మంచికోసం ఓ మార్పు అదే సంక్రాంతి

FacebookTwitter

sankranthi

అంద‌రూ బాగుండాలి. అంతా మంచే జ‌ర‌గాలి అనేది ప్ర‌తి ఒక్క‌రి ఆశ‌. గ‌త కొంత‌కాలంగా ఎన్నో ఆటుపోట్లు, మ‌రెన్నో విప‌త్క‌ర ప‌రిస్థితుల మధ్య భ‌యంతో గ‌డిపిన రైత‌న్న పంట‌చేతికొచ్చి సేద‌తీరే స‌మ‌య‌మిది.  ప్ర‌క్రుతికి చీర క‌ట్టిన‌ట్లు ఉండే పంట‌ను చూస్తూ , అభ్యుద‌య‌పు సూర్యోద‌యాన్ని ఆస్వాదిస్తూ రైత‌న్న సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాడు. అస‌లు సంక్రాంతి అంటే ఏంటో తెలుసా!! చ‌ల్ల‌ని గాలుల న‌డుమ‌, ప‌చ్చ‌నిపైరుల‌తో ప్ర‌తీ ఊరు, ప్ర‌తీ ఇల్లూ ధాన్య‌పు రాశుల‌తో ఆనందంతో ఉండ‌గా..వారి ముఖాల్లో సంతోషం క‌నిపిస్తుంటే గంగిరెద్దుల విన్యాసాలు, హ‌రిదాసు చేసే భ‌జ‌న చ‌ప్పుళ్లు, జంగ‌ర‌దేవ‌ర‌ల మాట‌ల మూట‌లు, వివిధ వేషాల‌తో హాస్యాన్ని పండించే ప‌గ‌టి వేష‌గాల్లు…మా ఇంటికి రండీ అని స్వాగ‌తించ‌డానికి అనేక మెలిక‌ల రంగ‌వ‌ళ్లిక‌ల‌తో రంగుల‌తో శోభాయ‌మానంగా మెరిసే ముగ్గులు. వాటిపైన పువ్వులు పూచాయా అన్న‌ట్లు ఉండే గొబ్బెమ్మ‌లు. వాటి చుట్లూ న్రుత్యం చేసే అమ్మాయిలు..గాలిప‌టాల‌తో సంద‌డి చేసే అబ్బాయిలు..పకోడి పందాలు..భోగిమంట‌లు…బొమ్మ‌ల కొలువులు అబ్బో ఒక‌టా రెండా ఇలా ఎన్నెన్నో శోభాయ‌మానంగా క‌నిపిస్తుంది సంక్రాంతి. అంద‌రూ సంతోషాల‌తో ఉంటూ ప్ర‌తి ఇల్లు హ‌రివిల్లులా మారితే అదే అస‌లైన సంక్రాంతి.

సంక్రాంతి అంటే సంక్ర‌మ‌ణం అని అర్థం. అంటే మార్పు చెంద‌డం. సంవత్స‌రానికి ప‌న్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయితే ముఖ్యంగా రెండు సంక్రాంతుల‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణంలోకి తీసుకుంటారు. వాటిలో ఒక‌టి మ‌క‌ర సంక్రాంతి, రెండోది వేస‌వి కాలంలో వ‌చ్చేక‌ర్క సంక్రాంతి.  సూర్య‌డు మ‌క‌ర రాశిలో ప్ర‌వేశించ‌డాన్నేమ‌క‌ర సంక్ర‌మ‌ణం అంటారు. ఇలా ప్ర‌తి నెల మారుతూనే ఉంటాయి. రాశి మారిన ప్ర‌తి సారి దాన్ని సంక్రాంతి అనే అంటారు. ఈ మార్పు కార‌ణంగానే మ‌న జీవితాల పాల‌న‌, పోష‌ణ  జ‌రుగుతున్నాయి. ఈ క‌ద‌లిక ఆగిన‌ట్ల‌యితే మ‌నం అనేది కూడా ఆగిపోతుంది. ఈ భావ‌న అర్థం చేసుకోవాల‌నేది కూడా సంక్రాంతి పండుగ‌లో అంత‌రార్థం.

ఈరోజు ఎంతో ప్రాముఖ్య‌త సంత‌రించుకుంది. ఈ మాసంలో సూర్యుడు ఉత్త‌రాయ‌ణ ప‌థంలోకి ప‌య‌న‌మ‌వుతాడు. అందుకే ఈరోజు నుంచి స్వ‌ర్గ ద్వారాలు తెరిచే ఉంటాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నల కళ్ళల్లో విరిసే కోటి కాంతులతో, అనందాల కోలాహలంతో, ఈ పండుగను మూడు   రోజులుగా చేసుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. అందుకే దీనిని పెద్ద పండుగా అని కూడా పిలుస్తారు, మూడు రోజుల పండగలో మొదటిగా భోగి, త‌ర్వాత సంక్రాంతి, ఆ త‌ర్వాత క‌నుమ‌గా జ‌రుపుకుంటారు. కొన్ని చోట్ల నాలుగోరోజు ముక్క‌నుమ అని కూడా జ‌రుపుకుంటారు. మొదటి రోజు భూమికి పూజ చేస్తారు. రెండ‌వ రోజున పండుగ‌ను ఇంట్లోవారు జ‌రుపుకుంటే మూడోరోజు పాడి ప‌శువులను అందంగా అలంక‌రించి పండుగ చేసుకుంటారు. మ‌న సంస్ర్కుతిలో ప్ర‌క్రుతికి ప్రాముఖ్యం ఇవ్వ‌బ‌డింది. ఎందుకంటే ప్ర‌క్రుతి లేనిదే మ‌నం లేము. ఈ గొప్ప భావ‌న‌ని ప్ర‌జ‌ల‌కు క‌లిగించ‌డానికి ఆచారం పేరుతో చేసుకునే ప్ర‌ముఖ పండుగే సంక్రాంతి.

భోగ భాగ్యాలను ఇచ్చే భోగి. 

మూడురోజుల్లో మొద‌టి రోజును భోగి అంటాఉ. ఉద‌యాన్నే లేచి ఇంట్లోని పాత వ‌స్తువులన్నింటినీ స‌మ‌కూర్చుకుని, కొత్త వాటితో నిత్య నూత‌న జీవితం ఆరంభించ‌డానికి గుర్తుగా వాటిని భోగి మంట‌ల్లో వేస్తారు. ఇక సాయంత్రం వేళ బొమ్మ‌ల కొలువు పెట్టి ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ గ‌డుపుతారు. ఇంట్లో చిన్న పిల్ల‌లుంటే  అంద‌రూ క‌లిసి రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. తెలంగాణా ప్రాంతంలో స‌కినాలు అనే పిండి వంట‌ను చేసుకుంటారు.

మకర సంక్రాంతి

రెండవ రోజు, అసలైన పండుగ రోజు సంక్రాంతి. ఈరోజు తెల్ల‌వారు జామునే లేచి ఇంటిని అలంక‌రించి కొత్త బ‌ట్ట‌లువేసుకుని బంధుమిత్రులంద‌రితో క‌లిసి సంతోషంగా గ‌డుపుతారు. మరో ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. మరో ఆనందమైన, అలరించే విషయం  ఈ రోజున “హరిలో రంగ హరీ” అంటూ కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమై సందడి చేస్తాడు. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ సరదాగా గడుపుతారు. రథం ముగ్గు, రంగ వల్లులతో ఇంటి ముంగిళ్ళు కళకళలాడతాయి. అయితే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. మ‌హారాష్ట్ర , తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల‌లో ఈరోజు గౌరీదేవి పూజ చేసి, నువ్వుల‌తో చేసిన ల‌డ్డూల‌ను నైవేద్యంగా పెడుతారు. ముత్త‌యిదువుల‌ని పిలిచి వారికి బ‌హుమ‌తుల‌తో పాటు నువ్వుల ల‌డ్డూల‌ను తినిపించి, తీపి తినితీయ‌గా మాట్లాడు..నువ్వులు తిని ముత్త‌యిదువుగా ఆరోగ్యంగా ఉండూ అంటూ దీవిస్తారు.

చివరిదైన కనుమ రోజు. 

ఇళ్ళన్నీ అందమైన ముగ్గులతో శోభిస్తూ, అందరికి ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలని అందరూ కోరుకుంటారు, ఈరోజు ఆడపిల్లలకు ప్రత్యేకమైన రోజు, ఈరోజు ఆడ పిల్లలందరు, గొబ్బెమ్మలు పెడతారు, గొబ్బెమ్మ అంటే గోపి+బొమ్మ, అంటే కృష్ణుని భక్తురాళ్ళు అని అర్థం, వీటి చుట్టూ తిరుగుతూ పాటలుపాడుతూ నృత్యం చేస్తూ కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు. క‌నుమ రోజు ప్ర‌యాణం చేయ‌రు.

ఇలా మూడు రోజుల పాటు శోభాయమానంగా జ‌రుపుకునే పండుగ నేడు కాంక్రీటు జీవ‌న విధానంకి అల‌వాట ప‌డి సంక్రాంతిలోని కాంతి త‌గ్గిస్తున్నాం. ఆనాటి కాలంనాటి గంగిరెద్దులు, హ‌రిదాసు కీర్త‌న‌లు, క‌నీసం రంగ‌వ‌ల్లిక‌లు కూడా లేకుండా అన్నీ ఫాస్ట్‌ఫుడ్ త‌ర‌హా జీవ‌న విధానానికి అల‌వాటు ప‌డి,  అప్ప‌టిక‌ప్ప‌డు త‌యార‌య్యేవాటిపై ఆధార‌ప‌డుతున్నాం.  అస‌లైన పండుగ మాధుర్యాన్ని మ‌నం కోల్పూతూ మ‌న పిల్ల‌ల‌కు కూడా తెలియ‌చేయ‌ట్లేద‌నేది అక్ష‌ర స‌త్యం. ఇక‌నైనా పండుగ విశేష‌త‌ను భావిత‌రాల‌కు చెబుతూ సంక్రాంతి మ‌న అంద‌రిజీవితాల్లో సుఖ సంతోషాల‌ను క‌లిగించి కాంతిప‌థంలో మ‌న జీవితాలు విర‌బూయాల‌ని కోరుతూ పాఠ‌కులంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు.

– ల‌తాక‌మ‌లం

FacebookTwitter