News

దేశంలో సామాజిక ప్రజాస్వామ్యం, రాజకీయ స్థిరత సాధించటమే స్వాతంత్రం యొక్క సఫలత

Posted
FacebookTwitter
The Prime Minister, Shri Narendra Modi addressing the Nation on the occasion of 70th Independence Day from the ramparts of Red Fort, in Delhi on August 15, 2016.
The Prime Minister, Shri Narendra Modi addressing the Nation on the occasion of 70th Independence Day from the ramparts of Red Fort, in Delhi on August 15, 2016.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆగస్టు 15కి 69 సం॥లు పూర్తి చేసుకొని 70 సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. ఈ 69 సం॥ కాలఖండంలో భారతదేశం అనేక మైలురాళ్ళు దాటి ప్రపంచంలోని శక్తివంత దేశాలలో ఒకటిగా గుర్తించబడుతోంది. దేశంలో ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే ఒడిదుడుకుల మధ్య ప్రయాణిస్తూ కూడా నిలకడగా ఉంది. దేశాభివృద్ధి గమనిస్తే అభివృద్ధి-బీదరికం పోటీపడి పెరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో అభివృద్ధికి నమూనంగా రష్యా కనబడింది. మనదేశంలో మనదేశానికి అనుగుణమైన విధానాలను వదిలిపెట్టి రష్యాను అనుకరించిన కారణంగా దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆ వ్యవస్థను గాడిలో పెట్టడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి కాని అది అంతగా ఫలితం కనబడలేదు. దానికారణంగా గ్రామాల నుండి బ్రతుకుదెరువుకోసం విపరీతమైన వలసలు కొనసాగుతున్నాయి. దానితో పట్టణాలు అపరిమితమైన జనాభాతో సతమతమవుతున్నయి. గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో చెప్పిన మాటలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది ఇంకా రావాల్సింది గ్రామ స్వరాజ్యం, గ్రామం యొక్క స్వయంసమృద్ధి దానికోసం మనం పనిచేయాలని చెప్పారు. కాని మన పాలకులు ఆ రెండు విషయాలను వదిలిపెట్టి పట్టణాల అభివృద్ధి కోసం పథకారచన చేసుకొంటూ పోయారు. గ్రామాలను కూడా పట్టణీకరణ చేయటానికి ప్రయత్నించారు కాని గ్రామాలను స్వయంసమృద్ధి దిశలో అభివృద్ధి చేయలేకపోయినారు. దాని పరిణామము నేడు మనం చూస్తున్నాము. ఈ పరిస్థితులలో మార్పు తీసుకొని వచ్చి గ్రామ స్వరాజ్యం, గ్రామాభివృద్ధి దిశగా వేగంగా అడుగు వేయవలసిన అవసరం ఉంది.

దేశంలో ఈరోజు ఉన్న పరిస్థితులకు కారణం మన ఆలోచనలో వచ్చిన మార్పు. ఆ మార్పు ఫలితం దేశంలో పరస్పర విబేధాలు, సంఘర్షణలు చోటుచేసుకొన్నాయి. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి ప్రధాన కారణం సోషలిజం, కమ్యూనిజం ప్రభావం. సోషలిజం, కమ్యూనిజం ప్రభావం మనదేశంలో చాలా మంది ప్రముఖులైన రాజకీయ నాయకులపైన, మేధావులపైన పడింది. సోషలిజం, కమ్యూనిజం పుట్టిన దేశాలలో, అవి మెట్టిన దేశాలలో అవి ఎట్లా తిరోగమనంలో ఉన్నాయో, ఎట్లా ఆ ఆలోచనలు విఫలమైనాయో గమనిస్తూ కూడా పునరాలోచన చేసుకోలేని స్థితికి చేరిపోయిన మన మేధావులు దేశంలో సైద్ధాంతిక సంఘర్షణకు తెరలేపారు. అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు గమనిస్తూ కూడా ఆ ఆలోచనలను సమీక్షించుకోవాలనే ఆలోచనలు కనబడడం లేదు. ఆ ఆలోచనలు ఇప్పటికే దేశానికి ఎంతో నష్టం కలిగించింది, ఇంకా కలిగిస్తూనే ఉంది.

సోషలిజం, కమ్యూనిజం సిద్ధాంత ప్రభావం పరంపరాగతంగా వస్తున్న ఈ దేశ సాంస్కృతిక జాతీయ భావాలకు తీవ్రమైన ఆఘాతం కలిగించింది. రాజకీయాలు కేంద్రంగా ఈ దేశంలో సంస్కృతి వికసించాలి, దేశానికి రాజకీయాలే సర్వస్వం. దేశంలో ప్రతి మార్పు రాజకీయాలతోనే వస్తుందని వారు విశ్వసిస్తున్నారు.  దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చిన తరువాత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మన నాయకులు మేధావులకు మనం ఇప్పుడిప్పుడే ఒక జాతిగా రూపొందుతున్నాము అనే ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచన ప్రభావం మన రాజ్యాంగం మీద పడింది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలను పరిశీలించాలి. మన రాజ్యాంగం రచన చేసేటప్పుడు ఈ దేశానికి ఏమి పేరు పెట్టాలి అని అనేక తర్జనబర్జనలు జరిగాయి. రాజ్యాంగంలో ఈదేశానికి ఇండియా అని పేరు పెట్టారు. ఈ దేశానికి వేల సం॥ చరిత్ర ఉంది. వేల సం॥ నుండి ఈ దేశానికి భారత్‌ అని ఉంది. ప్రపంచంలో ఈ దేశానికి గుర్తింపు భారత్‌ లేక హిందుస్థాన్‌ దీనిని వదిలిపెట్టి రాజ్యాంగ రచన చేసిన మన పెద్దలకు ఈ దేశానికి ఇండియా అని పేరుపెట్టాలని ఎందుకు అనిపించింది అంటే దానికి ప్రధాన కారణం జాతికి మౌలిక ఆధారం రాజ్యం అనే భావనే. కాని మన దేశంలో వేల సం॥ నుండి మన జాతికి మౌలిక ఆధారం సంస్కృతి. భారతదేశం వేల సం॥ నుండి ఈ సంస్కృతి ఆధారంగానే ప్రపంచంలో ఒక మంచి దేశంగా గుర్తింపు పొందింది. ఈవిషయాలను ప్రక్కకు పెట్టి రాజ్యమే సర్వస్వం అనుకొనే స్థితికి చేరుకొన్నాము దాని పరిణామం ఈ దేశం పేరు ఇండియాగా గుర్తించటం. దానిపైన గొడవలు జరిగిన కారణాన మన అదృష్టం బాగుండి రాజ్యంగంలో ఇండియా దటీజ్‌ (India that is Bharat) భారత్‌ అని వ్రాసారు. దట్‌ వజ్‌ భారత్‌ (India that was bharat‌) అనలేదు. ఆ ఆలోచనలే ఈ దేశంలో సంఘర్షణ కారణమయ్యింది. అది మన జాతీయ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసింది. ఒక నూన్యతా భావం కలిగించింది. దానివల్ల ఏర్పడిన శూన్యంలో నైతికవిలువలు పతనం. లంచగొండితనం, అవినీతి విశృంఖలంగా సిగ్గులజ్జ లేకుండా పెరిగిపోయింది. అదే నేడు రాజ్యమేలుతున్నది. క్రొత్త క్రొత్త రూపాలు సంతరించుకొని స్వైరవిహారం చేస్తున్నది. ఆ కాలంలో తప్పుడు పనులు చేసేందుకు ఎవరైనా భయపడేవారు. కాని ఈ రోజు బహిరంగంగా చేస్తున్నారు. దానితో అనేక సమస్యలు  దేశం ఎదుర్కొంటున్నది. ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. ప్రజలు అసహనానికి కూడా గురి అవుతున్నారు. వ్యక్తిగత స్వార్థాలు కూడా పెరిగాయి. అందుకే ఈ రోజుల్లో కుల, మతపర విబేధాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపిస్తున్నారు. అందుకే రాజకీయ విషయాలకు నిర్దిష్ట విలువలు కనబడడం లేదు అవి మాట్లాడే వారిమీద ఆధారపడి ఉంటున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నాయకులకు కొన్ని విలువలు ఉండేవి ఈరోజు అటువంటి వారు ఎవరు ఉన్నారని వెతుక్కోవలసి వస్తున్నది.

స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మన నాయకులకు భారత్‌ ఒక ఆధ్యాత్మిక ప్రేరణ. అది ఒక భావాత్మకమైన ప్రేరణ. అటువంటి నాయకత్వం నేడు మనకు కనబడటం లేదు. ఈ ఆలోచనలు అధునాతనమైనవి కావు ఇవి మూఢనమ్మకంతో కూడుకున్నవనే భావం కనబడుతున్నది. ఇది ఇంకా ఎక్కువకాలం కొనసాగటం చాలా ప్రమాదకరమైనది, ప్రమాదకర రాజకీయాలకు తెరలేపుతుంది. స్వాతంత్య్రం అనేది రాజకీయాలకంటే కూడా చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. స్వాతంత్య్రం సత్యం కోసం స్వేచ్ఛా స్వాతంత్రంతో, మన జాతీయ ఆత్మను శక్తివంతం చేయటం అంటే మానవత్వాన్ని వికశింపచేయటం. ప్రపంచంలో మానవత్వాన్ని వికశింపచేయటంలో తనవంతు పాత్ర పోషించుటకు తనను తాను వికశింపచేసుకోవటం, అంతే కాని విబేధాలు సృష్టించటానికి, విలాసాలకు దారితీసే అంతర్జాతీయ వినియోగదారి విధానం కాదు. ఈ దేశం తిరిగి జాగృతమవటంలోనే ప్రపంచంలో మానవతా వికాసం ఆధారపడి ఉంది. ఆర్థిక సంక్షోభాలు, సామాజిక సమస్యలు, ఇస్లాం సామ్రాజ్యవాదం ప్రంపంచాన్ని సతమతం చేస్తున్నాయి. దానిని సరిగా ఎదుర్కొని ప్రపంచానికి ఒక ఆదర్శం చూపించవలసిన అవసరం ఈ రోజు చాలా ఎక్కవగా ఉన్నది దానిని మనం గుర్తించాలి. మారుతున్న ప్రపంచ పరిస్థితులలో ప్రపంచానికి సరియైన దిశానిర్దేశం చేయగల నాయకత్వం కోసం ప్రపంచం ఎదురుచూస్తున్నది.

స్వాతంత్య్ర పోరాట కాలంలో మన దేశంలో ప్రారంభమైన క్రొత్త క్రొత్త సిద్ధాంతాలు ఈ దేశంలో ఒక సైద్ధాంతిక సంఘర్షణకు తేరలేపాయి. ఆ సిద్ధాంతాలు బలహీనమైన సంఘర్షణ కొనసాగుతూనే ఉన్నది. ఈమధ్య కాలంలో దేశంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు గమనించినట్లయితే సంఘర్షణ స్వరూపం మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌యూనివర్సిటీలో, ఢల్లీలోని జెఎన్‌యూలో కాశ్మీర్‌కు సంబంధించిన విషయంపై సంఘర్షణ జరిగింది. అప్జల్‌గురును ఉరితీయటాన్ని నిరసిస్తూ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ దృష్ట్యా అప్జల్‌గురు ఒక స్వాతంత్య్ర యోధుడు, అట్లాగే బుర్హన్‌వని ఎదురుకాల్పులలో చనిపోయాడు. అతనిని కూడా ఒక షహీద్‌గా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలను అక్కడ పనిచేస్తున్న కొన్ని సంస్థలు వ్యతిరేకించాయి, దాని కారణంగా ఘర్షణలు జరిగాయి. ఒకే దేశంలో దేశం కోసం పనిచేస్తున్న సంస్థలో ఇటువంటి మౌలిక విబేధాలకు కారణాలు ఏమిటి? ఢల్లీ యూనివర్శీటీ విద్యార్థి నాయకుడు కన్హయ్య హైదరాబాద్‌లో, దేశంలో మరికొన్ని చోట్ల మాట్లాడుతూ (India is a Nation of Nation) ఇండియా ఈజ్‌ ఏ నేషన్స్‌ ఆఫ్‌ నేషన్‌ అని అన్నాడు. ఇట్లా ఎందుకు అన్నాడు. అతడి సిద్ధాంతం అతనితో అట్లా మాట్లాడిస్తున్నది. రాజ్యాంగ నిర్మాతలు మన దేశంలో మనం ఇప్పుడే ఒక జాతిగా, దేశంగా రూపొందుతున్నాము అనే భావం వ్యక్తం చేస్తే, కమ్యూనిస్టుల భావాజాలం కలిగిన వారు భారత్‌ జాతుల సమూహారము అని మాట్లాడుతారు. ఇదే ఈ దేశంలో అసలైన మౌలిక సమస్య. అందుకే కమ్యూనిస్టులు కాశ్మీర్‌ను ఒక జాతిగా భావిస్తూ ఉంటే జాతీయవాద సంస్థ కాశ్మీర్‌ను ఒక రాజ్యంగా భావిస్తారు. Nation, State ఆలోచనలో ఎంత అంతరం ఉంటుందో మనకు తెలుసు. ఇందులో సత్యాసత్యాలు ఏమిటి? భారత్‌దేశం వేల సం॥సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఆర్థికంగా, శాస్త్ర, సాంకేతికపరంగా ఒకే విధంగా, ఒక జాతిగా ఉంది. రాజ్యాధికారంగా చూస్తే దేశం మొత్తం 56 రాజ్యాలు ఉండేవి. బ్రిటీష్‌ పాలనకు ముందు వాటిని రాజ్యాలే అనే వారు. ఆలోచనలోనే దేశం వేల సం॥లు ఒక్కటిగా ఉంది. ఎ.కె.గోపాలన్‌ ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు భారత్‌ ఒకే దేశం కాకపోతే ఆదిశంకరాచార్యులకు దేశమంతా తిరగాలనే  ప్రేరణ  ఎందుకు కలిగి ఉంటుంది? అందుకే ఇది ఒకే దేశం అన్నారు. రెండువందల సంవత్సరాలకు పూర్వం మన దేశ చరిత్రలో, సాహిత్యంలో లేని కొన్ని గందరగోళ సిద్ధాంతాలు గడిచిన రెండువందల సం॥లకు పైగా ఈ దేశంలో తలెత్తాయి. దానిలో ఆర్య`ద్రావిడ సిద్ధాంతం, వివిధ జాతుల సిద్ధాంతాలు వచ్చి దేశంలో ఒక గందరగోళవాతావరణం నిర్మాణం చేశాయి. అదే ఈ రోజున జరుగుతున్న సైద్ధాంతిక సంఘర్షణ. ఇది ఒకే దేశం అనే సత్యాన్ని అందరం గుర్తించినప్పుడు ఈ సంఘర్షణకు తెరపడుతుంది.

ఇక్కడ మనం ఇంకో విషయం కూడా ఆలోచించవలసి ఉంది. ఆ విషయాన్ని ఆలోచించేముందు డా॥ అంబేద్కర్‌ 1950 జనవరి 26 నాడు పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చింది ఇంకా దేశంలో రావలసింది సామాజిక ప్రజాస్వామ్యం. సామాజిక ప్రజాస్వామ్యం అనేది ఒక జీవనవిధానం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే ఈ మూడు అంశాలు జీవనానికి అవసరమైనవి. ఈ మూడు ఒకదానితో ఒకటి మమేకమైనవి. వీటిని విడదీస్తే సామాజిక ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. వీటిలో ఏ ఒక్క దానిని విడదదీసిన ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదు. సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల ఆధిపత్యాన్ని నెలకొల్పుతుంది, స్వేచ్ఛలేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. సోదరభావంలేని స్వేచ్ఛ, సమానత్వం సహజంగా ఉండలేవు. అంబేద్కర్‌ ఈ మాటలు చెప్పి 66 సం॥లు గడిచిపోయినాయి. ఈ 66 సం॥లో సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి. సామాజిక ప్రజాస్వామ్యం కోసం అనేక సంస్థలు వ్యక్తులు పనిచేసుకొంటూ వస్తున్నారు. ఆ పనుల యొక్క సకారాత్మకమైన ప్రభావం సమాజం మీద కూడా పడుతున్నది. అంబేద్కర్‌ కాలంలో లేని క్రొత్త సమస్య ఈ రోజులలో చోటుచేసుకున్నది. అదే రాజకీయ ఆధిపత్యం. స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి రాజకీయ అధికారం కోసం జరుగుతున్న పోరాటంలో ఈ సమాజాన్ని చీల్చేటువంటి ప్రయత్నాలు అనేకం జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రజల మధ్య పరస్పర అవిశ్వాసం, విద్వేషం నిర్మాణం చేయటం ఈ దేశంలోని రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. సమాజంలో మతం మార్పిడులు, విద్వేషభావాలు, తీవ్రవాదం, ప్రజలను రెచ్చగొట్టటం ప్రధానంగా పనిచేస్తున్న సంస్థలు అనేకం కనబడుతున్నాయి. దానితో వాళ్ళు ఏమి సాధించదలుచుకొన్నారు అంటే రాజ్యాధికారం, అటువంటి రాజ్యాధికారం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉంది. దేశంలో జరుగుతున్న మంచి పనులను ప్రజల ముందు ఉంచి ఆ మార్గంలో దేశాన్ని నడిపేందుకు ప్రయత్నించాలి కాని, మన దేశంలో మీడియా చిన్న పెద్ద గొడవను పతాక శీర్షికకు ఎక్కించి దేశమంతా ఇట్లాగే ఉంది అని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. హింసా, ఉన్మాదంతో పనిచేస్తున్న సంస్థలను ఎండగట్టేందుకు పనిచేయటం లేదు. ఈ పరిస్థితులను చక్కదిద్దుకొని దేశంలో సామాజిక ప్రజాస్వామ్యాన్ని పటిష్ట పరుచుకోవలసి ఉంది. గడిచిన 1,000, 1200 సం॥ కాలఖండంలో దేశంలో చోటుచేసుకున్న సమస్యలను శాశ్వతంగా రూపుమాపుకొని దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ట పరచుకోవాలి. దేశంలో ఒక సామాజిక సమైక్యతను సాధించాలి. రాజకీయ స్థిరత్వం నెలకొల్పుకోవాలి అదే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న పెద్ద ఆశయం, ఆకాంక్షలు వాటిని సాకారం చేసుకునేందుకు పనిచేయటమే దేశ స్వాతంత్య్రం మనకు ఇచ్చే సందేశం.

– రాంపల్లి మల్లికార్జునరావు

FacebookTwitter