Inspiration

మదన్ లాల్ ఢింగ్రా చివరి వాఙ్మూలం

Posted

 

17 ఆగస్ట్, 1909 న “సవాలు’’ అనే పేరుతో భారత విప్లవకారులు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. ఉరికంబం ఎక్కేముందు మదన్ లాల్ ఢింగ్రా చివరి వాఙ్మూలం ఇది.

“ దేశభక్తులైన భారతీయ యువకులను ఉరితీసినందుకు, అన్యాయంగా వారికి ప్రవాసాంతర శిక్షలు విధించినందుకు ప్రతీకారంగా నేను ఇంగ్లీష్ వారి రక్తాన్ని చిందించానని కొన్ని రోజుల క్రితం చెప్పాను. ఇలా చేయడం కోసం నేను ఎవరిని సంప్రదించలేదు, ఎవరితో ఎలాంటి కుట్ర చేయలేదు. నా కర్తవ్యంగా భావించి ఇది నేను చేశాను.

విదేశీ బానేట్ (తుపాకీ కి ఉండే కత్తి) ఒక జాతిని బానిసలను చేసినప్పుడు ఇలాంటి యుద్దం తప్పదు. ఆయుధాలు లేని వారికి  ప్రత్యక్ష యుద్ధం సాధ్యం కాదు. అందుకనే నేను శత్రువు నిర్ఘాంతపోయేట్లుగా హటాత్తుగా దాడి చేశాను. నా దగ్గర తుపాకులు లేవుకాబట్టి ఉన్న చిన్న పిస్తోలుతోనే దాడిచేశాను.

ఒక హిందువుగా నేను నా దేశానికి జరిగిన హానిని భగవంతునికి జరిగిన అవమానంగా భావిస్తాను. దేశమాత కార్యమంటే శ్రీరాముడి కార్యమే! ఆమెకు చేసే సేవ శ్రీకృష్ణుని సేవయే ! అనారోగ్యవంతుడు, తెలివితేటలు అంతగా లేని నాలాంటి వాడు దేశమాతకు తన రక్తాన్ని కాక ఇక ఏమి సమర్పించగలడు?  దేశమాత కోసం ప్రాణాలు అర్పించడమే  ఇప్పుడు భారతదేశంలో అంతా నేర్చుకోవలసిన పాఠం. స్వయంగా అలా ప్రాణత్యాగం చేయడం కంటే వారికి ఆ పాఠాన్ని ఎలా నేర్పగలం? అందుకనే నేను వీర మరణాన్ని ఎంచుకున్నాను. హిందూ, ఇంగ్లీష్ జాతులు ఉన్నంతవరకు (ఇప్పుడున్న అసహజమైన సంబంధం కొనసాగినంత వరకు) భారత, ఇంగ్లండ్ ల మధ్య ఈ స్వతంత్ర పోరాటం సాగుతూనే ఉంటుంది.

భగవంతుడిని నేను ప్రార్ధించేది ఒక్కటే : మానవాళి మేలుకోసం, భగవంతుని వైభవం కోసం దేశమాత స్వేచ్చను పొందాలి. అప్పటి వరకు నేను ఈ తల్లి కడుపునే పుట్టాలి, ఆమె కార్యం కోసమే బలిదానం కావాలి.”

– వందేమాతరం