ArticlesNews

తెలంగాణలో నిర్వహించిన అయుత చండీ యాగం విశిష్టత

Posted
FacebookTwitter

యాదేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోన్నమః

చండీ మాత చాలా ఉగ్ర రూపంతో ఉంటుందని చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. కానీ, అమ్మ కోపం ధర్మాగ్రహం. పిల్లలను సన్మార్గంలో నడిపేందుకు తల్లి చూపే కోపం వంటిదే అమ్మ కోపం కూడా. ఆమె అనుగ్రహం పొందడానికి ప్రత్యేక కారణం ఉంది.

అసలు చండీ మాత ఎవరు:

చండీ మాత చాలా ప్రచండ శక్తి. ఒక్క భూగ్రహమే కాకుండా విశ్వాంతరాళాలలోని సమస్త శక్తులూ ఆమెను అంటిపెట్టుకునే ఉంటాయి. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి,  క్రియాశక్తి,  కుండలినీ శక్తి! అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం.

లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని సీ్త్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.

చండీ హోమం లో ఉన్న మంత్రాలు & అధ్యాయాలు :

చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రాహ్మీ, నందజా, రక్తదంతికా, శాకంబరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది.

దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, నియుత (లక్ష) చండీ యాగం, ప్రయుత (పది లక్షలు) చండీ యాగం ఉంటాయి.

Ayutha-Chandi-Yagam-Photos7

చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు:

ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది.

కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.

వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట.ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మను చండి (చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక, శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి. లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండి అంటారు. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు.

వీటిలో చండీ హోమం, నవ చండీ, శత చండీ యాగాలను తరచుగా, సహస్ర చండీ యాగాలను అరుదుగా చేస్తుంటారు. అయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు.

ఇంతకు పూర్వం ఎవరైనా చేసారా?

గత 200 ఏళ్లలో అయుత చండీ యాగాన్ని రెండే రెండుసార్లు చేశారు. మొదటిసారి శృంగేరీ పీఠాధిపతి షష్టిపూర్తి సమయంలో చేస్తే.. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. ఇక, లక్ష చండీ యాగం కూడా తెలంగాణలోనే జరిగింది.

నిజాం పాలన కాలంలో పాతబస్తీలో మహారాష్ట్రకు చెందిన ఉపేంద్ర మహరాజ్ లక్ష చండీ యాగం చేశారు. లోక కల్యాణం కోసం మరియు నిజాం సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనం కావాలనే సంకల్పంతో ఈ యాగం చేశారు. భారత ప్రభుత్వం చక్రవర్తి కావాలని కూడా ఆయన సంకల్పించారు. యాగ ఫలంగా భారతమాత కశ్మీరు, నిజాం సంస్థానాలను కూడా స్వాధీనం చేసుకుని చక్రవర్తిత్వం సంపాదించింది. ఇంతకీ, అప్పట్లో దక్షిణ ఎంతో తెలుసా!?? కేవలం ఒకే ఒక్క రూపాయి. పాతబస్తీలోని ఒక చిన్న హాలులో 30 పీటలు వేశారట. చండీ ఉపాసన ఉన్నవాళ్లు అక్కడికి రావడం, ఆ పీటల మీద కూర్చుని చండీ సప్తశతి పారాయణ చేయడం, రూపాయి తీసుకుని వెళ్లిపోవడం. ఇలా కొంత కాలంపాటు సాగిందట. అప్పట్లో ఆయన స్థాపించిన గోశాల 500 గోవులతో ఇప్పటికీ పాతబస్తీలో ఉంది.

చండీ యాగం ఎలా చేస్తారు:

సాధారణంగా గణపతి హోమం, అయుష్య హోమం, మృత్యుంజయ హోమం తదితరాలను ఎవరో ఒక దేవుడు లేదా దేవతను ఉద్దేశించి చేస్తారు. కానీ, చండీ యాగంలో మాత్రం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి ముగ్గురికీ కలిపి పూజలు నిర్వహిస్తారు.

అయుత చండీ యాగాన్ని 100 హోమ కుండాలతో చేస్తారు. యజమాని హస్త ప్రమాణం ఆధారంగా తీసుకుని చేస్తారు. దీనిని వంద సృక్లు, 1000 సృవలతో చేస్తారు. సృక్, సృవాలు అంటే హోమంలో నెయ్యిని వేయడానికి ఉపయోగించే పాత్రలు. 4000 కిలోల బియ్యం, 5000 కిలోల బెల్లం, 4000 కిలోల నెయ్యి తదితరాలతో శాస్త్ర ప్రమాణంగా నిర్ణయించిన హోమ ద్రవ్యాలను ఉపయోగిస్తారు.

ayutha_chandi_yagam-_day_2_8_20151224_1841789589

ఐదు రోజులు జరిగే అయుత చండీ యాగంలో 1000 మంది రుత్విక్కులు ఉంటారు.

మొదటి రోజు 1000 చండీ సప్తశతి పారాయణాలు, 40 లక్షల నవావరణ మంత్ర జపం చేస్తారు.

రెండో రోజు 2000 సప్తశతి పారాయణాలు, 30 లక్షల నవావరణ మంత్ర జపం;

మూడో రోజు 3000 పారాయణాలు, 20 లక్షల నవావరణ మంత్ర జపం;

నాలుగో రోజు 4000 చండీ సప్తశతి పారాయణాలు, పది లక్షల నవావరణ మంత్ర జపం చేస్తారు.

ఐదో రోజు అగ్ని ప్రతిష్ట చేసి, ఆహుతులతో అమ్మవారికి పరమాన్న ద్రవ్యంతో ఆజ్య హోమం, అంగ, ఆవరణ, పీఠ దేవతలకు ఆజ్య హోమం, తర్పణం చేసి, ఇంద్ర శక్త్యాది దేవతలకు బలిదానం, పూర్ణాహుతి, దంపతి, సువాసిని, కన్యక పూజలు, అవభృత్యం, అన్న సంతర్పణతో హోమాన్ని పూర్తి చేస్తారు.

ఐదు రోజుల్లో నాలుగు వేదాల్లోని ప్రతి ఒక్క మంత్రంతో హోమం, దుర్గా హోమం, శ్రీసూక్త హోమం, గౌరీ హోమం, సరస్వతీ హోమం, మహాసౌరం చేస్తారు. ముత్తయిదువలతో కుంకుమార్చన చేస్తారు. ఆఖరి రోజు అగ్ని ప్రతిష్ట చేసి, 70 లక్షల ఆహుతుల (అయుతం అంటే పది వేలు. సప్తశతి అంటే 700 ఇంటు 10,000); అమ్మ వారికి పరమాన్న ద్రవ్యంతో, పది లక్షల నవావరణ మంత్ర జపంతో ఆజ్య హోమం, అంగ, ఆవరణ, పీఠ దేవతలకు ఆజ్య హోమం, తర్పణం చేసి ఇంద్ర శక్త్యాది దేవతలకు బలిదానం, పూర్ణాహుతి, దంపతి, సువాసినీ, కన్యక పూజలు జరిపి అవభృత్యంతో యాగ సమాప్తి చేస్తారు.

నవ చండీ యాగంలో 9 సప్తశతి పారాయణలు; శత చండీ యాగంలో వంద పారాయణాలు, లక్ష నవార్ణ మంత్ర జపం; సహస్ర చండీ యాగంలో వెయ్యి పారాయణాలు, పది లక్షల నవార్ణ మంత్ర జపం; అయుత చండీ యాగంలో పది వేల పారాయణాలు, కోటి నవార్ణ మంత్ర జపం చేస్తారు. పారాయణలో పదో వంతు హోమం, పదో వంతు తర్పణలు ఇస్తారు. శత చండీ యాగంలో పది మంది; సహస్ర చండీ యాగంలో వంద మంది పాల్గొంటారు.

అంటే, మొత్తం పది వేల చండీ సప్తశతి పారాయణాలు, కోటి నవావరణ మంత్ర జపం అన్నమాట. అన్ని యాగాల్లోనూ మొదటి నాలుగు రోజులూ ప్రతిరోజూ నవావరణ పూజ, చతుష్షష్టి యోగినీ పూజ, దీప సహిత బలి, కల్పోక్త పూజతోపాటు కుంకుమార్చన చేస్తారు. ఇవి కాకుండా చతుర్వేద పారాయణలు, శాస్త్ర, సంగీత, ఇతిహాస, పురాణ సేవలు వంటి అవధారలు చేస్తారు.

పాటించవలసిన నియమాలు:

చండీమాత ఉగ్ర స్వరూపిణి కనక అత్యంత జాగరూకతతో ఉండాలి. నవావరణ మంత్ర ఉపదేశం తీసుకున్న పరమ నిష్ఠాగరిష్ఠులైన 1500 మంది రుత్విక్కులు అయుత చండీ యాగంలో పాల్గొంటారు. ప్రారంభం నుంచి పరి సమాప్తి వరకు ప్రతి ఒక్కరూ ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు.

యాగశాలలో పచ్చి మంచినీళ్లు కూడా తాగరు. బ్రహ్మచర్యం పాటిస్తారు. రెండు పూటలా స్నానం చేస్తారు. దీక్ష వస్త్రాలను ధరిస్తారు. యాగశాలలోకి దీక్ష ఉన్నవారు మాత్రమే వస్తారు. ఇతరులకు ప్రవేశం ఉండదు. దేవనాంది చేయడం వల్ల వారికి జాతా శౌచ, మృత శౌచాలు అంటవు. ఈ యాగంలో దశ దానాలు, షోడశ దానాలు విశేషంగా చేస్తారు.

ఇక్కడకి వచ్చే భక్తులు కూడా యాగ పవిత్రతను కాపాడాలి. యాగాన్ని చేసిన వారు, చేయించినవారు, ప్రేరేపించినవారు.. అంతా యాగ ఫలాన్ని సమంగా పొందుతారు. కనక, రజస్వల, బహిష్టు అయినవాళ్లు, జాతాశౌచం, మృతాశౌచం ఉన్నవాళ్లు, ఈ నియమాలను ఇంటి వద్ద పాటించని ఇతర బంధుగణం యాగస్థలికి రాకూడదు. యాగ ప్రదేశానికి మద్యం, మాంసం సేవించి రాకూడదు. యాగ పరిసరాల్లో ధూమపానం నిషేధం.

FacebookTwitter