఐసిస్‌ డార్క్‌ వెబ్‌నూ వినియోగిస్తోంది. అందుకే పారిస్‌, బ్రస్సెల్స్‌ పోలీసులు ఈ దాడులను ముందుగానే పసిగట్టలేకపోయారు. సాధారణ ఇంటర్నెట్‌కన్నా వందలు, వేల రెట్ల సమాచారం డార్క్‌వెబ్‌లో ఉంటుంది. కానీ, ఈ గుప్త సమాచార యంత్రాంగం గూగుల్‌ సెర్చ్‌ వంటి సార్వత్రిక శోధన సాధనాలకు అందదు. టోర్‌ బ్రౌజర్‌వంటి సాధనాలను వాడవలసిందే. అంతర్జాలానికి వెలుపలి యంత్రాంగాల ద్వారా పనిచేసే డార్క్‌వెబ్‌ను ఉగ్రవాదులు, సంఘటిత నేరగాళ్ల ముఠాలు ఉపయోగిస్తుంటాయి. రహస్య సమాచార ప్రసారం, బిట్‌ కాయిన్‌వంటి నిగూఢ కరెన్సీలో విరాళాల సేకరణ, బిల్లుల చెల్లింపులు డార్క్‌ వెబ్‌లో జరుగుతున్నాయి. అంతేకాదు, మాదకద్రవ్యాలు, ఆయుధాలు, అశ్లీల వీడియోలు, కంప్యూటర్‌ మాల్‌వేర్‌ వంటి నిషిద్ధ వస్తువుల క్రయవిక్రయాలకు డార్క్‌వెబ్‌ రహస్య బజారుగా ఆవిర్భవించింది.

అమెరికా గూఢచారి సంస్థ (సీఐఏ), ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బిఐ)లు నిత్యం ఐసిస్‌ నాయకులు, కార్యకర్తల ఫోన్లు, ఐపీ చిరునామాలపై నిఘా వేస్తున్నాయి. వారి ప్రపంచవ్యాప్త సంభాషణలు, సందేశాలను ఆలకించడానికి అన్ని భాషల నిపుణులను నియోగించాయి. భారత ఉపఖండంలో ఐసిస్‌, దాని సానుభూతిపరుల కార్యకలాపాల గురించి భారత భద్రతాధికారులకు సీఐఏ ఎప్పటికప్పుడు ఉప్పందిస్తోంది. ఆ సమాచారమే ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా 20 మంది ఐసిస్‌ కార్యకర్తల అరెస్టుకు దారితీసింది. కానీ, ఇల్లలకగానే పండగ కాదని గుర్తుంచుకోవాలి. 16-30 ఏళ్ల భారతీయ ముస్లిం యువకులలో ఐసిస్‌పట్ల కుతూహలం పెరుగుతోందని గత ఏడాది ఒక ఇంటెలిజెన్స్‌ సంస్థ సర్వేలో తేలింది. ఈ యువకులు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, గూగుల్‌లలో చూస్తున్న అంశాలు, జరుపుతున్న కార్యకలాపాలనుబట్టి సదరు నిర్ధారణకు వచ్చింది. ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు వంటి ఐటీ నగరాలతోపాటు చింఛ్వాడ్‌, హౌడా, శ్రీనగర్‌, గువహటి వంటి చిన్న పట్టణాల్లోనూ ముస్లిం యువతీ యువకులు ఐసిస్‌ కార్యకలాపాలపట్ల ఆసక్తి చూపుతున్నారు. సోషల్‌ మీడియాలో ఐసిస్‌ సంబంధ కార్యకలాపాలు జరుగుతున్న రాష్ట్రాలలో మొదటి స్థానం జమ్మూకశ్మీర్‌దే. తదుపరి స్థానాలను అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బంగ ఆక్రమిస్తున్నాయి. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే ఐసిస్‌ను అంతర్జాలం, సోషల్‌మీడియాల నుంచి తరిమేయాలని గూగుల్‌ ఐడియాస్‌ విభాగ డైరెక్టర్‌ జారెడ్‌ కోహెన్‌ సూచించారు. అది పూర్తిస్థాయిలో సాధ్యపడుతుందా అంటే అనుమానమే. దీనికన్నా ఐసిస్‌ తన యంత్రాంగాలను తానే నమ్మలేని స్థితి కల్పించడం భేషని అమెరికా భావిస్తోంది. ఐసిస్‌ ఆన్‌లైన్‌ యంత్రాంగాన్ని ఓవర్‌లోడ్‌ చేసి స్తంభింపజేయాలనుకొంటున్నామని అమెరికా రక్షణ మంత్రి ఏష్టన్‌ కార్టర్‌ చెప్పారు. దీనివల్ల ఐసిస్‌ తన దళాలకు ఆదేశాలు జారీచేయడం, వారి నుంచి సమాచారం అందుకోవడం, జనాన్ని విధ్వంసకాండకు పురిగొల్పడం అసాధ్యమవుతుంది. ఇలా అంతర్జాలంలో ఐసిస్‌కు చెక్‌ పెట్టాలని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తమ సైన్యంలోని సైబర్‌ కమాండ్‌ను ఆదేశించారు. 5,000 మంది నిపుణులున్న ఈ విభాగం ఐసిస్‌ కమ్యూనికేషన్లను విచ్ఛిన్నం చేస్తుంది. దాని నెట్‌వర్క్‌లను స్తంభింపజేస్తుంది.

ఐసిస్‌ నెట్‌వర్క్‌లో గుప్త మాల్‌వేర్‌లను ప్రవేశపెట్టి దాని నాయకుల ఆన్‌లైన్‌ అలవాట్లను పసిగట్టడం, వారి సందేశాలను, ఆదేశాలను మార్చి ఉగ్రవాదులను తప్పుదోవ పట్టించి హతమార్చడం, ఎలక్ట్రానిక్‌ నగదు బదిలీని, చెల్లింపులను దారిమళ్లించడం వంటి ఎత్తుగడలతో ఐసిస్‌ను చావుదెబ్బ తీయడానికి అమెరికా సైబర్‌ సేన నడుంకట్టింది. దీనితోపాటు ఐసిస్‌ ఘాతుకాలను, ఇస్లాం సూత్రాల వక్రీకరణను సహించలేక బయటకువచ్చిన మాజీ ఉగ్రవాదుల సాక్ష్యాలకు ఆన్‌లైన్‌లో విస్తృత ప్రచారం కల్పించదలిచారు. ఐసిస్‌ ఖలీఫా రాజ్యాన్ని భూతల స్వర్గంగా ప్రచారం చేస్తోంది. కానీ, దాని అధీనంలోని భూమిలో ఎంతటి అకృత్యాలు జరుగుతున్నాయో బయటి ప్రపంచానికి ఆన్‌లైన్‌లో తెలియజెప్పాలి.

ఎదురుదాడి
ఐసిస్‌ అనుయాయుల ఆట కట్టించడానికి భారతదేశమూ సైబర్‌ సీమను ఉపయోగించుకుంటోంది. హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన అబ్దుల్‌ బాసిత్‌ బృందం కార్యకలాపాల గురించి ఆప్తమిత్రులకూ తెలియకపోయినా వారిని కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు పట్టేశాయంటే కారణం- ఆన్‌లైన్‌ నిఘాయే. 2011లో హ్యాకింగ్‌ టీమ్‌ అనే ఇటాలియన్‌ సంస్థ నుంచి ప్రత్యేక ఎలక్ట్రానిక్‌ నిఘా హార్డ్‌వేర్‌ను నగర పోలీసులు కొనుగోలు చేశారని వికీలీక్స్‌ తెలిపింది. బహుశా దీని సాయంతో ఐసిస్‌ సానుభూతిపరుల కుట్రను ఛేదించి ఉండవచ్చు. ఈ తరహా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టడానికి జాతీయ సైబర్‌ భద్రతా వ్యవస్థను ఏర్పరచాలి. అధిక జీతభత్యాలు, ఇతర సౌకర్యాలను ఇచ్చి మెరికల్లాంటి ఐటీ నిపుణులను సైబర్‌ సేనలోకి ఆకర్షించాలి. శత్రువుల డిజిటల్‌ నెట్‌వర్కులలోకి చొరబడి వాటిని తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడానికి, అవసరమైతే విచ్ఛిన్నం చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ (మాల్‌వేర్‌)ను రూపొందించాలి. షాపింగ్‌ మాల్స్‌, రద్దీగా ఉండే ఇతర ప్రాంతాల్లో నియోగిస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు, బీట్‌ కానిస్టేబుళ్లకు బాంబులను పసిగట్టడంలో, ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో శిక్షణ ఇవ్వాలి. జనసమ్మర్ద ప్రాంతాల్లో పహరాకు సాయుధ మాజీ సైనికోద్యోగులను నియమించాలి. ఉగ్రవాద దాడి జరిగినప్పుడు శీఘ్ర స్పందన దళాలను రంగంలోకి దించాలి. ఒక్క మాటలో భూతల, సైబర్‌ తలాల్లో ఉగ్రవాదులను వేటాడి వెంటాడి నిర్మూలించాలి!

– ఆర్య
–ఈనాడు సౌజన్యం తో

 

FacebookTwitter