Articles

కాల గణన – భారతీయుల విశిష్టత

Posted
FacebookTwitter

ప్రతి సం॥ చైత్రమాసం పాడ్యమిరోజున ఉగాది పండుగ జరుపుకొంటాము. ఈనెల 8వ తేది ఉగాది పండుగ. ఈ రోజు నుండి దుర్ముఖినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. భారతీయ కాలగణన చాలా శాస్త్రీయమైనది. ఈ కాలగణన గ్రహా సంచారముతో నిర్ణయిస్తారు. భారతీయ కాలగణనలో మనం మూడు పద్ధతులు అనుసరిస్తాము. 1) సూర్యమానం 2) చాంద్రమానం 3) బార్హస్పుృత్య మానము

మన కాలగణన క్రమం చూస్తే 1) మన్వంతరము 2) యుగము 3) శకము 4)ఆయనము 5) ఋతువు 6) సంవత్సరం 7) మాసము 7) తిథి, వారము, నక్షత్రం ఈ క్రమంలో చెప్తాము. వాటి వివరాల్లోకి వెలితే.. ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరము. కలియుగము, ప్రథమ పాదము, ఉత్తరాయణము, వసంత ఋతువు, దుర్ముఖి నామ సంవత్సరం, చైత్రమాసము, పాడ్యమి తిథి, శుక్రవారము అశ్వనీ నక్షత్రం.

ఈ సంవత్సరాలకు సంబంధించి ఒక ఆవర్తనం ఉంటుంది. 60 సంవత్సరాలు ఒక ఆవర్తనము. అందులో ఈ దుర్ముఖినామ సంవత్సరం 30వ సంవత్సరం. యుగాలకు సంబంధించి 1) కృతయుగము 2) త్రేతాయుగము 3) ద్వాపర యుగము 4) కలియుగము. ప్రతి యుగానికి నాలుగు పాదాలుంటాయి. ఇప్పుడు కలియుగం ప్రథమ పాదం నడుస్తున్నది.

కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది?
మహా భారత సంగ్రామం తరువాత ధర్మరాజు 36 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు. ఆ రోజుల్లో ద్వారకా పట్టణం సముద్రంలో మునిగిపోయింది. భగవాన్‌ శ్రీ కృష్ణుడు తన అవతార పరిసమాప్తమైన రోజు అర్థరాత్రి నుండి కలియుగం ప్రారంభమైంది. అంటే ఇప్పటి క్రీ॥ శకం ప్రకారం చూస్తే క్రి.స్తూకు పూర్వం 3102 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేది అర్థరాత్రి 02.27ని॥ల 30 సె॥ల నుండి కలియుగం ప్రారంభమైంది. దీనికి ప్రమాణం ఖగోళమే. ఖగోళంలోని 1) శని 2) గురువు 3) కుజుడు 4) సూర్యుడు 5) శక్రుడు 6) బుధుడు 7) చంద్రుడు ఈ ఏడు గ్రహాలు మేష రాశితో కూడి ఉన్న సమయంలో కలియుగం ప్రారంభమైంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి.

ఈ లెక్క గనుక మనం చూసినట్లైతే ఈ సంవత్సరం (2016+3102) 5118వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. ఈ కాల గణనలో చారిత్రకంగా మనకు గర్వకారణమైన సంఘటనలు ఆధారంగా శకాలు ప్రారంభమైనాయి. పంచాంగంలో గనక మనం చూసినట్తైతే మూడు శకాలను ప్రముఖంగా చెప్తూ ఉంటారు. అందులో 1) యుధిష్టీర శకం 2) విక్రమార్క శకం 3) శాలివాహన శకం. ఈ మూడింటిలో ఉత్తర భారతంలో విక్రమార్క శకం ఎక్కువగా వాడుకలో ఉన్నది. శాలివాహన శకం దక్షిణ భారతంలో ఎక్కువ వాడకంలో ఉన్నది. ఈ శకాల ప్రాముఖ్యతను గమనిద్దాం.

యుధిష్టీర శకం
ధర్మరాజు కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించిన తరువాత పట్టాభిషేకం జరిగిన రోజు నుండి యుధిష్టీర శకం ప్రారంభమైంది. కురుక్షేత్ర సంగ్రామం ధర్మం కోసం జరిగినటువంటి ఒక మహా యుద్ధం. ఆ యుద్ధంలో ధర్మం జయించింది. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అంటూ ఉంటారు. మహా భారత కాలంలో మన వేదాలను, ఉపనిషత్తులను క్రమబద్దీకరణ చేసినవాడు వేదవ్యాసుడు. పంచమ వేదమైన మహా భారతం కూడా వేదవ్యాసులు రచించారు. వీటన్నింటి ప్రాశిస్థాన్ని తెలిపేది ఈ యుధిష్టీర శకం. ఈ శకం ప్రారంభమై ఇప్పటికి ఎంతకాలమైంది అని మనం చూసినట్తైతే కలియుగం ప్రారంభమై 5118వ సంవత్సరం దానికి 36 సంవత్సరాలు కలిపినట్లైతే 5154 సంవత్సరాలవుతుంది. అంటే యుధిష్టీర శకం 5154వ సంవత్సరంలో ఇప్పుడు ప్రవేశించింది.

విక్రమార్క శకం
మన దేశంపైన శకులు దాడులు చేస్తూన్న రోజుల్లో వాళ్ల దాడులను తిప్పిక్రొట్టి అద్భుత విజయాన్ని సాధించినవారు విక్రమార్కుడు. శకులను దేశ సరిహద్దులకు తరిమి వేసినవాడు విక్రమార్కుడు. విక్రమార్కుడు తన 20వ సంవత్సరం వయస్సు నుండి శకుల మీద పోరాటం చేయడం ప్రారంభించాడు. ఆ దాడుల్లో సంపూర్ణ విజయం సాధించింది కలియుగం 3044వ సంవత్సరం. అందుకే ఆ రోజు నుండి విక్రమార్క శకం అని ప్రారంభించబడింది. దీని ప్రకారం ఈ 5118-3044=2074, అంటే విక్రమార్క శకం ప్రారంభమై ఈ సంవత్సరానికి 2073 పూర్తై 2074లోకి ప్రవేశించింది. విక్రమార్కుడు 80 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. శకులపై విజయానికి చిహ్నంగా విక్రమార్క శకం ప్రారంభమైంది.

శాలివాహన శకం
విక్రమార్కుని తరువాత అతని కుమారుడు దేవభక్త రాజ్యపాలన చేశాడు. దేవభక్త కుమారుడే శాలివాహనుడు. అంటే విక్రమార్కుని మనుమడు. శాలివాహనుడు శకులను పూర్తిగా సర్వనాశనం చేసిన ఖ్యాతి దక్కించుకున్నవాడు. శకులను మన దేశ సరిహద్దు దాటించి సంపూర్ణంగా నాశనం చేసినవాడు. శకులు దోచుకునిపోయిన సంపదనంతా తిరిగి తీసుకునివచ్చినవాడు. ఈ అద్భుత విజయం సాధించినది కలియుగంలో 3179వ సంవత్సరంలో. అప్పటి నుండి ఈ శాలివాహన శకం ప్రారంభమైంది. అంటే 5118-3179=1939వ సంవత్సరంలో మనం ఇప్పుడు ప్రవేశించాం.

ఈ విధంగా శకాలను మనం మన చరిత్రకు గర్వకారణంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో మనం చరిత్రలోకి ముందుకు వెళ్తూ మన దేశాన్ని బ్రిటీష్‌ వాళ్లు పాలిస్తున్న రోజుల్లో ఈ జాతిలో ఐక్యమత్యం నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి డా॥ కేశవరావు బలిరాం పంత్‌ హెగ్డేవార్‌ 1889 సంవత్సరం ఏప్రిల్‌ 1వ తేదీన ఉగాది పండుగ రోజున జన్మించారు. డా॥ కేశవరావు 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించారు. ఈరోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దేశవ్యాప్తంగా సమాజంలోని అన్ని రంగాలోకి ప్రవేశించి పనిచేస్తున్నది. దేశ ప్రజలలో ఒక విశ్వాసాన్ని నిర్మాణం చేస్తున్నది. గడిచిన 1000 సంవత్సరాల నిరంతర సంఘర్షణల చరిత్ర నుండి పూర్తిగా బయటపడి హిందూ సమాజం శక్తివంతంగా నిలబడటానికి సంఘం కృషి చేస్తున్నది. సంఘం ఈరోజు దేశవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన సంఘటనగా నిలబడింది. ఈ రకంగా చరిత్రలో మన జ్యాతికి గర్వకారణమైన సందర్భాలను జ్ఞాపకం చేసుకోవటం మనం సరియైన మార్గంలో ముందుకు వెళ్లటానికి దోహదపడుతుంది.

ఈ ఉగాది పండుగతో త్రేతాయుగంలో జన్మించిన భగవాన్‌ శ్రీరామ చంద్రుని చరిత్ర ముడిపడి ఉంది. శ్రీరామ నవమి ఉత్సవాలు ఉగాది పండుగ నుంచి ప్రారంభమై చైత్రశుద్ధ నవమి వరకు జరుగుతాయి. శ్రీరామ చంద్రుని చరిత్ర మనకు ఏం తెలియజేస్తుంది? శ్రీరామ చంద్రుని ధర్మదేవత ప్రతిస్వరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాము. అందుకే ధర్మాన్ని రక్షించటమే మన అందరి కర్తవ్యం అని రాముడి చరిత్ర మనకు బోధిస్తుంది. ఈ విధంగా ఉగాది పండుగ అనేక కోణాలలో మనకు ప్రేరణనిస్తున్నది.

అందరికి శ్రీ దుర్ముఖినామ సంవత్సర శుభాకాంక్షులు
ఆర్‌.మల్లికార్జునరావు

FacebookTwitter