News

గిన్నిస్‌ గూటిలోకి గాన కోకిల

Posted

దక్షిణభారత సినీ గానకోకిల పి.సుశీలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అత్యధిక సంఖ్యలో పాటలు పాడినందుకు ఆమెకు ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కింది. సుశీల ఆరుకు పైగా భాషల్లో 17,695 సోలో, యుగళ, బృంద గీతాలు పాడారని ఆమెకు ప్రదానం చేసిన ధ్రువపత్రంలో గిన్నిస్‌ ప్రశంసించింది. ప్రముఖ గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంతో ఆమె ఆలపించిన యుగళగీతాల సంఖ్య.. రికార్డు స్థాయిలో 1,336 ఉండటం విశేషం.

కొత్తతరం గాయనులకు సుశీల ఒక రోల్‌మోడల్‌, స్ఫూర్తి. ఏ పాటకైనా ప్రాణం పోసే అద్భుత గాయని ఆమె. విడిగా చూస్తే… మామూలుగా అనిపించే గీతాలెన్నో ఆమె గళమాధుర్యంతో జీవం పోసుకున్నాయి.

సుశీల పాటంటే తరగని మాధుర్యం… ఆహ్లాదపరిచే శ్రావ్యత! పాటలోని ప్రతి పదం చక్కగా వినపడేంత స్పష్టత ఆమె ముద్ర. సన్నివేశానుగుణంగా భావయుక్తంగా, సహజంగా, తీయగా పాడటంలో ఆమెది తిరుగులేని ప్రజ్ఞ. ఏ హీరోయిన్‌కు పాడితే అచ్చం ఆమె గొంతే అనిపించే గానం మరో విశిష్టత.

ఏ రకమైన పాటకైనా ఒదిగే గొంతు ఆమెది. అల్లరి పాటలైనా, హాయి పాటలైనా, హాస్యం, విషాదం, వలపు, తలపు… వేటినైనా సరే, ఆ కంఠం అలవోకగా అనువదించుకుంటుంది. అనుపమానంగా ఆలపిస్తుంది. దైవభక్తి, దేశభక్తి గేయాలు, జానపద గేయాలు, బృందగీతాలు, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ గీతాలు, పిల్లల జోల పాటలూ, పండగల పాటలూ, క్లబ్‌ పాటలూ… ఇలా వైవిధ్యభరితమైన వేల పాటలు! తరతరాల తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షక శ్రోతలను తన గానామృతంతో ఓలలాడించారు.

తొలి పాట…: ఆమె సినీరంగ ప్రవేశం చేసింది 1952లో. అప్పటికే బాలసరస్వతీదేవి, జిక్కి, పి.లీల, ఎం.ఎల్‌. వసంతకుమారి లాంటి ప్రతిభావంతులైన గాయనులుండేవారు. వారి మధ్య తన ఉనికిని చాటుకోవటం అంత సులువైన పని కాదు. దాన్ని ఆమె కొద్దికాలంలోనే సాధించగలిగారు.

ఆమె మొదటి పాట ‘కన్నతల్లి’ చిత్రంలోది. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ‘ఎందుకు పిలిచావెందుకు’ అన్న ఆ పాటను ఎ.ఎం. రాజాతో కలిసి పాడారు.

1956వ సంవత్సరం సుశీల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది. అంతవరకు చిన్నచిన్న పాత్రలకు తన కంఠాన్నిస్తూ వచ్చిన సుశీల మొదటిసారిగా కథానాయిక (సావిత్రి) పాత్రకు ‘తోడికోడళ్ళు’ చిత్రంలో పాడారు. ఆ పాటతో సుశీల ప్రాచుర్యం ఎంతగానో ఇనుమడించింది.

అందుకే తెలుగులో 1955 నుంచీ చాలాకాలం వరకూ ఆమె పాట లేని సినిమా దాదాపు లేదని చెప్పొచ్చు. 1960ల నుంచి 1970ల తొలి భాగం వరకూ ఆమె కెరియర్‌లోనే అత్యుత్తమమని సంగీతాభిమానులు భావిస్తారు.

పన్నెండు భాషల్లో…: ఆరు దశాబ్దాల్లో 12 భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, పడుగు, సింహళీస్‌, మరాఠీ) ఆమె పాటలు పాడారు. విజయనగరం మహారాజా కళాశాలలో ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద అభ్యసించిన శాస్త్రీయ సంగీతం దీనికి పునాదిగా పనిచేసింది.

ఒకే కుటుంబంలోని రెండు తరాలతో కలిసి సుశీల పనిచేశారు. నటి జయచిత్రకూ, ఆమె తల్లి అమ్మాజీకీ నేపథ్యగానం అందించారు. ఎస్పీ బాలుతో, ఆయన కొడుకు చరణ్‌తో; కె.జె. ఏసుదాసుతో, ఆయన కుమారుడు విజయ్‌ ఏసుదాస్‌తో కలిసి పాడారు. ఇళయరాజా, ఆయన కొడుకు కార్తీక్‌రాజా… ఇద్దరి సంగీత దర్శకత్వంలో పాడారు. సహ గాయని ఎస్‌. జానకితో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సింహళీస్‌ భాషల్లో పాడారు. తెలుగులో వీరిద్దరూ కలిసి పాడిన పాటలు 90కి పైగా ఉన్నాయి.

ఏమీ తెలియని భాషలోని పాటలో కవి పొదిగిన భావం సంపూర్ణంగా వ్యక్తమయ్యేలా, ఆ భాషలోని శ్రోతలను మైమమరిపించేలా పాడటం ఎంత కష్టం! అరుదైన ఆ ఫీట్‌ను సుశీల అలవోకగా సాధించారు.

పురస్కారాలెన్నో: 2008లో సుశీలను పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించారు. 2001లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య పురస్కారం పొందారు. ఐదుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా ఎంపికయ్యారు. 1969, 1971లలో తమిళ పాటలకు ఆ పురస్కారం వచ్చింది. 1978లో ‘ఝుమ్మంది నాదం సైయ్యంది పాదం’ (సిరిసిరిమువ్వ), 1982లో ‘ప్రియే చారుశీలే’ (మేఘసందేశం), 1983లో ‘ఎంత బీదవాడే గోపాలుడు వేణుగోపాలుడు’ (ఎం.ఎల్‌.ఎ. ఏడుకొండలు) పాటలకు జాతీయ అవార్డును అందుకున్నారు.

తెలుగు సినీసంగీత స్వర్ణయుగ చరిత్రలో సుశీలది ఘనతర అధ్యాయం!

– సిహెచ్‌. వేణు
(ఈనాడు సౌజన్యం తో)