Articles

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ : ప్రశ్నించాల్సిందే !.. అదే ప్రజాస్వామ్యం

Posted

pranab-mukherjee342

బుల్లెట్ల జడివాడనలో శాంతిచర్చలు కుదరవు రిపబ్లిక్‌ డే సందేశంలో రాష్ట్రపతి ప్రణబ్‌

రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి 66 సంవత్సరాలు పూర్తి అయింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాన సమస్యలన్నింటినీ ప్రస్తావించారు. చట్ట సభలు సజావుగా సాగాలనీ, అక్కడ ప్రజల వాణి వినిపించాలంటూ ప్రస్తుత ప్రజాప్రతినిధులందరికీ చురక అంటించారు. అలాగే,దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అసహన ధోరణులను కూడా ప్రస్తావిస్తూ, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నింటిలో ముఖ్యమైనది అయిన ప్రశ్నించేహక్కును పౌరులుస్వేచ్ఛగా ఉపయోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు.పొరుగు దేశమైన పాకిస్తాన్‌ని ఉద్దేశించి బులెట్ల వర్షంలో శాంతి చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్‌ పదే పదే ఉల్లంఘించడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ ప్రశ్న వేశారు.దేశం ఆర్థిక పునాదులు పటిష్ఠంగా ఉన్నాయనీ, ఆశించిన రీతిలో వృద్ధి రేటు సాధించేందుకు పటిష్ఠమైన కృషి జరగాలని సూచించారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి, దూర్‌దర్శన్‌ల ద్వారా దేశప్రజలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రసంగం పూర్తిపాఠంః

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశం అజేయమైన శక్తిగా త్వరలోనే రూపుదిద్దుకోనున్నది. తరతరాలుగా మన సంస్కృతీ సంప్రదాయాలు,మన ప్రజల జీవన విధానాలు బతుకు,బతికించు అనే సూత్రం ప్రాతిపదికగానే సాగుతున్నాయి. మన ప్రజాస్వామిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యున్నతమైనది.ఆదర్శప్రాయమైనది. తమ హక్కుల కోసం ప్రశ్నించడం, పోరాటాలుచేయడం,తమ వాణిని నిర్భయంగా వినిపించడం మన ప్రజాస్వామ్యంలోని విశిష్టతకు నిదర్శనం. అదే మన ప్రజాస్వామ్యానికి బలం. హింసనూ, అసహనాన్నీ,నిర్హేతుకతనూ వ్యాపింపజేసే వారి పట్ల అప్రమత్తత అవసరం. తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న విలువలనూ, ప్రమాణాలను నిలబెట్టుకోవల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా శాంతి,సత్యం,అహింసా మార్గాల ద్వారా స్వాతంత్య్రాన్ని సముపార్జించిన మహాత్మాగాంధీ ఆశయాల సాధనకై ప్రతి పౌరుడూ ప్రతిన పూనాల్సిన శుభ సందర్భమని గణతంత్ర దినోత్సవాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభివర్ణించారు.సహనం,సంఘీభావం భారతీయ సంస్కృతిలో భాగమనీ,వాటిని కాపాడుకోవడం ప్రతిభారతీయుని పవిత్ర కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.

ప్రియమైన దేశప్రజలారా!

అరవై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాయుధ దళాలకూ,పారామిలటరీ దళాలక, భద్రతాదళాలకూ నా శుభాభివందనాలు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా గణుతికెక్కిన మన దేశం మహాత్మాగాంధీ నాయకత్వాన మహోధృతంగా సాగిన సమరంలో స్వాతంత్య్రాన్ని పొంది 68 సంవత్సరాలు పూర్తిఅయి,69వ సంవత్సరంలో అడుగు పెట్టాం.అలాగే,మన దేశాన్ని గణ తంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించుకుని ఇప్పటికి అరవై ఆరుసంవత్సరాలు పూర్తి అయి,అరవై ఏడవ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం.ఈ శుభ సమయంలో ఆనాటి యోధుల త్యాగాలనూ, అకుంఠిత దీక్షను ఒక్కసారి స్మరించుకుని వారికి నివాళులర్పించడం మనందరి బాధ్యత.

గాంధీజీకి ముందే స్వాతంత్య్ర ం కోసం సమరం ప్రారంభమైనప్పటికీ, గాంధీజీ ఆధ్వర్యంలో జరిగిన సత్యాగ్రహాలు, ఆందోళనలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. 1929 డిసెంబర్‌లో అఖిల భారత కాంగ్రెస్‌కమిటీ పూర్ణస్వరాజ్‌ కోసం పాటు పడాలని దేశప్రజలకు పిలుపు ఇచ్చింది.ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది.జనవరి26వ తేదీన గాంధీజీ దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినాన్ని నిర్వహించారు. అప్పటి నుంచిఏటా దేశ ప్రజలంతా ఇదే రోజున సమావేశమై స్వాతంత్య్రం కోసం అకుంఠిత దీక్షతో పాటు పడాలని ప్రతిన తీసుకోవడం ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చేవరకూ ఇదే రోజున ప్రతిన తీసుకోవడం ఆనవాయితీఅయింది.ఈ సందర్భంగా గాంధీజీగారు తరచుగా అన్న మాటలను గుర్తు చేసుకోవడం,వాటి కోసం కృషి చేయడం,పునరంకితం కావడం మన బాధ్యత. దేశంలో ఆకలిదప్పులతో ఎవరూ అలమటించరాదనీ, తిండికీ,గుడ్డకూ, వసతికి ఇబ్బంది పడరాదనీ, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు తరతమ భేదాలు లేకుండా సమైక్యంగా సహజీవనం సాగించాలని మహాత్మాగాంధీ కలలుగన్నారు.

మనం సాధించుకున్న రాజకీయ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం తోపాటు ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించడం మన ముందున్న కర్తవ్యం. సమాజంలో బలహీనవర్గాల వారందరికీ సమాన అవకాశాలు లభించేట్టు చూడాలి.దారిద్య్రాన్ని తరిమి వేయాలన్న లక్ష్యం ఇంకా సుదూరంలో ఉంది.దానిని సాధించేందుకు మనమంతా ఇలాంటి సందర్బాల్లో కంకణ బద్దులుకావాలి.స్వాతంత్య్రానంతరం దేశం ఎంతో అభివృద్ధి సాధించింది.ఎన్నో ప్రాజెక్టులూ,పరిశ్రమలూ మన దేశంలో వెలిశాయి.సంపంద పెరిగింది.శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఆర్థికంగా అజేయమైన దేశంగా మన దేశం దూసుకుని పోతోంది.అదే సందర్భంలో దేశంలో నిరక్షరాస్యులు, పూట గడవని నిర్భాగ్యుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. సాధించిన అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలందరికీ చేరినప్పుడే అభివృద్ధి సార్థకమైనట్టు. సమ్మిళిత అభివృద్ధి ద్వారానే గాంధీజీ కలలు సాకారమవుతాయి. అందుకోసం కృషి చేసేందుకు ఈ మహత్తరమైన రోజున ప్రజలంతా ప్రతిన బూనాలి.

పారదర్శకత పాటించాలి:

గడిచిన సంవత్సరం ఎన్నో విధాల ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.మూడు దశాబ్దాల తర్వాత దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ప్రజలు ఒకే పార్టీకి పూర్తి మెజారిటీని ఇచ్చారు. సంకీర్ణ ప్రభుత్వాల అనివార్య పరిస్థితి నుంచి దేశం బయటపడింది.ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ లభించడం వల్ల దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుచ తప్పకుండా అమలు జేసేందుకు మంచి అవకాశం లభించింది.తన అజెండాకు అనుగుణంగా విధానాలనూ,కార్యక్రమాలనూ రూపొందించుకుని అమలు జరిపేందుకు ప్రభుత్వానికి అవకాశం కలిగింది.

ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజల ఆశలూ,ఆశయాలకు అనుగుణంగా పాలనావ్యవహారాలను నడిపించాల్సిన బృహత్తరమైన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. స్వచ్ఛమైన,సమర్ధవంతమైన, లింగ వివక్షలేని,పారదర్శకమైన,జవాబుదారీ పాలనను ప్రజలుకోరుకుంటున్నారు. ప్రభుత్వం తమకు అన్ని విధాలా తోడ్పాటుగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు.వారి ఆశయాలకు అనుగుణంగా పాలనను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.

చట్ట సభలు సజావుగా సాగాలి: చట్టసభలు పని చేయనిదే పాలన ఉండదు.చట్టసభలు సజావుగా,సాఫీగా సాగినప్పుడే పాలన సక్రమంగా సాగుతుంది.ప్రజల ఆశలూ,అభిప్రాయాలకు చట్టసభలు అద్దం పట్టాలి. ప్రభుత్వమూ, ప్రతిపక్షమూ అర్థవంతమై చర్చలు జరిపి ప్రగతిశీలమైన చట్టాలను రూపొందించాలి. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి.అభిప్రాయ భేదాలు తొలుగుతాయి. చర్చలకు అవకాశం కల్పించినప్పుడే చట్టసభలు సార్ధకమవుతాయి. అభిప్రాయ భేదాలు తొలగించుకోవడానికి అరమరికలు లేనిచర్చలు జరగాలి. ఇరు వైపులా ఆత్మపరిశీలనా, సంయమనం,సహనం ఉండాలి. తాము రూపొందించే చట్టాలపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కృషి చేయాలి. చట్టాలు రూపొందించే పార్లమెంటులో సజావుగా చర్చలు జరగాలి. అలా జరిగినప్పుడే చట్టసభల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. ప్రజల ఆశలూ,ఆశయాలకూ విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజల విశ్వాసాన్ని చూరగొనకపోతే ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు.ప్రజల విశ్వాసాన్నీ, నమ్మకాన్నీ కాపాడుకోవల్సిన బాధ్యత చట్టసభల సభ్యులందరిపైనా ఉంది. ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమైన తరువాత చట్టసభల్లో ఏం జరుగుతోందో వీక్షించే అవకాశం ప్రజలకు కలుగుతోంది.కనుక,చట్టసభ సభ్యులు తమ వ్యవహరణ తీరులో, మాటల తీరులో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఎంతైనాఉంది.

మహిళలను గౌరవిస్తేనే ప్రగతి:

పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ,సర్దార్‌ పటేల్‌,సుభాస్‌ చంద్రబోస్‌, భగత్‌సింగ్‌, రవీంద్రనాథ్‌ టాగోర్‌, సుబ్రహ్మణ్యభారతి తదిత యోధానుయోధుల గళాల్లో,వ్యవహరణ తీరులో తేడాలుంటే ఉండవచ్చు,కానీ, వారందరిలో ఉమ్మడిగా కనిపించే లక్షణం దేశ భక్తి.దేశ భక్తే వారి భాష,వారి ఊపిరి.వారి అకుంఠిత దీక్ష,వజ్ర సంకల్పం,పోరాట పటిమ,నిస్వార్ధ సేవా పరాయణత వల్లనే మనం స్వాతంత్య్రాన్ని సంపాదించుకోగలిగాం. ఇలాంటి జాతీయ పర్వదినాల్లో ఆ యోధులందరికీ శిరస్సు వంచి ప్రణామాలు చేయడం మన ధర్మం.అంతటి గొప్ప యోధులు నడయాడిన నేలపై జన్మించినందుకు మనమంతా అదృష్టవంతులం.వారి ఆశయాల సాధన కోసం కృషి చేయడం మనందరి కర్తవ్యం.

మహిళలకు సమానావకాశాలూ, హక్కులను కల్పించడంతో పాటు వారిపై అత్యాచారాలు,లైంగిక దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనాఉంది. దేశంలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై అత్యాచారాలు,హత్యలు, వేధింపులూ జరుగుతూనే ఉన్నాయి.ఇవి మన సంస్కృతీ, సంప్రదాయాలకు మచ్చను తెస్తున్నాయి. అలాగే,వరకట్న దురాచారాలు ఇప్పటికీ సాగుతుమన్నాయి.విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ మహిళల గురించి ప్రస్తావిస్తూ ఇల్లాలే ఇంటికి వెలుగు,ఇల్లాలే జీవనజ్యోతి అని అభివర్ణించారు. మన సమాజంలో తరతరాలుగా స్త్రీకి ఎంతో సమున్నతమైన గౌరవం ఉంది.దానిని కాపాడుకోవాలి. మహిళల పట్ల తల్లితండ్రులు,అధ్యాపకులు, నాయకుల దృక్పథంలో మార్పు రావాీలి. మహిళలను గౌరవించిన సమాజమే అభ్యున్నతిని సాధిస్తుంది. యత్ర నార్యస్తు పూజ్యయంతే,రమంతా తత్ర దేవతా అనే ఆర్యోక్తి చెబుతున్నది అదే. పిల్లలకు మంచి నడవడిక,సత్ప్రవర్తన, మంచి అలవాట్లు అబ్బేట్టు చూడటంలో మనం విఫలమవుతున్నాం.వారికి స్వేచ్ఛ ఇవ్వడం ఎంత అవసరమో,వారి నడవడిక సక్రమంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు కనిపెట్టి చూడటం అంత అవసరం.ప్రతిపౌరుడూ మహిళల పట్ల గౌరవంతో, వినమ్ర భావంతో మెలిగేట్టు చూడాలి,మహిళల పై దాడులను అరికట్టలేకపోతే న్యాయం జరిగినట్టు కాదు. స్త్రీని గౌరవించినప్పుడే జాతి పరిఢవిల్లుతుంది.

రాజ్యాంగం పవిత్ర గ్రంథం:

మనందరికీ రాజ్యాంగం పవిత్రమైన గ్రంథం. దేశంలో సాంఘిక,ఆర్థిక రంగాల్లో సమూలమైన మార్పులకు అది ఒక దిక్సూచి.అది ఒక ప్రామాణిక గ్రంథం. వివిధ జాతులు, మతాలు, కులాలు,వర్గాలూ భాషలూ,ప్రాంతాలూ కలిగిన మన దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి అదే మనకు దారిదీపం.ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎంత విలువైనదో ఇతరుల హక్కులూ,అభిప్రాయాలనూ కాపాడటం కూడా అంతే ప్రాధాన్యం కలిగిన అంశం.అహింసా జ్యోతిని ప్రపంచానికి అందించిన మహాత్మాగాంధీ జన్మించిన మన దేశంలో హింస ప్రజ్వరిల్లడం దురదృష్టకరం.

గోరుతో పోయే వివాదాలు చినికి చినికిగాలివాన అవుతున్నాయి. అందరి విశ్వాసాలూ, సంప్రదాయాలూ, భావ జాలాలు ఎటువంటి ఆటంకం లేకుండా వ్యక్తమయ్యేందుకు అవసరమైన స్వేచ్ఛాయుత వాతావరణం ఎల్లవేళలా నెలకొన్నప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.ప్రజాస్వామ్యం మనకు అందిస్తున్న స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా చూసుకోవల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఒకరి స్వేచ్ఛ మరొకరికి ప్రతిబంధకం కాకూడదు.అలాగే, ఎదుటి వారిని నొప్పించే విధంగా మాట్లాడటం,వారి మనసు గాయపడేట్టు చేయడం ఎంత మాత్రం సభ్యత కాదని గాంధీజీ పేర్కొన్నారు. ఘర్షణతో కన్నా,సంయమనంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. వివాదాల పరిష్కారానికి అరమరికలు లేని చర్చలే శరణ్యం.ప్రపంచంలో ఎన్నో దేశాలు సంక్షోభాల్లో కూరుకుని పోతున్నాయి. రాజకీయ వ్యవస్థకూ, విశ్వాసానికీ మధ్య గల సున్నితమైన సంబంధాన్ని మనం కాపాడుకుంటూ రావడం వల్లనే మన మతసామరస్యం పరిఢవిల్లుతోంది. ఎవరు ఏ మతాన్ని అయినా అవలింబించే స్వేచ్ఛ, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ మన దేశంలోనే ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం ద్వారా మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రశ్నించే హక్కునూ, హక్కుల కోసం పోరాడే స్వేచ్ఛనూ మన పౌరులు కలిగి ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్యం నూరు పాళ్ళు అమలు అవుతోంది మన దేశంలోనే. అదే మన ప్రజాస్వామ్యానికి బలం.సమైక్యతే మన బలం. సంఘటితమే మన శక్తి.

బుల్లెట్ల వర్షంలో చర్చలా? ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదం ఊడలు వేస్తోంది. మానవాళి మనుగడకు ఉగ్రవాదం పెనుసవాల్‌గా తయారైంది.మన దేశంలోకి ఉగ్రవాదం సరిహద్దులకు ఆవలి నుంచి చొచ్చుకుని వస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నా మన సైనికులు ఎప్పటికప్పుడు దీటైన రీతిలో జవాబిస్తున్నారు. మన భద్రతావ్యవస్థలో ఎటువంటి లొసుగులేని విధంగా ఎప్పటికప్పుడు సరిచూసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.అయితే, బులెట్ల వర్షంలో శాంతి చర్చలు కొనసాగించలేం కదా! అంటూ పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా ప్రణబ్‌ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరులో మన దేశంతో ప్రపంచ దేశాలు కలిసి ముందుకు నడుస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఉగ్రవాదంపై పోరులో మన నిబద్ధతనూ, నిజాయితీనీ,నిర్మొహమాట వైఖరినీ ప్రపంచ దేశాలు ఇప్పటికే గుర్తించాయనీ, ఉగ్రవాద శక్తుల పన్నాగాలను తిప్పికొట్టగల శక్తి సామర్ధ్యం మన దళాలకు ఉందని ఎన్నోసార్లు రుజవైందనిఆయన స్పష్టం చేశారు. మన ఆర్థిక పరిస్థితిపై ఆశాజనకమైన వ్యాఖ్య చేశారు. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉండటం వల్లనే అంతర్జాతీయంగా ఎన్ని సంక్షోభాలు ఎదురైనా నిలదొక్కుకోగలుగుతున్నామని అన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు.

సాటి పౌరులారా! ఆర్థికాభివృద్ధి కూడా ప్రజాస్వామ్యానికి ఒక సవాల్‌వంటిది. 2016 సంవత్సరం మనదేశంఆర్థికంగా ముందంజ వేసేందుకు అకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న ఆశలు చిగురిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ,మన ఆర్థికవ్యవస్థ సుస్థిరంగా ఉండటానికి పునాదుల గట్టితనమే కారణం.సాధించిన అభివృద్ధిని స్థిరీకరణ చేసుకోవడం,అభివృద్ధి ఫలాలు అందరికీ అందేట్టు చూడటం,తయారీరంగాన్ని మరింత వృద్ధి చేసుకోవడం, స్థూల జాతీయోత్పత్తిని 7-8 శాతం సాధించడం వంటిలక్ష్యాలతో మన ముందుకు వెళ్తున్న మన దేశం 2016లో తప్పకుండా ఆర్థికాభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతుందనడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు మన దేశంలో జరుగుతున్న కృషి తప్పక ప్రతిఫలిస్తుంది.

దేశభక్తి,దయ,నిజాయితీ ,అంకిత భావాలకు తరతరాలుగా భారతీయులు ప్రసిద్ధి చెందారు.ఆర్థికాభివృద్ధితో పాటు దేశంలో నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాంకేతికవిద్యా,వైజ్ఞానికరంగాల్లో మన దేశం ఎంతో పురోగమిస్తోంది. అందరికీవిద్య,అందరికీ ఆరోగ్యం వంటి నినాదాలతో మన దేశం అభివృద్ధికి చిరునామాగా తయారవుతోంది. మనదేశంలో అపారమైన మానవ వనరులు,అవకాశాలు ఉన్నాయి.ముఖ్యంగా, మన యువతకు సరైన అవకాశాలు కల్పించి,సరైన పథంలో నడిపిస్తే 21వ శతాబ్దం మనదే. మన లక్ష్యాలను సాధించుకునేందుకు అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలి.

అందరి అభిప్రాయం తీసుకోవాలి: విధాన నిర్ణయాల్లో అందరినీ సంప్రదించడం,అందరి అభిప్రాయాలకూ ప్రాధాన్యమివ్వడం వంటివి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పడతాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. వస్తువులు,సేవల పన్ను(జిఎస్‌టి) బిల్లు విషయంలో ప్రతిపక్షాల అభిప్రాయాలను వీలైనంత మేరకు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన పరోక్షంగా ప్రభుత్వానికి సూచించారు.అలాగే,చట్టసభల సభ్యులుప్రజలకు జవాబుదారీగాఉండాలనీ, కేవలం బిల్లులను ఆమోదించడమే కాకుండా,ప్రజల సమస్యలను వీలైనంత విస్తృతంగా చర్చించేందుకు అవకాశం లభించాలని ఆయన అన్ని పార్టీలనుద్దేశించి సూచించారు. పౌరుల మధ్య అభిప్రాయ భేదాలున్నా,ఎవరి అభిప్రాయాన్ని వారు స్వేచ్ఛగా వ్యక్తం చేసుకోవడానికి అనువైన వాతావరణం చట్టసభల్లోనూ, వెలుపలా ఉండాలని ఆయన అసహన ధోరణులపై జరుగుతున్న చర్చను గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ స్పష్టంచేశారు.

                                                                                                                                                                            ఆంధ్రప్రభ దినపత్రిక